జాతీయం

దేశంలోనే తొలి ‘ఉక్కు రోడ్డు’ నిర్మాణం

కేంద్ర రహదారి పరిశోధన సంస్థ (సీఆర్‌ఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఉక్కు కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలను రహదారుల నిర్మాణంలో వాడారు. దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ పరిశోధనలో ఉక్కు వ్యర్థాలను కంకరగా మార్చారు. అలా తయారు చేసిన ‘ఉక్కు కంకర’తో ప్రయోగాత్మకంగా గుజరాత్‌లోని సూరత్‌ సమీపంలో హజీరా ఓడరేవు వద్ద 1.2 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారి నిర్మించారు. ఇందులో శుద్ధి చేసిన ఉక్కు వ్యర్థాలను లక్ష టన్నుల మేర వాడారు. ఇలా దేశంలోనే మొట్టమొదటి ‘ఉక్కు రోడ్డు’ నిర్మితమైంది.

ఏదైనా రహదారి నిర్మించేటప్పుడు దాని మీదుగా ఎంత బరువైన, ఎన్ని వాహనాలు వెళ్తాయన్నదాన్ని బట్టి ఆ రహదారి నిర్మాణ ప్రమాణాలను ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ నిర్దేశిస్తుంది. ఉక్కు కంకరను వాడటం ఇదే తొలిసారి. హజీరా ఓడరేవు నుంచి ప్రతిరోజూ 30-40 టన్నుల బరువుండే 1000-1200 ట్రక్కులు వెళ్తాయి. అందుకే ఎక్కువ బరువును తట్టుకుంటుందో లేదో చూడాలని అక్కడ నిర్మించారు. మామూలుగానైతే అక్కడి రహదారి మందం 600-700 మిల్లీమీటర్లు ఉండాలి. కానీ, ఉక్కు రోడ్డు మందాన్ని 30% తగ్గించారు. అయినా ఈ రహదారి బ్రహ్మాండంగా నిలబడి శాస్త్రవేత్తల అంచనాలను అందుకుంది.

దేశంలోని వివిధ ఉక్కు కర్మాగారాల నుంచి ఏటా 1.9 కోట్ల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 2030 నాటికి ఇవి 5 కోట్ల టన్నులకు చేరుకుంటాయని అంచనా. విశాఖ ఉక్కు కర్మాగారంలోనూఇప్పటికి 40 లక్షల టన్నుల వ్యర్థాలున్నాయి. వీటన్నింటినీ ఇప్పటివరకూ ఘనవ్యర్థాలుగా భావించి వదిలేస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం సీఆర్‌ఆర్‌ఐతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. ఫిబ్రవరిలో సీఆర్‌ఆర్‌ఐ బృందం విశాఖ వచ్చింది.

ఉక్కు కర్మాగారాల్లో ముడి పదార్థాన్ని 1500-1600 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద మండించినప్పుడు ఉక్కుతో పాటు, వ్యర్థాలూ ఉత్పత్తి అవుతాయి. వీటిని శుద్ధి చేసి, వివిధ పరిమాణాల్లో కంకర రూపంలోకి మారుస్తారు. ఇప్పటికైతే ఉక్కు వ్యర్థాలన్నీ పొడిరూపంలోనే వస్తున్నాయి గానీ, ఇకపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఈ వ్యర్థాలను నిర్దిష్ట పరిమాణాల్లో (3 నుంచి 20 మిల్లీమీటర్ల వరకూ) కంకర రాళ్లలా వచ్చేలా మార్గదర్శకాలు ఇవ్వనుంది.


రాజ్యసభలో భాజపా కొత్త చరిత్ర

పార్లమెంట్‌లోని పెద్దల సభలో భారతీయ జనతా పార్టీ (భాజపా) పట్టు బిగుస్తోంది. ఆ పార్టీ తన చరిత్రలోనే తొలిసారిగా రాజ్యసభలో తన బలాన్ని వంద సీట్లకు పెంచుకుంది.

ఈ మైలురాయిని చేరుకోవడం భాజపాకు ఇదే తొలిసారి. చివరిసారి వంద, అంతకంటే ఎక్కువ సీట్లు రాజ్యసభలో ఓ పార్టీకి 1990లో దక్కాయి.

అప్పుడు అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఎగువసభలో 108 మంది సభ్యులు ఉన్నారు. అక్కడి నుంచి ఆ పార్టీ సంఖ్య క్షీణిస్తూ వచ్చింది. మరోవైపు రాజ్యసభపై భాజపా పట్టు 2014 నుంచి పెరుగుతూ వస్తోంది. మోదీ అధికారంలోకి వచ్చేసరికి కమలం పార్టీకి 55 మంది సభ్యులే ఉన్నారు. తాజాగా అసోం, నాగాలాండ్, త్రిపురలో నెగ్గిన మూడు సీట్లతో ఆ సంఖ్య ఇప్పుడు వందకు చేరుకుంది. సమీప భవిష్యత్తులో కాషాయ పార్టీ బలం ఇంకా పెరిగే అవకాశం ఉంది. త్వరలో 52 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే 11 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో కనీసం 8 సీట్లు భాజపా ఖాతాలోనే పడే అవకాశం ఉంది.


విదేశీ జైళ్లలో 8,278 మంది భారతీయులు

ప్రపంచవ్యాప్తంగా 81 దేశాల్లోని జైళ్లలో 8,278 మంది భారతీయులున్నారు. ఇందులో జీవితఖైదు పడ్డవారు 156 మంది ఉన్నట్లు విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు. అత్యధికంగా యూఏఈ జైళ్లలో 1,480, సౌదీఅరేబియాలో 1,392, నేపాల్‌లో 1,112, పాకిస్థాన్‌లో 701 మంది ఉన్నట్లు వెల్లడించారు. జీవితఖైదీలు అత్యధికంగా మలేషియాలో 47, కువైట్‌లో 28, బహరీన్‌లో 13, చైనాలో 13, ఒమన్‌లో 12, ఖతార్‌లో 7, శ్రీలంక, యూఏఈలో ఐదుగురు చొప్పున ఉన్నట్లు చెప్పారు.

భారత వాయుసేన అమ్ములపొదిలోకి 500 కిలోల బాంబు

దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 500 కిలోల జీపీ బాంబు భారత వాయుసేన అమ్ములపొదిలో చేరింది. జబల్పుర్‌లోని ప్రభుత్వరంగ ఆయుధ కర్మాగారం దీన్ని ఉత్పత్తి చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాంబుల్లో ఇదే అతిపెద్దది. వాయుసేన పోరాట సామర్థ్యాన్ని ఇది మరింత పెంచుతుందని కర్మాగార జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.కె.సిన్హా తెలిపారు. తొలి విడత కింద 48 బాంబులను అందించామన్నారు. వీటి అభివృద్ధిలో రక్షణ రంగానికి చెందిన వివిధ సంస్థలు పాలుపంచుకున్నట్లు తెలిపారు. 1943లో ఏర్పాటైన ఈ కర్మాగారం రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనూ మందుగుండు సామగ్రిని అందించింది.

ఎలక్ట్రానిక్స్‌ పరిశోధనలో చెన్నైకి రెండో స్థానం

ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌గా చెన్నై వృద్ధి చెందుతోంది. ఎఫ్‌డీఐ ఇంటెలిజెన్స్‌ సంస్థ ప్రకటించిన అంతర్జాతీయ ర్యాంకుల్లో ఈ రంగంలో నాణ్యమైన పరిశోధనలు, అభివృద్ధి పరంగా రెండో స్థానం సంపాదించుకుంది. నాణ్యమైన ఆర్‌ అండ్‌ డీలో దక్షిణ కొరియాకు చెందిన సియోల్‌ తొలిస్థానంలో ఉండగా, చెన్నై, చైనాలోని గ్వాంగ్‌జౌ, షెన్‌జెన్, టర్కీ నుంచి ఇస్తాంబుల్, భారత్‌లోని బెంగళూరు, పుణె, గుర్గావ్, మలేసియాలోని పెనంగ్, జపాన్‌లోని టోక్యో టాప్‌ - 10 జాబితాలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌ పరిశోధనలకు తక్కువ ఖర్చయ్యే నగరాల్లో చెన్నై మొదటి స్థానంలో ఉంది.

