మరణాలు



అధికార భాషా సంఘం తొలి అధ్యక్షుడు దేవులపల్లి మరణం

→రాష్ట్ర అధికార భాషా సంఘం తొలి అధ్యక్షుడు, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు (84) మరణించారు.
→ తెలంగాణ సారస్వత పరిషత్తుకు సారథ్యం వహించిన దేవులపల్లి రామానుజరావు సోదరుడైన ప్రభాకర్‌రావు ఉమ్మడి వరంగల్‌ జిల్లా, దేశాయిపేటలో వేంకట చలపతిరావు, ఆండాళ్లమ్మ దంపతులకు 1938లో జన్మించారు.
→ వరంగల్, హైదరాబాద్‌లలో విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. 1960 నుంచి పలు తెలుగు పత్రికల్లో కాలమిస్టుగా పనిచేశారు.
→ ఫీచర్‌ రచయితగా, అనువాదకుడిగా ఆయనకు ‘ఈనాడు’తో 20 ఏళ్ల అనుబంధం ఉంది. 1968లో రాసిన ‘మహాకవి గురజాడ జీవితచరిత్ర’ పుస్తకానికి యునెస్కో పురస్కారం లభించింది.
→ ‘మహాకవి గురజాడ జీవితం - సాహిత్యం’ అనే గ్రంథానికి భారత ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రభాకర్‌రావు 1969లో డా.మర్రి చెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణ ప్రజాసమితిలో కీలకభూమిక పోషించారు.
→ 2001లో కేసీఆర్‌ నాయకత్వంలో మొదలైన తెలంగాణ ఉద్యమంలో పదునైన వ్యాసాలతో పోరాటానికి ఊపిరులూదారు.
→ రాష్ట్రం ఏర్పడ్డాక, 2016 ఏప్రిల్‌ 27న తెలంగాణ అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, తొలి అధ్యక్షునిగా దేవులపల్లి ప్రభాకర్‌రావును నియమించారు. ఆయన ఈ పదవిలో రెండు పర్యాయాలు కొనసాగారు.

పోరాట యోధురాలు కొండపల్లి దుర్గాదేవి మరణం

→తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) సీనియర్‌ నాయకురాలు కొండపల్లి దుర్గాదేవి (89) మరణించారు.
→తండ్రి వీర రాఘవరావు, భర్త, మాజీ ఎమ్మెల్యే కె.ఎల్‌.నరసింహారావుల ప్రభావంతో వామపక్ష ఉద్యమాల వైపు ఆకర్షితురాలయ్యారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు.
→కార్యకర్తలకు రహస్యంగా ఆయుధాలను చేరవేయడంలో ఆమెది కీలక భూమిక. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐద్వా పునరుద్ధరణకు కృషి చేశారు.
→1974లో జరిగిన తొలి మహాసభలో దుర్గాదేవి ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారు. ఖమ్మం జిల్లాలో మహిళా ఉద్యమం బలోపేతానికి ఎంతో శ్రమించారు.
→ మహిళల సమస్యల పరిష్కారానికి తుదివరకూ పోరాడారు. సీపీఎం నాయకురాలిగా వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆమె భర్త కె.ఎల్‌.నరసింహారావు ఇల్లందు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఉమ్మడిరాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.

అంతర్జాతీయ రిఫరీ అనుపమ మరణం

→భారత్‌ నుంచి తొలి మహిళా అంతర్జాతీయ హాకీ రిఫరీగా పేరు తెచ్చుకున్న అనుపమ పుంచిమంద (40) కొవిడ్‌ బారిన పడి మరణించారు. ఆమె 2004లో అంతర్జాతీయ రిఫరీ అయింది.
→2005 జూనియర్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌తో పాటు 2013 హాకీ వరల్డ్‌ లీగ్‌-2, 2013 మహిళల ఆసియా కప్‌ లాంటి టోర్నీల్లో విధులు నిర్వర్తించింది.

