నియామకాలు

సైన్యాధిపతిగా మనోజ్‌ పాండే

→భారత 29వ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఎంపికయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె ఏప్రిల్‌ 30న పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.
→మే 1న పాండే బాధ్యతలు చేపడతారు. సైన్యంలోని ‘కోర్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌’ విభాగం నుంచి వచ్చిన ఒక అధికారి.. అత్యున్నత స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.
→ఇప్పటివరకూ పదాతి దళం, శతఘ్ని, ఆర్మర్డ్‌ రెజిమెంట్ల అధికారులకు మాత్రమే సైన్యాధిపతి పదవి లభించేది. మనోజ్‌ పాండే ప్రస్తుతం ఉప సైన్యాధిపతిగా వ్యవహరిస్తున్నారు.
→ అంతకుముందు ఆయన ఆర్మీలోని తూర్పు విభాగానికి నాయకత్వం వహించారు. ఆ హోదాలో సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ వెంబడి ఉన్న వాస్తవాధీన రేఖ రక్షణ బాధ్యతలను పర్యవేక్షించారు.
→ ప్రతిష్ఠాత్మక నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో శిక్షణ పొందిన ఆయన 1982లో సైన్యంలోని కోర్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ద బాంబే శాపర్స్‌)లో చేరారు. నాలుగు దశాబ్దాల సర్వీసులో ఆయన సైన్యంలోని పలు కీలక పదవులను నిర్వహించారు.
→ జమ్మూ-కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఇంజినీర్‌ రెజిమెంట్‌కు, పశ్చిమ విభాగంలో ఇంజినీర్‌ బ్రిగేడ్‌కు, లద్దాఖ్‌లో పర్వత విభాగానికి నేతృత్వం వహించారు.
→ ఇథియోపియా, ఎరిట్రియాల్లో ఐరాస తరఫున చీఫ్‌ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహించారు. త్రివిధ దళాలతో కూడిన అండమాన్, నికోబార్‌ కమాండ్‌కు సారథ్యం వహించారు.
→ మనోజ్‌ పాండేకు పరమ్‌ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకం వంటి పురస్కారాలు లభించాయి.

నాస్కామ్‌ ఛైర్‌పర్సన్‌గా కృష్ణన్‌ రామానుజమ్‌

→ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్‌ ఛైర్‌పర్సన్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ కృష్ణన్‌ రామానుజమ్‌ నియమితులయ్యారు. 2022 - 23 సంవత్సరానికి ఆయన ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు.
→ఇప్పటివరకు ఆయన నాస్కామ్‌కు వైస్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. 2021 - 22 కాలానికి నాస్కామ్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్న యాక్సెంచర్‌ సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రేఖ ఎం మీనన్‌ స్థానంలో రామానుజమ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.
→మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరిని 2022 - 23 సంవత్సరానికి వైస్‌ ఛైర్‌పర్సన్‌గా నాస్కామ్‌ నియమించింది.

నీతి ఆయోగ్‌ కొత్త ఉపాధ్యక్షుడిగా సుమన్‌ కె బెరీ

→నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి రాజీవ్‌ కుమార్‌ వైదొలగడంతో ఆయన స్థానంలో సుమన్‌ కె బెరీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.
→ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరున్న రాజీవ్‌ కుమార్‌ ఆకస్మిక రాజీనామాకు కారణాలు తెలియరాలేదు. 2017 ఆగస్టులో నీతి ఆయోగ్‌ బాధ్యతలు చేపట్టిన ఈయన పలు విధాన నిర్ణయాల్లో కీలకపాత్ర పోషించారు.
→ సుమన్‌ బెరీ మే నెల 1వ తేదీన ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. దిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనమిక్‌ రీసెర్చి (ఎన్‌సీఏఈఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా సుమన్‌ బెరీ గతంలో బాధ్యతలు నిర్వహించారు.
→ ప్రధాని ఆర్థిక సలహామండలిలో సభ్యుడిగానూ ఉన్నారు.

సైనిక ఉప అధిపతిగా బగ్గవల్లి సోమశేఖర్‌ రాజు

→నూతన సైనిక ఉప అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ బగ్గవల్లి సోమశేఖర్‌ రాజు (బి.ఎస్‌.రాజు) నియమితులయ్యారు.
→మే 1వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుంది. ప్రస్తుత సైనిక ఉప అధిపతి మనోజ్‌ పాండే కొత్త సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.
→కర్ణాటకకు చెందిన బి.ఎస్‌.రాజు బీజాపుర్‌ సైనిక పాఠశాల, నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీల్లో విద్యనభ్యసించారు. 1984 డిసెంబరు 15న జాట్‌ రెజిమెంట్‌లో చేరారు.
→జమ్ము కశ్మీర్‌లో ఆపరేషన్‌ పరాక్రమ్, ఉరి బ్రిగేడ్, నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద వ్యతిరేక దళం, కశ్మీర్‌లోయలోని చినార్‌ కోర్‌కు నాయకత్వం వహించారు.
→భూటాన్‌లోని ఇండియన్‌ మిలిటరీ ట్రైనింగ్‌ గ్రూప్‌నకు కమాండెంట్‌గా వ్యవహరించారు. 38 ఏళ్ల సర్వీసులో సోమశేఖర్‌ రాజు సైన్యంలో వివిధ హోదాల్లో పని చేశారు.
→హెలికాప్టర్‌ పైలట్‌గా అర్హత సాధించిన ఆయన జాట్‌ రెజిమెంట్‌లో కర్నల్‌గా సేవలందించారు. దేశంలోని అన్ని ప్రముఖ సైనిక కోర్సులతో పాటు ఇంగ్లాండ్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌లో ఎన్‌డీసీ చేశారు.
→అమెరికా మాంటెరీలోని నావెల్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ నుంచి కౌంటర్‌ టెర్రరిజంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు.
→సైన్యంలో ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఉత్తమ్‌ యుధ్‌ సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్‌ సొంతం చేసుకున్నారు.