తెలంగాణ అర్బన్‌ ఫారెస్ట్‌లకు అంతర్జాతీయ గుర్తింపు

హరితహారంలో భాగంగా అమలు చేస్తున్న పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలకు గానూ తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. హరితహారం కింద రాష్ట్రంలో 109 పట్టణ అటవీ ఉద్యానవనాలను (అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల) అభివృద్ధి చేయగా హెచ్‌ఎండీఏ పరిధిలోనే 59 పార్కులుండటంతో హైదరాబాద్‌ పరిసరాల్లో క్రమంగా పచ్చదనం పరుచుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల పురోగతిని అంతర్జాతీయ సంస్థ వరల్డ్‌ ఫారెస్ట్‌ సైన్స్‌ గుర్తించింది. అదనపు అటవీ సంరక్షణాధికారి ఎం.సి.పర్గెయిన్‌ రాసిన వ్యాసం ఆ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్‌ బ్లాగ్‌ పోటీలో మూడో స్థానం సంపాదించింది. ప్రపంచ ట్రీసిటీగా ఇటీవలే గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్‌ పర్యావరణపరంగా పునరుజ్జీవం పొందేందుకు దోహదపడుతున్న అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులపై ‘రిసిలియెన్స్‌ అండ్‌ బెటర్‌ లైఫ్‌ విత్‌ అర్బన్‌ ఫారెస్ట్స్‌ ఇన్‌ హైదరాబాద్‌’ పేరుతో పర్గెయిన్‌ ఈ బ్లాగ్‌ రాశారు.

దేశంలోని తొలి కర్బన రహిత పంచాయతీగా పల్లీ గ్రామం

జమ్మూ - కశ్మీర్‌లో క్షేత్రస్థాయికి ప్రజాస్వామ్యం చేరుకుందని, గత రెండు మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ప్రాంతం ప్రగతి పథంలో పయనిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం’ సందర్భంగా మోదీ, జమ్మూ - కశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని పల్లీ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ 500 కిలోవాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో ఆ గ్రామం దేశంలోని తొలి కర్బన రహిత పంచాయతీగా నిలిచింది. అక్కడి నుంచే దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. 2019లో జమ్మూ - కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించే 370వ అధికరణం ఉపసంహరించిన తర్వాత మోదీ ఈ ప్రాంతంలో పూర్తిస్థాయిలో పర్యటించడం ఇదే తొలిసారి. సుమారు రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు. జమ్మూ - శ్రీనగర్‌ మధ్య దూరాన్ని తగ్గించే బనిహాల్‌ - కాజీగుండ్‌ సొరంగ మార్గాన్ని పల్లీ గ్రామం నుంచే వర్చువల్‌గా ప్రారంభించారు. చీనాబ్‌ నదిపై రెండు జల విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. భూమిపై యాజమాన్య హక్కులు కల్పించే ‘స్వామిత్ర’ కార్డులను రైతులకు అందజేశారు.

జామ్‌నగర్‌లో అంతర్జాతీయ వైద్య కేంద్రానికి మోదీ శంకుస్థాపన

సంప్రదాయ ప్రాచీన వైద్యానికి సంబంధించి నూతన శకం ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజున ఆ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో భాగంగా జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ అంతర్జాతీయ కేంద్రంతో సంప్రదాయ వైద్యంలో ఓ నూతన శకం ప్రారంభం కానుందని అన్నారు. రానున్న 25 ఏళ్లలో ఈ కేంద్రం ప్రపంచ మానవాళికి దగ్గర కానుందని వారి జీవితాల్లో కీలక భాగం కానుందని పేర్నొన్నారు. భారతీయ ప్రాచీన విజ్ఞాన సంపద గురించి మోదీ మాట్లాడారు. ఆయుర్వేద. ఇతర సంప్రదాయ వైద్యాలు కేవలం చికిత్సా విధానాలు మాత్రమే కావని.. అవి భారతీయుల సమగ్ర జీవన విధానానికి ప్రతిబింబాలని పేర్కొన్నారు.

అస్సాంలో 2,985 అమృత్‌ సరోవర్‌ ప్రాజెక్టుల ప్రారంభం

అస్సాం రాష్ట్రంలో 2,985 అమృత్‌ సరోవర్‌ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే దిఫూలో ‘శాంతి, ఐక్యత, అభివృద్ధి’ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. కర్బీ అంగ్లాంగ్‌లో పశువైద్య కళాశాల సహా పలు విద్యాసంస్థలకు ఆయన శంకుస్థాపన చేశారు. అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం, టాటా ట్రస్టులు సంయుక్తంగా ‘అస్సాం క్యాన్సర్‌ కేర్‌ ఫౌండేషన్‌ (ఏసీసీఎఫ్‌)’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏడు క్యాన్సర్‌ చికిత్స కేంద్రాలను మోదీ ప్రారంభించారు. మరో ఏడింటికి శంకుస్థాపన చేశారు. ఏసీసీఎఫ్‌ కింద ఏర్పాటు చేస్తున్న కేంద్రాలతో క్యాన్సర్‌ చికిత్స అందరికీ అందుబాటులోకి వస్తుందని టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్‌ రతన్‌ టాటా పేర్కొన్నారు. అస్సాంలో ఏడు చికిత్సాలయాలను ఆయన ప్రారంభించారు.

ఆలేరు పోలీసుస్టేషన్‌కు జాతీయ గుర్తింపు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోలీసు స్టేషన్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2021 సంవత్సరానికి ఉత్తమ పోలీసు ఠాణాగా ఎంపిక చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఏటా దేశవ్యాప్తంగా 75 పోలీసు స్టేషన్లను ప్రాథమికంగా ఎంపిక చేసి వాటి పనితీరు ఆధారంగా తుది ర్యాంకులను కేటాయిస్తుంది. వీటిలో ఆలేరు పోలీసు స్టేషన్‌ను గ్రామీణ విభాగంలో ఉత్తమ ఠాణాగా ఎంపిక చేశారు. అలా జాతీయ స్థాయిలో ప్రకటించిన మొదటి పది ర్యాంకులలో ఈ ఠాణాకు స్థానం దక్కింది.

తెలంగాణ పీసీసీఎఫ్‌కు జాతీయ స్థాయి గుర్తింపు

జాతీయ స్థాయిలో అటవీ విధానాల రూపకల్పనపై ఏర్పాటు చేసిన రెండు ఉన్నత స్థాయి కమిటీల్లోనూ తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌), అటవీ దళాల అధిపతి (హెచ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌) ఆర్‌.ఎం.డోబ్రియాల్‌కు స్థానం దక్కింది. జాతీయ అటవీ విధానం (నేషనల్‌ ఫారెస్ట్‌ పాలసీ), అటవీ పరిరక్షణ చట్టం - 1980కి అవసరమైన మార్పులు, ఆగ్రో ఫారెస్ట్రీకి ప్రోత్సాహం, అడవుల బయట పచ్చదనం పెంపు కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీని, ఈ కమిటీ సూచనల్ని పరిగణనలోకి తీసుకుని అమలు చేసే మరో వర్కింగ్‌ గ్రూప్‌ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సీఎస్‌ఐఆర్‌లో సీడీపీ విలీనానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌లోని రెండు స్వయం ప్రతిపత్తి విభాగాలైన సీడీసీ (కన్సల్టెన్సీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌), సీఎస్‌ఐఆర్‌ (కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌) ఒకే సంస్థగా ఆవిర్భవించనున్నాయి. సీడీసీని దానిలోని సిబ్బందిని, స్థిర,చర ఆస్తులను సీఎస్‌ఐఆర్‌లో విలీనం చేసేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ‣ ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ ఆ భారాన్ని రైతులపై పడనీయబోమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది దీనిలో భాగంగానే ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో (ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు) రైతులు కొనుగోలు చేసే డీఏపీ, ఫాస్పటిక్, పొటాసిక్‌ ఎరువులపై రూ.60,939.23 కోట్ల రాయితీని అందించనున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రి మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. డీఏపీ బస్తాపై ప్రస్తుతం ఉన్న రూ.1,650 సబ్సిడీని రూ.2,501కి పెంచింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల డీఏపీ బస్తా ప్రస్తుతమున్న రూ.1350 ధరకే లభించనుంది. ‣ వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 2జీ మొబైల్‌ టవర్లను 4జీకి ఉన్నతీకరించడానికి (అప్‌గ్రేడ్‌కి) కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. దీనివల్ల తొలిదశలో రూ.2,426.39 కోట్లతో పది రాష్ట్రాల్లోని 2,343 టవర్లు అప్‌గ్రేడ్‌ అవుతాయి. వీటిలో ఏపీలో 346, తెలంగాణలో 53 టవర్లు ఉంటాయి. ఈ టవర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్వహిస్తుంది. ‣ వీధి వ్యాపారులకు పూచీకత్తులేని రుణాలు అందించే పీఎంస్వనిధి పథకాన్ని 2024 డిసెంబరు వరకు కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పథకం కింద ఇది వరకు రూ.5 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పుడు ఆ లక్ష్యాన్ని రూ.8,100 కోట్లకు పెంచారు. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లోని 1.2 కోట్ల మంది వీధి వ్యాపారులకు లబ్ధిచేకూరుతుందని అంచనా. ‣ జమ్మూ - కశ్మీర్‌లోని చినాబ్‌ నదిపై క్వార్‌ జల విద్యుత్తు ప్రాజెక్టు (540 మెగావాట్లు)ను నిర్మించడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనికి రూ.4,526 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.