ప్రపంచలోనే అత్యంత ఎక్కువ వయసున్న 119 ఏళ్ల కానే ఠనాకా మరణం

→ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించిన కానే ఠనాకా 119వ ఏట మరణించారు. నైరుతి జపాన్‌లోని ఫుకోకా పట్టణానికి చెందిన ఆమె ఏప్రిల్‌ 19న మరణించారని జపాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.
→2019 మార్చి నెలలో గిన్నిస్‌ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా కానేను గుర్తించింది.
→అప్పటికి ఆమెకు 116 ఏళ్లు. అలాగే 2020 సెప్టెంబరులో అత్యంత ఎక్కువ కాలం జీవించిన జపాన్‌ వ్యక్తిగా కానే రికార్డు సృష్టించారు. అప్పటికి ఆమె వయసు 117 సంవత్సరాల 261 రోజులు.
→ప్రపంచంలోనే సుదీర్ఘ కాలం బతికిన రెండో వ్యక్తిగా కూడా ఆమె రికార్డులకు ఎక్కారు. రైట్‌ సోదరులు విమానాన్ని కనిపెట్టిన 1903వ సంవత్సరంలో జనవరి రెండో తేదీన కానే జన్మించారు.
→ సోడా, చాక్లెట్‌ సహా రుచికరమైన ఆహారం తీసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడమే తన సుదీర్ఘ ఆయువుకు కారణమని కానే చెప్పేవారు.
→ ఠనాకా మృతితో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా ఫ్రాన్స్‌ మహిళ లుసిలీ రాండన్‌ నిలిచారు. ఆమె వయసు 118 సంవత్సరాల 73 రోజులు.

కెన్యా రాజకీయ దిగ్గజం కిబకి మరణం

→కెన్యా మాజీ అధ్యక్షుడు, దేశ రాజకీయాల్లో పలు కీలక పాత్రలు పోషించిన మ్వాయ్‌ కిబకి (90) మరణించినట్లు కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్ట ప్రకటించారు.
→ కిబకి 2002 నుంచి 2013 వరకూ రెండు దఫాలు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఉపాధ్యక్షుడిగా, ఆర్థిక మంత్రిగా, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు.
→ 2007లో రెండోసారి అధ్యక్షుడిగా గెలిచినప్పటికీ ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు, అనంతరం రేగిన హింసతో ఆయన ప్రతిష్ఠ మసకబారింది.

పౌల్ట్రీ రంగ దిగ్గజం సుందరనాయుడు మరణం

→బాలాజీ హేచరీస్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉప్పలపాటి సుందరనాయుడు (85) మరణించారు. పశువైద్యుడిగా వృత్తిని ప్రారంభించిన సుందరనాయుడు కోళ్ల పరిశ్రమలో ప్రవేశించి ఆ రంగం అభివృద్ధికి అపార కృషి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. చిత్తూరులో బాలాజీ హేచరీస్‌ స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. ఔత్సాహికులకు దార్శనికుడిగా నిలిచారు.
→ సుందరనాయుడు 1936 జులై 1న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కంపలపల్లెలో గోవిందునాయుడు, మంగమ్మ జన్మించారు. కొంతకాలం చిత్తూరు జిల్లా పీలేరులో పశువైద్యుడిగా పని చేశారు.
→ పౌల్ట్రీ రంగానికి చేసిన కృషికి గానూ అనేక అరుదైన గౌరవాలు అందుకున్నారు. పుణెలోని బి.వి.రావు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వ్యవస్థాపక ట్రస్టీగా వ్యవహరించారు. ‘నెక్‌’ జీవిత కాల ఆహ్వాన సభ్యుడిగా, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్‌ శాశ్వత ఆహ్వాన సభ్యుడిగా, అంతర్జాతీయ పౌల్ట్రీ సైన్స్‌ అసోసియేషన్‌ సభ్యుడిగా, ఎగ్‌ కౌన్సెల్‌ సభ్యుడిగా విశేష సేవలందించారు. న్యూజెర్సీ ప్రభుత్వం ‘డూయర్‌ ఆఫ్‌ ది పౌల్ట్రీ ఇన్‌ సౌత్‌ ఇండియా’ పురస్కారంతో సత్కరించింది.
→ హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైడ్‌ బేస్డ్‌ అడ్వయిజరీ బోర్డు సభ్యులుగా, ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక కమిటీ బోర్డు సభ్యులుగా, చిత్తూరు జిల్లా కోళ్ల రైతుల సంఘం అధ్యక్షులుగా, విజయవాడలోని ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షులుగా సేవలందించారు.
→ 1961లో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌గా ఆరున్నరేళ్లుగా చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని పౌల్ట్రీ రంగం వైపు అడుగులు వేశారు. 1968 ఫిబ్రవరిలో చిత్తూరులో 2 వేల కోడిపిల్లలతో ‘శ్రీ వెంకటేశ్వర పౌల్ట్రీఫాం’ను ప్రారంభించారు. ఆ తర్వాత సుందరనాయుడు అందించిన సహాయ సహకారాలు, స్ఫూర్తితో ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, తమిళనాడులలో వేల పౌల్ట్రీఫారాలు ఏర్పాటయ్యాయి. సీమ, నెల్లూరు జిల్లాల్లోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది ఉపాధి పొందుతున్నారు.
→ దేశ పౌల్ట్రీ రంగ మార్గదర్శకుడైన బి.వి.రావుతో కలిసి ‘నా గుడ్డు- నా జీవితం - నా ధర’ నినాదంతో విస్తృతంగా ప్రచారం చేశారు. దాని పర్యవసానంగా నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటైంది.