ఎన్‌సీఎస్‌సీ ఛైర్‌పర్సన్‌గా విజయ్‌ సాంప్లా

→కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత విజయ్‌ సాంప్లా షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ (ఎన్‌సీఎస్‌సీ) ఛైర్‌పర్సన్‌గా రెండోసారి నియమితులయ్యారు.
→ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో ఇదే పదవిలో ఉన్న సాంప్లా ఈ ఏడాది జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు.
→అనంతరం ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. 2014లో పంజాబ్‌లోని హోశియార్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన ఆయన అనంతరం కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

రావి, బియాస్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ వినీత్‌ శరణ్‌

→రావి, బియాస్‌ నదీ జలాల ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌ శరణ్, సభ్యుడిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు నియమితులయ్యారు.
→సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఈ పదవులకు వీరిద్దరినీ నామినేట్‌ చేసినట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ పేర్కొంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ మే 10న పదవీ విరమణ చేయనున్నారు.
→జస్టిస్‌ నవీన్‌రావు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా నాలుగో స్థానంలో ఉన్నారు.
→రావి, బియాస్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ ఎన్‌సీఎల్‌టీ ఛైర్మన్‌గా బదిలీకావడం, సభ్యుడిగా ఉన్న జస్టిస్‌ ఎంవై ఇక్బాల్‌ కన్నుమూయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి.

కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలిగా మాధవి

→కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలిగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందినట్లు ఎంపీ కార్యాలయం తెలిపింది.
→వైకాపా ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి చేతులమీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు.

విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా వినయ్‌ మోహన్‌ క్వాత్రా

→నేపాల్‌లో భారత రాయబారిగా ఉన్న వినయ్‌ మోహన్‌ క్వాత్రా తదుపరి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
→ ప్రస్తుతం ఆ హోదాలో కొనసాగుతున్న హర్షవర్ధన్‌ శృంగ్లా ఏప్రిల్‌ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో వినయ్‌ మోహన్‌ను నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
→1988 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన వినయ్‌ మోహన్‌ గతంలో వాషింగ్టన్, బీజింగ్‌లలో భారత దౌత్య కార్యాలయాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఫ్రాన్స్‌లో భారత రాయబారిగానూ సేవలందించారు.
→ తన 32 ఏళ్ల సర్వీసులో ఆయన రెండేళ్ల పాటు ప్రధాన మంత్రి కార్యాలయ సంయుక్త కార్యదర్శిగానూ పనిచేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని విధాన ప్రణాళిక, పరిశోధన విభాగానికి సారథ్యం వహించారు.

ద.మ.రైల్వే ఇన్‌ఛార్జి జీఎంగా అరుణ్‌కుమార్‌ జైన్‌

→దక్షిణ మధ్య రైల్వే ఇన్‌ఛార్జి జనరల్‌ మేనేజర్‌ (జీఎం)గా అరుణ్‌కుమార్‌ జైన్‌ సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో బాధ్యతలు చేపట్టారు.
→గజానన్‌ మల్య పదవీ విరమణ తర్వాత సంజీవ్‌ కిశోర్‌ ఇన్‌ఛార్జి జీఎంగా బాధ్యతలు నిర్వహిస్తుండగా ఆయన స్థానంలో అరుణ్‌కుమార్‌ జైన్‌ను రైల్వేబోర్డు నియమించింది.
→ఇండియన్‌ రైల్వేస్‌ సర్వీస్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంజినీర్స్‌ (ఐఆర్‌ఎస్‌ఎస్‌ఈ) 1986 బ్యాచ్‌కు చెందిన ఆయన ద.మ.రైల్వేలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ సిగ్నల్‌ అండ్‌ టెలికాం ఇంజినీర్‌గా, హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

కర్ణాటక గనుల ‘సీఈపీఎంఐజెడ్‌’ పర్యవేక్షకుడిగా మాజీ జడ్జి సుదర్శన్‌ రెడ్డి

→ఇనుప ఖనిజ తవ్వకాలతో ప్రభావితమైన కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ, తమకూరు జిల్లాల్లో పునరుద్ధరణ పనులు, ఆరోగ్య ప్రాజెక్టు పథకాల అమలును సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌ రెడ్డి పర్యవేక్షించనున్నారు.
→ఈ మేరకు ఆయనను నియమిస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
→దీంతో కాంప్రెహెన్సివ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్లాన్స్‌ ఫర్‌ మైనింగ్‌ ఇంపాక్ట్‌ జోన్స్‌ (సీఈపీఎంఐజెడ్‌) పథకం కింద పనుల పురోగతి, నాణ్యతను మాజీ జడ్జి సుదర్శన్‌ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు.