బ్రహ్మ విద్యాలయ స్వర్ణోత్సవాలు

కేరళలోని శివగిరి మఠం ఆధ్యాత్మిక యాత్ర 90వ వార్షికోత్సవం, బ్రహ్మ విద్యాలయ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని దిల్లీలో శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘‘భారతీయులుగా మనందరిదీ ఒకే కులం - భారతీయత, ఒకే మతం - ధర్మం, ఒకే దైవం - భరతమాత’’ అని ఆయన ఉద్ఘాటించారు. దేశంలోని ఆధ్యాత్మిక సంస్థలు ‘ఒకే భారత్, శ్రేష్ఠ భారత్‌’ అనే స్ఫూర్తిని నింపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

జాతీయ పతాకానికి గిన్నిస్‌ రికార్డ్‌

జాతీయ పతాకానికి సంబంధించి భారత్‌ సరికొత్త గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. ఈ మేరకు ఏకకాలంలో అత్యధిక మంది జాతీయ పతాకాలను గాల్లో అటూ ఇటూ ఊపుతూ చేపట్టిన కార్యక్రమానికి గిన్నిస్‌ పుస్తకంలో చోటు లభించిందని కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. బిహార్‌లోని జగ్దీష్‌పుర్‌లో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా 1857 తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒకరైన అప్పటి జగ్దీష్‌పుర్‌ రాజు వీర్‌కున్వర్‌ సింగ్‌ 164 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 78,220 మంది ప్రజలు జాతీయ పతకాలను చేతబూని ఏకకాలంలో 5 నిమిషాల పాటు అటూఇటూ ఊపుతూ గిన్నిస్‌ రికార్డు సృష్టించారని వివరించింది. ‣ 2004లో పాకిస్థాన్‌లోని లాహోర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 56,000 మంది పాకిస్థానీలు తమ దేశ జాతీయ పతాకాన్ని ఏకకాలంలో గాల్లో అటూ ఇటూ ఊపుతూ రికార్డు నెలకొల్పారు.
16 యూట్యూబ్‌ ఛానళ్లపై నిషేధం భారత్‌పై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై కేంద్ర సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ వేటు వేసింది. 16 యూట్యూబ్‌ ఛానళ్లను బ్లాక్‌ చేసింది. వీటిలో పాకిస్థాన్‌కు చెందిన 6 వార్తా ఛానళ్లు కూడా ఉన్నాయి. జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, శాంతి భద్రతలకు సంబంధించి ఇవి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ఈ ఛానళ్లన్నింటికీ కలిపి 68 కోట్ల మంది వీక్షకులు ఉన్నారని తెలిపింది.
వీసీల నియామకంపై తమిళనాడు అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతులను (వీసీ) రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా చట్ట సవరణలు చేసిన బిల్లును రాష్ట్ర శాసనసభలో ఉన్నత విద్యా శాఖ మంత్రి పొన్ముడి ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ ఉప కులపతులను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెల్లడించారు. పలు ఇతర పార్టీల మద్దతుతో సభలో బిల్లు ఆమోదం పొందింది.

‘స్మార్ట్‌ సిటీ ఛాలెంజ్‌’లో వరంగల్‌కు ఆరో స్థానం

స్మార్ట్‌ సిటీ ఛాలెంజ్‌ పోటీలో వరంగల్‌ మహానగర పాలక సంస్థ (కార్పొరేషన్‌)కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ పోటీలో భాగంగా కేవలం 56 గంటల్లో పార్కును నిర్మించినందుకుగాను వరంగల్‌ కార్పొరేషన్‌ జాతీయ స్థాయిలో ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా స్మార్ట్‌ సిటీ మిషన్, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖలు, ప్లేస్‌ మేకింగ్‌ మారథాన్‌ను 75 గంటల్లో పూర్తి చేసేందుకు పోటీలు నిర్వహించాయి. 2021, సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 3 వరకు, 2022, జనవరి నుంచి మార్చి వరకు నిర్వహించిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 143 నగరాలు పోటీపడ్డాయి. అందులో వరంగల్‌ కార్పొరేషన్‌ 13వ డివిజన్‌ పరిధిలోని ఎంహెచ్‌నగర్‌ మురికివాడలో 56 గంటల్లో పార్కు నిర్మాణ పనులను పూర్తి చేసింది. ఈ పోటీల్లో భువనేశ్వర్, ఇంఫాల్, కోహిమా, శ్రీనగర్, పింప్రి-చించ్వాడ్‌ నగరాలు మొదటి అయిదు స్థానాల్లో, వరంగల్‌ ఆరో స్థానంలో నిలిచినట్లు దిల్లీలోని స్మార్ట్‌ సిటీ మిషన్‌ డైరెక్టర్‌ ప్రకటించారు.

భారత్‌కు రెండు సూపర్‌ హార్నెట్‌ యుద్ధ విమానాలు

అమెరికా తయారీ ఎఫ్‌/ఏ-18 సూపర్‌ హార్నెట్‌ యుద్ధ విమానాలు త్వరలో భారత్‌కు రానున్నాయి. సామర్థ్య ప్రదర్శన కోసం రెండు జెట్‌లను గోవాకు పంపనున్నట్లు వీటి తయారీ సంస్థ ‘బోయింగ్‌’ తెలిపింది. వీటిని భారత నౌకాదళానికి విక్రయించాలని భావిస్తున్నామని, అందువల్ల నేవీ ఎదుట వీటిని ప్రదర్శించనున్నట్లు పేర్కొంది. విమాన వాహకనౌకల్లో మోహరింపునకు అనువుగా సూపర్‌ హార్నెట్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేసినట్లు బోయింగ్‌ సంస్థకు చెందిన భారత విభాగం ఉపాధ్యక్షుడు అలెన్‌ గార్షియా తెలిపారు. ఇది భారత నౌకాదళ అవసరాలను చక్కగా తీరుస్తుందని చెప్పారు. విమానవాహక నౌకల్లోని టేకాఫ్, ల్యాండింగ్‌కు ఉద్దేశించిన ‘స్టోబార్‌’ ప్రమాణాలను ఇది అందుకుంటుందన్నారు. 2020లో తాము నిర్వహించిన స్కీ జంప్‌ పరీక్షల్లో ఇది రుజువైందని చెప్పారు. విస్తృతంగా సిమ్యులేషన్‌ అధ్యయనాలనూ నిర్వహించామన్నారు. ప్రస్తుతమున్న బ్లాక్‌-3 రకం విమానాలు సముద్ర రంగంలో భారత ప్రయోజనాలను రక్షించగలవని పేర్కొన్నారు. అమెరికా నౌకాదళం వద్ద 800కుపైగా సూపర్‌ హార్నెట్‌లతో పాటు వీటికి సంబంధించిన ఎలక్ట్రానిక్‌ పోరాట సామర్థ్య వెర్షన్‌ ‘గ్రౌలర్‌’ యుద్ధ విమానాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (టీబీఏఎల్‌)లో అపాచీ హెలికాప్టర్లకు అవసరమైన ఆకృతులను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

‘హైదరాబాద్‌ - బెంగళూరు’ విస్తరణకు ఆమోదం

హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారి విస్తరణకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని కేంద్రం నిర్ణ యించింది. అలైన్‌మెంట్‌ ఖరారు కోసం కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన నివేదికకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రూపొందించాలని మంత్రిత్వ శాఖ ఆ సంస్థకు సూచించింది. ఆ మేరకు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో భౌగోళిక సర్వే చేపట్టారు.

మలేరియా నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు

మలేరియా కేసుల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. గత ఆరేళ్లలో (2015 - 2021) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ 25న దిల్లీలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమానికి ప్రతినిధిని పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు లేఖ పంపింది.