రోడ్డు ప్రమాదంలో టీటీ ఆటగాడి మరణం

→తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాడు విశ్వ దీనదయాళన్‌ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. గువాహటి నుంచి షిల్లాంగ్‌ వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో విశ్వ మరణించాడు.
→ఏప్రిల్‌ 18న ప్రారంభమైన జాతీయ సీనియర్, అంతర్‌ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు మరో ముగ్గురు ఆటగాళ్లతో కలిసి విశ్వ ట్యాక్సీలో బయల్దేరాడు.
→‘‘రోడ్డుకు అటువైపు నుంచి వస్తున్న 12 టైర్ల భారీ వాహనం షాంగ్‌ బంగ్లా దగ్గర డివైడర్‌ మీద నుంచి దూసుకొచ్చి ట్యాక్సీని ఢీకొట్టింది’’ అని టీటీఎఫ్‌ఐ పేర్కొంది.
→జాతీయ ర్యాంకింగ్‌ టోర్నీల్లో సత్తాచాటిన విశ్వ.. ఏప్రిల్‌ 27న ఆరంభం కానున్న డబ్ల్యూటీటీ యూత్‌ కంటెండర్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాల్సింది.

ప్రముఖ గాయకుడు ప్రఫుల్ల కర్‌ మరణం

→ప్రముఖ గాయకుడు, సాహితీవేత్త, సంగీత దర్శకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రఫుల్ల కర్‌ (83) మరణించారు. వృద్ధాప్యం వల్ల ఏర్పడిన రుగ్మతలతో భువనేశ్వర్‌లోని షాహిద్‌ నగర్‌ ప్రాంతంలో ఉన్న నివాసంలో మరణించారు.
→ఆయన 40కి పైగా ఒడియా సినిమాలు, అయిదు బెంగాలీ సినిమాల్లో ఆయన పాటలు పాడారు. ఆయన జగన్నాథుని భజనలు, ఆల్బంలు ఆదరణ పొందాయి. 2004లో రాష్ట్రంలో గౌరవప్రదమైన జయదేవ్‌ అవార్డు అందుకున్నారు.
→2015లో పద్మశ్రీ పురస్కారం స్వీకరించారు. ఎనిమిదిసార్లు ఉత్తమ గాయకుడిగా సత్కారం అందుకున్నారు.

సన్మార్‌ ఛైర్మన్‌ ఎన్‌.శంకర్‌ మరణం

→సన్మార్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.శంకర్‌ (77) అనారోగ్యంతో మరణించారు. కుమారుడు విజయ్‌ శంకర్‌ కంపెనీ డిప్యూటీ ఛైర్మన్‌గా, సోదరుడు శంకర్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
→అసోచామ్‌ అధ్యక్షుడు, ఇండో - అమెరికా జాయింట్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ ఛైర్మన్, మద్రాస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, మద్రాస్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌లకు శంకర్‌ పనిచేశారు.