కేంద్ర ముఖ్య శాస్త్ర సలహాదారుగా అజయ్‌ కుమార్‌ సూద్‌

→కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారుగా ప్రొఫెసర్‌ అజయ్‌ కుమార్‌ సూద్‌ నియమితులయ్యారు. ఇంతవరకు ఈ పదవిలో ఉన్న ప్రొఫెసర్‌ కె.విజయ రాఘవన్‌ స్థానంలో సూద్‌ బాధ్యతలు చేపడతారు.
→ప్రస్తుతం (2018 నుంచి) ప్రధానమంత్రి ‘టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌’ సలహా మండలి సభ్యుడిగా ఉన్న సూద్‌ను ముఖ్య శాస్త్ర సలహాదారుగా నియమిస్తూ కేంద్ర నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకొంది.
→పంజాబ్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ ఫిజిక్స్‌ చేసిన ఆయన బెంగుళూరు ఐఐఎస్‌సీలో పీహెచ్‌డీ చేశారు. ఐఐఎస్‌సీలో ప్రొఫెసర్‌గా, కల్పాకం ఆటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తగా సేవలందించారు.
→రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, భోపాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ల పాలక మండళ్లకు ఛైర్మన్‌గానూ ఉన్నారు.

సెంట్రల్‌ ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా విజయలక్ష్మి

→సెంట్రల్‌ ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా నెల్లూరు జిల్లాకు చెందిన భాజపా సీనియర్‌ నాయకురాలు డాక్టర్‌ మారం విజయలక్ష్మి నియమితులయ్యారు.
→ఆమె భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హైదరాబాదులోని సెంట్రల్‌ ఫిలిం సెన్సార్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయం నుంచి నియామక పత్రాలు అందినట్లు విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు.

ఆల్‌ ఇండియా రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ కోశాధికారిగా శంకర్‌రావు

→భారతీయ రైల్వేలో ముఖ్య కార్మిక సంఘమైన ఆల్‌ ఇండియా రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ కోశాధికారిగా చోడవరకు శంకర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
→ ఉజ్జయినిలో జరిగిన సంఘం వార్షిక సమావేశాల్లో మరోసారి ఆయన్ను ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మున్నంగి గ్రామానికి చెందిన శంకర్‌రావు రైల్వే మజ్దూర్‌ యూనియన్‌లో అంచెలంచెలుగా ఎదిగారు.
→ ప్రస్తుతం ఆయన దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌కు ప్రధాన కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్నారు. 56 సంవత్సరాలుగా రైల్వే కార్మిక సంఘంలో సేవలందిస్తున్నారు.
→ ఈ సమావేశాల్లో పలు తీర్మానాలు చేశారు. వాటిలో ముఖ్యమైనవి..
→ 1.నూతన పింఛను విధానం నుంచి రైల్వే కార్మికులను మినహాయించడం
→ 2. 150 రైళ్లు, 109 రైల్వే మార్గాల ప్రయివేటీకరణ నిర్ణయం విరమించుకోవడం
→3.ఏడో వేతన సవరణ సంఘం పేర్కొన్న కనీస వేతనాన్ని, ఫిట్‌మెంట్‌ను మెరుగుపరచడం.

కొబ్బరి బోర్డు సభ్యుడిగా శ్రీధర్‌

→కొబ్బరి బోర్డు సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ఉద్యానవన శాఖ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్‌ నియమితులయ్యారు.
→ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా అమరీందర్‌ సింగ్‌ బ్రార్‌

→పంజాబ్‌లో పీసీసీ అధ్యక్షుడిగా అమరీందర్‌ సింగ్‌ బ్రార్‌ (రాజా వారింగ్‌) నియమితులయ్యారు. నవజోత్‌ సింగ్‌ సిద్ధూ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్‌ తెలిపింది.
→రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రతాప్‌ సింగ్‌ బజ్వాను పార్టీ శాసనసభా పక్ష నేతగా నియమించినట్లు పేర్కొంది. ఈ నేతలిద్దరూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.

దిల్లీలో తెలంగాణ సీఎం కార్యాలయ పీఆర్వోగా సంజయ్‌ఝా

→దిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ పౌరసంబంధాల అధికారి (సీఎం పీఆర్వో)గా బిహార్‌కు చెందిన సంజయ్‌కుమార్‌ ఝాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
→రెండేళ్లపాటు ఆయన పదవిలో ఉంటారు. గతంలో వివిధ ఆంగ్ల పత్రికల్లో ఆయన పనిచేశారు. జాతీయ రాజకీయాలకు సీఎం కేసీఆర్‌ సన్నద్ధతలో భాగంగా...రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ సూచనల మేరకు సంజయ్‌ నియామకం జరిగింది.