సిక్కుల గురువు తేగ్‌ బహాదుర్‌ 400వ జయంత్యోత్సవం

ఇతర దేశాలకు, సమాజాలకు భారత్‌ ఎన్నడూ ముప్పుగా పరిణమించలేదని ప్రపంచవ్యాప్తంగా పలు యుద్ధాలు జరిగినా విశ్వమానవ కల్యాణమే కోరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సిక్కు గురువుల ఆదర్శాలను ఈ దేశం అనుసరిస్తోందన్నారు. సిక్కుల గురువు తేగ్‌ బహాదుర్‌ 400వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగించారు. ఎర్రకోట సమీపంలోని శీశ్‌ గంజ్‌ సాహిబ్‌ గురుద్వారా మన సంస్కృతి పరిరక్షణ కోసం గురు తేగ్‌ బహాదుర్‌ చేసిన అమర త్యాగానికి ప్రతీకగా నిలిచిందని కొనియాడారు. ఈ సందర్భంగా స్మారక నాణెం, పోస్టల్‌ స్టాంపులను ప్రధాని విడుదల చేశారు. 1675లో గురు తేగ్‌ బహాదుర్‌ ఉరితీతకు ఇదే ఎర్రకోట నుంచి ఔరంగజేబు ఆదేశాలు జారీ చేశారు.

రష్యా - భారత్‌ బంధాన్ని అందరూ అర్థం చేసుకున్నారు: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లా, హలోల్‌లో ఉన్న బ్రిటన్‌ నిర్మాణ సామగ్రి సంస్థ జేసీబీ తయారీ కేంద్రాన్ని జాన్సన్‌ సందర్శించారు. అక్కడ కొత్త కర్మాగారాన్ని ప్రారంభించి మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్‌ సంక్షోభం విషయమై బ్రిటన్‌ ఇప్పటికే దౌత్యస్థాయిలో ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌-రష్యాల మధ్య భిన్నమైన చారిత్రక సంబంధాలు ఉన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకున్నారు’’ అని జాన్సన్‌ పేర్కొన్నారు. ‣ అహ్మదాబాద్‌ శివారు శాంతిగ్రామ్‌లోని అదానీ గ్రూప్‌ గ్లోబల్‌ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లిన జాన్సన్‌ ఆ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీతో సమావేశమయ్యారు. భారత్‌ తన సాయుధ బలగాలను 2030 నాటికి ఆధునికీకరించేందుకు సుమారు రూ.23 లక్షల కోట్లు వెచ్చించనున్న క్రమంలో- రక్షణ రంగంలో సహకారం పట్ల వారి మధ్య ప్రధానంగా చర్చ సాగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

శ్రీసిటీలో పానసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా ఉత్పత్తి కేంద్రం ప్రారంభం

పానసోనిక్‌ కార్పొరేషన్‌ పూర్తి అనుబంధ సంస్థ పానసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో తన నూతన ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది ఆ సంస్థకు దక్షిణ భారతదేశంలోనే మొదటి ఎలక్ట్రికల్‌ పరికరాల ఉత్పత్తి కేంద్రం కాగా దేశంలో ఏడోది. ప్రారంభోత్సవం సందర్భంగా పానసోనిక్‌ కార్పొరేషన్‌ జపాన్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రధాన నిర్వాహకులు కవామోటో మాట్లాడుతూ.. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న భారత్‌లో జపనీస్‌ ప్రమాణాలతో సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఉత్పత్తులను తయారు చేయాలన్నదే తమ ఆశయమన్నారు.

ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌ జల ప్రవేశం

భారత నౌకాదళ జలాంతర్గాముల బలం మరింత పెరగనుంది. ఇక్కడి మజ్గావ్‌ డాక్‌ యార్డ్‌లో ప్రాజెక్టు-75లో చివరిదైన ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. దీన్ని ఏడాది పాటు పరీక్షిస్తారు. తర్వాత నౌకాదళంలోకి తీసుకుంటారు. ‣ ప్రాజెక్ట్‌-75లో భాగంగా ఆరు స్కార్పీన్‌ తరగతి జలాంతర్గాములను భారత్‌ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఇప్పటికే కల్వరి, కందేరి, వేల, కరంజ్‌ జలాంతర్గాములు నౌకదళంలో సేవలందిస్తున్నాయి. వాగ్‌షీర్‌ జలాంతర్గామికి సంబంధించి ప్రస్తుతం ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఏడాదిలోపు ఇది నౌకాదళంలోకి చేరే అవకాశం ఉంది. ప్రాజెక్ట్‌-75కు సాంకేతిక సాయాన్ని ఫ్రాన్స్‌ అందిస్తోంది.

‘అంతరిక్ష’ విధానంపై నీతి ఆయోగ్‌ ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా విడుదల చేసిన అంతరిక్ష సాంకేతిక విధానం - 22ను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. తెలంగాణ ఈ రంగంలో ఉన్నత స్థాయికి వెళుతుందని ఉపగ్రహాలు, రాకెట్లు, వాటికి సంబంధించిన ఉపకరణాల తయారీ, సౌకర్యాలు, వాణిజ్య కేంద్రంగా రాష్ట్రం ఆవిర్భవిస్తుందని ట్విటర్‌లో పేర్కొంది. మన దేశంలో ఒక రాష్ట్రం అంతరిక్ష సాంకేతిక విధానాన్ని ప్రైవేటు సంస్థతో కలిసి మెటావర్స్‌ విధానంలో విడుదల చేసిన మొదటి కార్యక్రమమిదేనని పేర్కొంది.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ (గుర్తింపు) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

నేరాలకు పాల్పడిన దోషులు, నిందితుల నుంచి భౌతిక, జీవ నమూనాలు సేకరించే అధికారాన్ని కల్పిస్తూ కేంద్రం తెచ్చిన క్రిమినల్‌ ప్రొసీజర్‌ (గుర్తింపు) బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. ఏప్రిల్‌ 4న లోక్‌సభ, 6న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి. 1920లో తెచ్చిన ఖైదీల గుర్తింపు చట్టం స్థానంలో ఈ కొత్త చట్టం అమల్లోకి రానుంది.

సజ్జద్‌ గుల్, గుల్జార్‌ దార్‌లను ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం

లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాద ముఠా సభ్యుడు షేక్‌ సాజద్‌ అలియాస్‌ సజ్జద్‌ గుల్, ‘అల్‌ బద్ర్‌’ గ్రూప్‌నకు చెందిన అర్జుమండ్‌ గుల్జార్‌ దార్‌ అలియాస్‌ హమ్జా బుర్హాన్‌లను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులుగా గుర్తించింది. ఎల్‌ఈటీ కమాండర్లలో ఒకడిగా పనిచేస్తున్న గుల్‌ 2018 జూన్‌లో శ్రీనగర్‌లో జర్నలిస్ట్‌ సుజాత్‌ బుఖారీ హత్యకు పన్నిన కుట్రలో భాగస్వామి. దార్‌ ఉగ్రవాదానికి నిధుల సమీకరణ చేస్తుండటంతో పాటు పలు హింసాత్మక ఘటనల్లోనూ అతని ప్రమేయం ఉంది. వీరితో కలిపి గత పక్షం రోజుల్లో కేంద్రం మొత్తం 8 మందిని ఉగ్రవాదులుగా గుర్తించింది. శ్రీనగర్‌కు చెందిన గుల్‌ జమ్మూ-కశ్మీర్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనానికి సంబంధించిన ఓ కేసులో తప్పించుకు తిరుగుతున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. అలాగే ఎల్‌ఈటీ ముఠా కోసం జమ్మూ-కశ్మీర్‌లో యువతను ఉగ్రవాదులుగా నియమించడం, ప్రోత్సహించడం, ఉగ్రవాదానికి నిధుల సేకరణ వంటి కార్యకలాపాల్లోనూ అతను పాలుపంచుకుంటున్నట్లు పేర్కొంది. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన దార్‌ గతంలో పాకిస్థాన్‌కు వెళ్లి ఉగ్రవాద ముఠాలో చేరాడు. అల్‌ బద్ర్‌ ముఠాకు కమాండర్‌గా పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులుగా ప్రకటించిన నేపథ్యంలో గుల్, దార్‌లకు చెందిన ఆస్తులను లా-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలు స్వాధీనం చేసుకుంటాయి. వారితో ఎవరైనా కలిసి పనిచేస్తే అలాంటివారిపై కూడా కేసులు నమోదు చేస్తాయి.