సీనియర్‌ నటుడు మన్నవ బాలయ్య మరణం

→నిర్మాతగా, కథా రచయితగా, దర్శకుడిగా తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసిన సీనియర్‌ నటుడు మన్నవ బాలయ్య (92) మరణించారు. హైదరాబాద్‌ యూసఫ్‌గూడలోని నివాసంలో ఆయన మరణింనచిట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గుంటూరు జిల్లా చావపాడులో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకి 1930 ఏప్రిల్‌ 9న జన్మించిన ఆయన తన పుట్టిన రోజునాడే మరణించారు.
→ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బాలయ్య ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. అధ్యాపకుడిగా పనిచేశారు. చదువుకునేటప్పుడు నాటకాలతో ఏర్పడిన అనుబంధం వల్ల చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
→ ‘ఎత్తుకు పైఎత్తు’ సినిమాతో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన ఆయన, 350కిపైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేశారు. కథానాయకుడిగా, సహనటుడిగా మంచి పేరు సంపాదించారు. సీనియర్‌ తారలు ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో పాటు, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, శ్రీకాంత్‌ తదితర కథానాయకులతో కలిసి పలు చిత్రాల్లో తెర పంచుకున్నారు. ‘భూకైలాస్‌’, ‘పార్వతీ కల్యాణం’, ‘ఇరుగు పొరుగు’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘పాండవ వనవాసం’, ‘మొనగాళ్లకి మొనగాడు’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘ప్రాణ స్నేహితులు’, ‘పెళ్లిసందడి’, ‘అన్నమయ్య’, ‘మన్మథుడు’, ‘శ్రీరామరాజ్యం’ తదితర చిత్రాలు ఆయనకి మంచి గుర్తింపుని తెచ్చాయి. టెలివిజన్‌తోనూ ఆయనకి అనుబంధం ఉంది. పలు ధారావాహికల్లో మెరిశారు.
→ అమృతా ఫిలిమ్స్‌ సంస్థని ఏర్పాటు చేశారు. ఆ సంస్థలో తొలి ప్రయత్నంగా ‘చెల్లెలు కాపురం’ తీసి విజయాన్ని అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం పొందింది ఇది.
→ ఆ తర్వాత ‘నేరము శిక్ష’, ‘అన్నదమ్ముల కథ’, ‘ఈనాటి బంధం ఏనాటిదో’, ‘ప్రేమ - పగ’, ‘చుట్టాలున్నారు జాగ్రత్త’, చిరంజీవితో ‘ఊరికిచ్చిన మాట’ తదితర చిత్రాల్ని నిర్మించారు.
→ దర్శకుడిగానూ ప్రతిభ చాటారు బాలయ్య. ‘పసుపుతాడు’, ‘నిజం చెబితే నేరమా’, ‘పోలీసు అల్లుడు’ సినిమాల్ని తెరకెక్కించారు. ‘ఊరికిచ్చిన మాట’ చిత్రానికి కథనీ సమకూర్చిన బాలయ్య, ఉత్తమ కథా రచయితగా నంది పురస్కారం అందుకున్నారు.

భారత పెట్రోలియం సంస్థ మాజీ డైరెక్టర్‌ మరణం

→దిల్లీలో భారత పెట్రోలియం సంస్థలో డైరెక్టర్‌గా పనిచేసిన తురగా సుందర రామప్రసాదరావు (83) హైదరాబాద్‌లో మరణించారు. దీంతో ఆయన స్వగ్రామం కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడిలో విషాదఛాయలు అలముకున్నాయి.
→ఆయన భారత జాతీయ ఇంజినీరింగ్‌ అకాడమి జీవిత సౌఫల్య పురస్కారాలను రెండు పర్యాయాలు అప్పటి ప్రధాన మంత్రుల చేతులమీదుగా అందుకున్నారు.

సాహితీ విమర్శకుడు కడియాల రామ్మోహనరావు మరణం

→సుప్రసిద్ధ విమర్శకుడు, సాహితీవేత్త డాక్టర్‌ కడియాల రామ్మోహనరావు (78) అనారోగ్యంతో గుంటూరులో మరణించారు.
→గుంటూరు జేకేసీ కళాశాలలో ఆయన తెలుగు అధ్యాపకుడిగా, విభాగాధిపతిగా సుదీర్ఘకాలం పని చేశారు.
→పలు సాహిత్య గ్రంథాలను రచించడంతో పాటు యూజీసీకి చెందిన మేజర్, మైనర్‌ పరిశోధన ప్రాజెక్టులు, పరిశోధన గ్రంథాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అనేక పత్రికల్లో సాహితీ వ్యాసాలను వెలువరించారు.
→సాహిత్య అకాడమీ, దిల్లీ ప్రచురించిన ఎన్‌సైక్లోపీడియా ఇండియన్‌ లిటరేచర్‌ 5 వాల్యూమ్స్‌లో 28 వ్యాసాలు రచించారు. వివిధ భారతీయ భాషలకు చెందిన ‘ది బెస్ట్‌ థర్టీస్‌ షార్ట్‌ స్టోరీస్‌’ను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు.
→పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం; జీవీఎస్‌ కళాశాల పీఠం, ఆంధ్ర భాషా సమితి నుంచి ఉత్తమ విమర్శక పురస్కారాలు పొందారు.