38 ఏళ్లకు హిందూ బెంగాలీ కుటుంబాలకు పునరావాసం

తూర్పు పాకిస్థాన్‌ (నేటి బంగ్లాదేశ్‌) నుంచి నిర్వాసితులుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చి 38 ఏళ్లుగా సంచార జీవులుగా ఉన్న 63 హిందూ బెంగాలీ కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పునరావాస అంగీకార పత్రాలు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి కాన్పుర్‌ దేహత్‌ జిల్లా రసూలాబాద్‌లో రెండెకరాల సాగు భూమి, 200 చదరపు మీటర్ల ఇంటి స్థలం చొప్పున ఇవ్వనున్నట్టు చెప్పారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి భారత్‌కు వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు తాము యూపీలో అలాంటి వారి కోసం వెతికి ఈ 63 కుటుంబాలను గుర్తించినట్టు వివరించారు. కరోనా కారణంగా వారికి పునరావాస ప్రక్రియ ఆలస్యమైందని చెప్పారు. భారత ప్రభుత్వం మానవీయ కోణంలో చేస్తున్న సేవకు ఇది అపూర్వ ఉదాహరణ అని యోగి అన్నారు.

జైష్‌-ఎ-మహమ్మద్‌ కమాండర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

జమ్మూ-కశ్మీర్‌లో పలు ఉగ్రవాద ఘటనలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న జైష్‌-ఎ-మహమ్మద్‌ కమాండర్‌ ఆషిక్‌ అహ్మద్‌ నెంగ్రూను... కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించింది. దీంతో గత పక్షం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఉగ్రవాదుల సంఖ్య నాలుగుకు చేరింది. పుల్వామాకు చెందిన నెంగ్రూ (34) జమ్మూ-కశ్మీర్‌లో పలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని, ఉగ్రవాదుల చొరబాటుకు సహకరించాడని కేంద్రం పేర్కొంది. ఉగ్రవాదుల సిండికేట్‌ నడుపుతున్న అతడు పాకిస్థాన్‌ నుంచి వస్తున్న ఆదేశాలను అనుసరించి జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రమాదకర స్థాయిలో పెంచి పోషించే పనిలో నిమగ్నమయ్యాడని ప్రభుత్వం వివరించింది. దేశభద్రతను దృష్టిలో ఉంచుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం కింద అతడిని ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సోమవారం వెల్లడించింది.

పంజాబ్‌లో నెలకు 300 యూనిట్ల విద్యుత్తు ఉచితం

జులై నుంచి పంజాబ్‌లో ప్రజలకు నెలకు 300 యూనిట్లు చొప్పున ఉచిత విద్యుత్తును ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రకటించారు. తన ప్రభుత్వం అధికారంలోకివచ్చి నెలరోజులు పూర్తయిన సందర్భంగా ఈ విషయం చెప్పారు. దళితులు, బీసీలు మినహా మిగిలినవారు రెండు నెలల్లో 600 యూనిట్లకు మించి విద్యుత్తును వినియోగిస్తే మాత్రం మొత్తం వినియోగానికి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఎస్సీలు, బీసీలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు, స్వాతంత్య్ర సమరయోధులు ప్రస్తుతం నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందుతుండగా ఇకపై 300 యూనిట్లు వాడుకోవచ్చని వివరించారు.

దేశంలోనే తొలి విద్యుత్తు హెవీడ్యూటీ టిప్పర్‌

విద్యుత్తు బస్సుల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న ఎంఈఐఎల్‌ గ్రూపు సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ విద్యుత్తు ట్రక్కుల విభాగంలోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా 6×4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్‌ టిప్పర్‌ను రూపొందించింది. త్వరలో దీన్ని దేశీయ విపణిలోకి విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ విద్యుత్తు టిప్పర్‌పై పరీక్షలు నిర్వహిస్తున్నట్లుఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ వెల్లడించింది. మనదేశంలో ఇదే తొలి విద్యుత్తు టిప్పర్‌ అవుతుందని పేర్కొంది. ఒలెక్ట్రా హెవీ డ్యూటీ విద్యుత్తు టిప్పర్‌ను ఒకసారి ఛార్జ్‌ చేస్తే 220 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని, ఘాట్‌ రోడ్లను సైతం సునాయాసంగా ఎక్కగలదని వెల్లడించింది. హైదరాబాద్‌ శివార్లలో త్వరలో ఏర్పాటు చేయనున్న నూతన యూనిట్‌లో ఈ ఎలక్ట్రిక్‌ టిప్పర్‌ ఉత్పత్తిని చేపట్టనున్నట్లు తెలియజేసింది. విద్యుత్తు బస్సుల విభాగంలో దేశంలో తాము అగ్రగామిగా ఉన్నామని, దేశంలోనే తొలిసారిగా ఈ విభాగంలో హెవీ డ్యూటీ టిప్పర్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు.

రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి వ్యవస్థల సరఫరా ప్రారంభం

ఉక్రెయిన్‌ సంక్షోభం, అమెరికా ఆంక్షల బెదిరింపులు వంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి భారత్‌కు ఎస్‌-400 క్షిపణి వ్యవస్థల రెండో విడత సరఫరా ప్రారంభమైంది. రెండో విడతలో అందుతున్న పరికరాల్లో శిక్షణకు సంబంధించిన సిమ్యులేటర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మన దేశానికి ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థల సరఫరా 2021 డిసెంబరులో ప్రారంభమైంది. తొలి విడతలో అందిన క్షిపణులను చైనా, పాకిస్థాన్‌తో మనకున్న సరిహద్దుల వెంట సైన్యం మోహరించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్‌ లవ్రోవ్‌ ఇటీవల దిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు ఎస్‌-400 క్షిపణుల సరఫరా అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. పశ్చిమ దేశాల ఆంక్షలు తమపై కొనసాగుతున్నప్పటికీ ఈ క్షిపణుల అందజేతలో అంతరాయం కలగదని గత నెలలో రష్యా పునరుద్ఘాటించింది. అత్యాధునిక ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థల కొనుగోలుకు మన దేశం 2018 అక్టోబరులో రష్యాతో దాదాపు రూ.38 వేల కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.

ఇండియన్‌ డ్రగ్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ స్వర్ణోత్సవాలు

ఇండియన్‌ డ్రగ్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ స్వర్ణోత్సవాల్లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూశ్‌ గోయల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయ ఫార్మా పరిశ్రమ, జనరిక్‌ ఔషధ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అన్నారు. ఉత్పత్తుల ముడి పదార్థాల నుంచి చివరి దశ వరకు మెరుగ్గా అనుసంధానం చేసుకోవాలి. అపుడే స్వావలంబన సాధించగలమని మంత్రి సూచించారు.

‘ప్రధానమంత్రి సంగ్రహాలయం’ ప్రారంభం

-మాజీ ప్రధానమంత్రుల చరిత్రను తెలియజేసేలా ఏర్పాటు చేసిన సంగ్రహాలయాన్ని (మ్యూజియం) దిల్లీలోని తీన్‌మూర్తి ఎస్టేట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పార్టీలు, పదవీకాలంతో సంబంధం లేకుండా మొత్తం 14 మంది మాజీ ప్రధానుల జీవిత/పరిపాలనా విశేషాలను భవిష్యత్తు తరాలు ఎల్లప్పుడూ స్మరించుకునేలా ‘ప్రధానమంత్రి సంగ్రహాలయం’ పేరుతో ఈ మ్యూజియాన్ని సృష్టించారు.
విశేషాలు :-
- మ్యూజియంలో మొత్తం 43 గ్యాలరీలు ఉన్నాయి. మాజీ ప్రధానుల అరుదైన చిత్రాలు, ప్రసంగాలు, వీడియో క్లిప్‌లు, ఇంటర్వ్యూలు, వారి చేతిరాతలను ఇందులో ప్రదర్శనకు ఉంచారు. స్వాతంత్య్ర సంగ్రామం, రాజ్యాంగ ముసాయిదా రచన వంటి అపురూప ఘట్టాలను గుర్తుచేసే చిత్రాలూ ఉన్నాయి. మాజీ ప్రధానులకు చెందిన కొన్ని వ్యక్తిగత వస్తువులు, వారికి వచ్చిన బహుమతులను కూడా పొందుపరిచారు.
- ఈ మ్యూజియాన్ని 10,491 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.271 కోట్ల వ్యయంతో నిర్మించారు.
- మ్యూజియంపై ప్రజాస్వామ్యానికి చిహ్నమైన ధర్మచక్రాన్ని దేశ ప్రజలు ఎత్తి పట్టుకున్నట్లుగా లోగో ఉంటుంది.
- సంగ్రహాలయాన్ని సాంకేతికంగా ఉన్నత విలువలతో తీర్చిదిద్దారు. హోలోగ్రామ్‌లు, వర్చువల్‌ రియాలిటీ సాంకేతికత, మల్టీమీడియా, ఇంటరాక్టివ్‌ స్క్రీన్లను జోడించారు. ఆడియో గదులను ఏర్పాటు చేశారు.

విజయవాడ ఎయిర్‌పోర్టులో యాంబులిఫ్ట్‌ సౌకర్యం

అనారోగ్యం కారణంగా కదల్లేని పరిస్థితుల్లో ఉన్నవారు, చక్రాల కుర్చీలకు పరిమితమైన దివ్యాంగులు, స్ట్రెచర్‌ మీద ఉండే రోగులను నేరుగా విమానాల్లోకి ఎక్కించేందుకు అవసరమైన యాంబులిఫ్ట్‌ సౌకర్యాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా విజయవాడతో సహా దేశంలోని 14 విమానాశ్రయాల్లోకి అందుబాటులోకి తెచ్చింది. సుగమ్య భారత్‌ అభియాన్‌లో భాగంగా అన్ని రకాల ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం కల్పించాలన్న ఉద్దేశంతో ఏఏఐ 20 యాంబులిఫ్ట్‌లను కొనుగోలు చేసింది. ఏరో బ్రిడ్జి అందుబాటులో లేని విమానాలకు ఈ లిఫ్ట్‌ సౌకర్యాన్ని కల్పిస్తారు. ప్రస్తుతం విజయవాడ, డెహ్రాడూన్, గోరఖ్‌పుర్, పట్నా, బాగ్డోగ్రా, దర్భంగా, ఇంఫాల్, పోర్ట్‌బ్లెయిర్, జోద్‌పుర్, బెలగావి, సిల్చార్, ఝార్సుగూడ, రాజ్‌కోట్, హుబ్బళ్లి విమానాశ్రయాల్లో అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ వివరించింది. ఈ ఒక్కో లిఫ్ట్‌లో ఆరు చక్రాల కుర్చీలు, రెండు స్ట్రెచర్లను ఒకేసారి ఉపయోగించవచ్చు. ఇందులో హీటింగ్‌ వెంటిలేషన్, ఎయిర్‌కండీషనింగ్‌ సౌకర్యం కూడా ఉంటుంది. పూర్తిగా భారత్‌లోనే తయారు చేసిన ఒక్కో లిఫ్ట్‌ ఖరీదు రూ.63 లక్షలు.

2026 వరకూ రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌: కేంద్రం

పంచాయతీరాజ్‌ సంస్థల పాలనా సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు అవసరమైన వనరులు సమకూర్చడమే లక్ష్యంగా ప్రారంభించిన రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ) అమలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2022 ఏప్రిల్‌ నుంచి 2026 మార్చి 31 వరకు మొత్తం రూ.5,911 కోట్ల వ్యయంతో దాన్ని అమలుచేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఇందులో కేంద్రం వాటా రూ.3,700 కోట్లుగా, రాష్ట్రాల వాటా రూ.2,211 కోట్లుగా ఉండనుంది. దీనివల్ల 2.78 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రం వెల్లడించింది. అందుబాటులో ఉన్న వనరులను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకొని గ్రామీణ స్థానిక సంస్థలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొంది. స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా ఆర్‌జీఎస్‌ఏను పునర్‌వ్యవస్థీకరించినట్లు తెలిపింది. పేదరిక నిర్మూలన, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కల్పన, పల్లెలను ఆరోగ్యవంతంగా మార్చడం, గ్రామీణ ప్రాంతాలను చిన్నారులకు అనుకూలంగా తీర్చిదిద్దడం, తగినంత తాగునీరు అందించడం, పల్లెలను పచ్చగా-స్వచ్ఛంగా మార్చడం, అవసరమైనమేరకు మౌలికవసతులు కల్పించడం, సామాజిక భద్రత నెలకొల్పడం, సుపరిపాలనకు పునాదులు వేయడం, గ్రామాల్లో పర్యావరణ అనుకూల అభివృద్ధి పనులు చేపట్టడం వంటివి ఈ పథకం ప్రధాన లక్ష్యాలని కేంద్రం పేర్కొంది. 2016 - 17 బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆర్‌జీఎస్‌ఏ తొలుత 2018 ఏప్రిల్‌ 1 నుంచి 2022 మార్చి 31 వరకు అమలైంది.

మూసేసిన బొగ్గు క్షేత్రాలు మౌలికవసతుల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

‘కోల్‌ బేరింగ్‌ ఏరియాస్‌ (అక్విజిషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) యాక్ట్‌-1957’ కింద సేకరించి, ప్రస్తుతం బొగ్గు తవ్వకాలు ముగిసిపోయిన భూములను బొగ్గు, విద్యుత్తు రంగాలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు కోసం ఉపయోగించుకోవడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇకపై బొగ్గు తవ్వకాలు చేపట్టడం ఏమాత్రం సాధ్యం కాని ప్రాంతాలు, ఇప్పటికే మొత్తం బొగ్గు తవ్వేసి చదును చేసిన భూములను ఇందుకోసం వాడుకోవడానికి అనుమతి ఇచ్చింది. కోల్‌ వాషరీలు, కన్వేయర్‌ వ్యవస్థలు, కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్లు, రైల్వే ట్రాక్‌ల నిర్మాణం వంటి అవసరాలతోపాటు బొగ్గు గనుల కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు సహాయ-పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకూ వీటిని వినియోగించుకోవచ్చని కేంద్రం తెలిపింది. అడవుల పెంపకానికీ ఇందులో వీలు కల్పించింది. మరోవైపు మురుగునీటి శుద్ధికి అవసరమైన సరికొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో కలిసికట్టుగా కృషిచేసేందుకుగాను జపాన్‌తో మనదేశం ఇటీవల కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

భారత్‌ తయారీ విమానంతో తొలిసారి వాణిజ్య సేవలు

భారత్‌లో తయారైన డోర్నియర్‌ - 228 విమానం తొలిసారిగా వాణిజ్య అవసరాల కోసం వినియోగంలోకి వచ్చింది. ఇందులో భాగంగా ఇది అస్సాంలోని దిబ్రూగఢ్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పాసిఘాట్‌కు ప్రయాణించింది. ఈ విమానంలో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్‌ రిజిజు ఉన్నారు. పాసిఘాట్‌లో జల ఫిరంగులతో నీటిని చిమ్మడం ద్వారా ఈ విమానానికి అధికారులు స్వాగతం పలికారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘అలయెన్స్‌ ఎయిర్‌’ సంస్థ ఈ విమాన సర్వీసులను వాణిజ్య ప్రాతిపదికన అందుబాటులోకి తెచ్చింది. తద్వారా భారత్‌లో తయారైన ఒక విమానాన్ని పౌర అవసరాలకు వినియోగంలోకి తీసుకొచ్చిన తొలి సంస్థగా గుర్తింపు సాధించింది. ఇప్పటివరకూ డోర్నియర్‌ - 228 విమానాలను సైనిక దళాలు మాత్రమే వినియోగించేవి. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అయిదు సుదూర ప్రాంతాలకు ఈ వైమానిక సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్పారు.

దేశంలోని తొలి కర్బన రహిత పంచాయతీగా పల్లీ గ్రామం

జమ్మూ - కశ్మీర్‌లో క్షేత్రస్థాయికి ప్రజాస్వామ్యం చేరుకుందని, గత రెండు మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ప్రాంతం ప్రగతి పథంలో పయనిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం’ సందర్భంగా మోదీ, జమ్మూ - కశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని పల్లీ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ 500 కిలోవాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో ఆ గ్రామం దేశంలోని తొలి కర్బన రహిత పంచాయతీగా నిలిచింది. అక్కడి నుంచే దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. 2019లో జమ్మూ - కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించే 370వ అధికరణం ఉపసంహరించిన తర్వాత మోదీ ఈ ప్రాంతంలో పూర్తిస్థాయిలో పర్యటించడం ఇదే తొలిసారి. సుమారు రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు. జమ్మూ - శ్రీనగర్‌ మధ్య దూరాన్ని తగ్గించే బనిహాల్‌ - కాజీగుండ్‌ సొరంగ మార్గాన్ని పల్లీ గ్రామం నుంచే వర్చువల్‌గా ప్రారంభించారు. చీనాబ్‌ నదిపై రెండు జల విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. భూమిపై యాజమాన్య హక్కులు కల్పించే ‘స్వామిత్ర’ కార్డులను రైతులకు అందజేశారు.

జామ్‌నగర్‌లో అంతర్జాతీయ వైద్య కేంద్రానికి మోదీ శంకుస్థాపన

సంప్రదాయ ప్రాచీన వైద్యానికి సంబంధించి నూతన శకం ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజున ఆ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో భాగంగా జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ అంతర్జాతీయ కేంద్రంతో సంప్రదాయ వైద్యంలో ఓ నూతన శకం ప్రారంభం కానుందని అన్నారు. రానున్న 25 ఏళ్లలో ఈ కేంద్రం ప్రపంచ మానవాళికి దగ్గర కానుందని వారి జీవితాల్లో కీలక భాగం కానుందని పేర్నొన్నారు. భారతీయ ప్రాచీన విజ్ఞాన సంపద గురించి మోదీ మాట్లాడారు. ఆయుర్వేద. ఇతర సంప్రదాయ వైద్యాలు కేవలం చికిత్సా విధానాలు మాత్రమే కావని.. అవి భారతీయుల సమగ్ర జీవన విధానానికి ప్రతిబింబాలని పేర్కొన్నారు.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

నేరాలకు పాల్పడిన వ్యక్తులను సత్వరమే గుర్తించేందుకు, దర్యాప్తును వేగిరం చేసే లక్ష్యంతో అనుమానితుల, నేరగాళ్ల కొలతలు, బయోమెట్రిక్‌ నమూనాలను సేకరించేందుకు పోలీసులకు, జైలు వార్డన్లకు అధికారం కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఐడెంటిఫికేషన్‌) బిల్లును 1920నాటి ఖైదీల గుర్తింపు చట్టం స్థానంలో తీసుకువస్తున్నారు. బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించటానికి ముందు జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానమిచ్చారు. విపక్ష సభ్యులు వ్యక్తం చేసిన భయాందోళనలను తోసిపుచ్చారు. శాంతిభద్రతలు, అంతర్గత భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతోనే క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఐడెంటిఫికేషన్‌) బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు.

అకౌంటెన్సీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

-చార్టర్డ్‌ అకౌంటెంట్స్, కాస్ట్‌ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్‌కు చెందిన సంస్థల్లో సంస్కరణలకు ఉద్దేశించిన సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. తాజాగా ప్రతిపాదించిన మార్పులు ఆ మూడు సంస్థల స్వయంప్రతిపత్తికి ఎలాంటి విఘాతం కలిగించబోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ హామీ ఇచ్చారు. ఈ బిల్లులోని కొన్ని అంశాలపై విపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఈ బిల్లును మార్చి 30న ఆమోదించింది. దీంతో అకౌంటెన్సీ బిల్లుకు పార్లమెంటులోని ఉభయ సభల సమ్మతి లభించినట్లయ్యింది. -ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ), ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (గతంలో ఐసీడబ్ల్యూఏఐ), ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ)లలోని క్రమశిక్షణ సంఘాలకు ఆయా వృత్త్యేతరులైన వ్యక్తులు ప్రిసైడింగ్‌ అధికారులుగా బాధ్యతలు చేపట్టేందుకు సవరణ బిల్లు అవకాశం కల్పిస్తుంది. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన కార్యదర్శి స్థాయి అధికారి అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటును బిల్లు ప్రతిపాదించింది. మూడు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ చట్టం - 1949, కాస్ట్‌ అండ్‌ వర్క్స్‌ అకౌంటెంట్స్‌ చట్టం - 1959, కంపెనీ సెక్రటరీస్‌ చట్టం - 1980లకు సవరణలు జరగనున్నాయి. - సామూహిక జన హనన ఆయుధాలు, వాటి ప్రయోగ వ్యవస్థలు (చట్టవ్యతిరేక కార్యకలాపాల నిషేధ) సవరణ బిల్లును విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సామూహిక జన హనన ఆయుధాల (డబ్ల్యూఎండీ) తయారీకి ఆర్థిక సహాయాన్ని అడ్డుకోవడంతో పాటు అటువంటి కార్యకలాపాలకు తోడ్పడే వ్యక్తుల ఆస్తులను, ఆర్థిక వనరులను జప్తు చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు కల్పిస్తుంది. అంతర్జాతీయ కర్తవ్యాలను నిర్వర్తించే చర్యల్లో భాగంగా ఈ బిల్లును తీసుకురావాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. 2005లోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ సామూహిక జన హనన ఆయుధాల తయారీని మాత్రమే అది నిషేధించింది. ఈ చట్టం కింద నిషేధించిన కార్యకలాపాలకు ఏ వ్యక్తి నిధులు అందజేయరాదని, ఆర్థిక తోడ్పాటునందించే చర్యల్లో భాగస్వామికారాదని పేర్కొంటూ అదనంగా సెక్షన్‌ 12(ఏ)ను చేర్చేందుకు బిల్లులో ప్రతిపాదించారు.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ బిల్లుకు ఆమోదం

పార్లమెంటు క్రిమినల్‌ ప్రొసీజర్‌ (గుర్తింపు) బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. రాజకీయ ఖైదీల బయోమెట్రిక్‌ వివరాలు సేకరించబోమని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రతిపాదిత చట్టం నుంచి బ్రెయిన్‌ మ్యాపింగ్, పాలీగ్రాఫ్‌ పరీక్షలను మినహాయిస్తున్నట్లు తెలిపారు.

ఆయుధాలకు ఆర్థిక తోడ్పాటుపై సవరణ బిల్లు

సామూహిక విధ్వంసకర ఆయుధాలకు నిధులు సమకూర్చడంపై నిషేధం విధించడంతో పాటు ఇలాంటి కేసుల్లో ఆయా వ్యక్తుల ఆస్తులు, ఆర్థిక వనరులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అనుమతించే సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. బిల్లును అందరూ స్వాగతించడంతో సభ మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపింది. జాతీయ భద్రతను, ప్రపంచ దేశాల్లో మన స్థానాన్ని ఇది సుస్థిరం చేస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వ్యాఖ్యానించారు.

తెలంగాణ అర్బన్‌ ఫారెస్ట్‌లకు అంతర్జాతీయ గుర్తింపు

హరితహారంలో భాగంగా అమలు చేస్తున్న పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలకు గానూ తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. హరితహారం కింద రాష్ట్రంలో 109 పట్టణ అటవీ ఉద్యానవనాలను (అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల) అభివృద్ధి చేయగా హెచ్‌ఎండీఏ పరిధిలోనే 59 పార్కులుండటంతో హైదరాబాద్‌ పరిసరాల్లో క్రమంగా పచ్చదనం పరుచుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల పురోగతిని అంతర్జాతీయ సంస్థ వరల్డ్‌ ఫారెస్ట్‌ సైన్స్‌ గుర్తించింది. అదనపు అటవీ సంరక్షణాధికారి ఎం.సి.పర్గెయిన్‌ రాసిన వ్యాసం ఆ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్‌ బ్లాగ్‌ పోటీలో మూడో స్థానం సంపాదించింది. ప్రపంచ ట్రీసిటీగా ఇటీవలే గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్‌ పర్యావరణపరంగా పునరుజ్జీవం పొందేందుకు దోహదపడుతున్న అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులపై ‘రిసిలియెన్స్‌ అండ్‌ బెటర్‌ లైఫ్‌ విత్‌ అర్బన్‌ ఫారెస్ట్స్‌ ఇన్‌ హైదరాబాద్‌’ పేరుతో పర్గెయిన్‌ ఈ బ్లాగ్‌ రాశారు.

ఎలక్ట్రానిక్స్‌ పరిశోధనలో చెన్నైకి రెండో స్థానం

ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌గా చెన్నై వృద్ధి చెందుతోంది. ఎఫ్‌డీఐ ఇంటెలిజెన్స్‌ సంస్థ ప్రకటించిన అంతర్జాతీయ ర్యాంకుల్లో ఈ రంగంలో నాణ్యమైన పరిశోధనలు, అభివృద్ధి పరంగా రెండో స్థానం సంపాదించుకుంది. నాణ్యమైన ఆర్‌ అండ్‌ డీలో దక్షిణ కొరియాకు చెందిన సియోల్‌ తొలిస్థానంలో ఉండగా, చెన్నై, చైనాలోని గ్వాంగ్‌జౌ, షెన్‌జెన్, టర్కీ నుంచి ఇస్తాంబుల్, భారత్‌లోని బెంగళూరు, పుణె, గుర్గావ్, మలేసియాలోని పెనంగ్, జపాన్‌లోని టోక్యో టాప్‌ - 10 జాబితాలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌ పరిశోధనలకు తక్కువ ఖర్చయ్యే నగరాల్లో చెన్నై మొదటి స్థానంలో ఉంది.

దేశంలోనే తొలి ‘ఉక్కు రోడ్డు’ నిర్మాణం

కేంద్ర రహదారి పరిశోధన సంస్థ (సీఆర్‌ఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఉక్కు కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలను రహదారుల నిర్మాణంలో వాడారు. దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ పరిశోధనలో ఉక్కు వ్యర్థాలను కంకరగా మార్చారు. అలా తయారు చేసిన ‘ఉక్కు కంకర’తో ప్రయోగాత్మకంగా గుజరాత్‌లోని సూరత్‌ సమీపంలో హజీరా ఓడరేవు వద్ద 1.2 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారి నిర్మించారు. ఇందులో శుద్ధి చేసిన ఉక్కు వ్యర్థాలను లక్ష టన్నుల మేర వాడారు. ఇలా దేశంలోనే మొట్టమొదటి ‘ఉక్కు రోడ్డు’ నిర్మితమైంది. ఏదైనా రహదారి నిర్మించేటప్పుడు దాని మీదుగా ఎంత బరువైన, ఎన్ని వాహనాలు వెళ్తాయన్నదాన్ని బట్టి ఆ రహదారి నిర్మాణ ప్రమాణాలను ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ నిర్దేశిస్తుంది. ఉక్కు కంకరను వాడటం ఇదే తొలిసారి. హజీరా ఓడరేవు నుంచి ప్రతిరోజూ 30-40 టన్నుల బరువుండే 1000-1200 ట్రక్కులు వెళ్తాయి. అందుకే ఎక్కువ బరువును తట్టుకుంటుందో లేదో చూడాలని అక్కడ నిర్మించారు. మామూలుగానైతే అక్కడి రహదారి మందం 600-700 మిల్లీమీటర్లు ఉండాలి. కానీ, ఉక్కు రోడ్డు మందాన్ని 30% తగ్గించారు. అయినా ఈ రహదారి బ్రహ్మాండంగా నిలబడి శాస్త్రవేత్తల అంచనాలను అందుకుంది. దేశంలోని వివిధ ఉక్కు కర్మాగారాల నుంచి ఏటా 1.9 కోట్ల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 2030 నాటికి ఇవి 5 కోట్ల టన్నులకు చేరుకుంటాయని అంచనా. విశాఖ ఉక్కు కర్మాగారంలోనూఇప్పటికి 40 లక్షల టన్నుల వ్యర్థాలున్నాయి. వీటన్నింటినీ ఇప్పటివరకూ ఘనవ్యర్థాలుగా భావించి వదిలేస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం సీఆర్‌ఆర్‌ఐతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. ఫిబ్రవరిలో సీఆర్‌ఆర్‌ఐ బృందం విశాఖ వచ్చింది. . ఉక్కు కర్మాగారాల్లో ముడి పదార్థాన్ని 1500-1600 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద మండించినప్పుడు ఉక్కుతో పాటు, వ్యర్థాలూ ఉత్పత్తి అవుతాయి. వీటిని శుద్ధి చేసి, వివిధ పరిమాణాల్లో కంకర రూపంలోకి మారుస్తారు. ఇప్పటికైతే ఉక్కు వ్యర్థాలన్నీ పొడిరూపంలోనే వస్తున్నాయి గానీ, ఇకపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఈ వ్యర్థాలను నిర్దిష్ట పరిమాణాల్లో (3 నుంచి 20 మిల్లీమీటర్ల వరకూ) కంకర రాళ్లలా వచ్చేలా మార్గదర్శకాలు ఇవ్వనుంది.

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ట్రాన్స్‌జెండర్ల రక్షణకు ‘ప్రైడ్‌ ప్లేస్‌’ ప్రత్యేక విభాగం

దేశంలో తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ల రక్షణ కోసం ‘ప్రైడ్‌ ప్లేస్‌’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. డీజీపీ మహేందర్‌రెడ్డి భవిష్యత్తుకు ఇది గొప్ప నాంది అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యలకు వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ కేంద్రంగా ‘ప్రైడ్‌ ప్లేస్‌’ పనిచేస్తుందన్నారు. ఇతరుల్లాగా ట్రాన్స్‌జెండర్లు కూడా గౌరవంతో జీవించేందుకు ఈ వేదిక తోడ్పాటు అందిస్తుందని తెలంగాణ మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా అన్నారు.

దేశంలో త్వరలో నూతన సహకార విధానం: అమిత్‌షా

దేశంలో త్వరలో నూతన సహకార విధానాన్ని తీసుకువస్తామని కేంద్ర సహకారశాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. సహకార విధానంపై జాతీయ స్థాయిలో రెండురోజుల పాటు జరిగిన కార్యశాల ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం వెల్లడించారు. దేశంలో సహకార వ్యవస్థ బలోపేతం కావాలంటే అన్ని రాష్ట్రాల సహకార చట్టాల మధ్య సారూప్యత ఉండాలని, దీనిపై రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయం సాధిస్తామని పేర్కొన్నారు. ‘1950 నాటి సహకార చట్టాలు 2022లో పనికిరావు కాబట్టి వాటిని మార్చాల్సిన అవసరం ఉంది. బీమా, వైద్యం, పర్యాటకం, ప్రాసెసింగ్, స్టోరేజ్, సేవల రంగంలోనూ సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామానికి సహకార వ్యవస్థ చేరటం మా కొత్త లక్ష్యం’’ అని అమిత్‌షా పేర్కొన్నారు.

పఠాన్‌కోట్‌ దాడిలో అలీ కషీఫ్‌ జాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై 2016లో చోటుచేసుకున్న ఉగ్రదాడికి సంబంధించి పాకిస్థాన్‌ సూత్రధారి అలీ కషీఫ్‌ జాన్‌ (42)ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. పఠాన్‌కోట్‌ ఘటనలో ఏడుగురు భద్రతా సిబ్బంది, ఓ పౌరుడు మరణించారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం 5 రోజుల వ్యవధిలో ఉగ్రవాదులగా ప్రకటించినవారిలో మూడో వ్యక్తి జాన్‌ అలియాస్‌ జాన్‌ అలీ కషీఫ్‌. నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహ్మద్‌ (జేఈఎం)లో జాన్‌ ఆపరేషనల్‌ కమాండర్‌గా ఉన్నాడని, కీలక ప్రణాళిక కమిటీలో సభ్యుడని కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది. పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలను నిర్వహించడంతోపాటు జేఈఎం తరఫున నియామకాలు, శిక్షణ వంటి కార్యకలాపాలు చేపడుతున్నాడని, భారత్‌లోని వివిధ దాడుల ప్రణాళికలను సమన్వయం చేస్తున్నాడని వివరించింది. కేంద్రం ఉగ్రవాదులుగా ప్రకటించిన వ్యక్తుల జాబితాలో జాన్‌ 34వ వ్యక్తి. 1982 జనవరి 30న జన్మించిన అతను పాక్‌లోని ఖైబర్‌ ఫక్తుంక్వాలోని చార్‌సద్దాలో నివాసం ఉంటున్నాడు. జాన్‌పై ఇప్పటికే రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ అయింది.

భారత సైన్యానికి టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ‘ఇన్‌ఫాంట్రీ’ వాహనం

టాటా గ్రూపు సంస్థ టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఎస్‌ఏఎల్‌) ఉత్పత్తి చేసిన మొదటి ఇన్‌ఫాంట్రీ ప్రొటెక్టెడ్‌ మొబిలిటీ వెహికల్‌ (ఐపీఎంవీ)ను భారత సైన్యానికి అప్పగించింది. పుణెలో జరిగిన కార్యక్రమంలో భారత సైన్యాధ్యక్షుడు జనరల్‌ ఎంఎం నరవనే ఈ వాహనాన్ని స్వీకరించారు. ప్రైవేటు రంగం నుంచి భారత పదాతి దళానికి ఇలాంటి వినూత్న రక్షణ వాహనాన్ని అందించిన ఘనత టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు దక్కుతుంది. డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) సహకారంతో ఈ వాహనాన్ని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ తీర్చిదిద్దింది. ఎత్తైన ప్రదేశాల్లో సైన్యం అవసరాలకు ఈ వాహనం ఎంతో అనుకూలంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

వైమానిక దళ చినూక్‌ హెలికాప్టర్‌ రికార్డు

భారత వైమానిక దళానికి చెందిన చినూక్‌ హెలికాప్టర్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకధాటిగా ఏడున్నర గంటల పాటు గగనవిహారం చేసి చండీగఢ్‌ నుంచి అస్సాంలోని జోర్హట్‌ చేరుకుంది. ఈ క్రమంలో 1,910 కిలోమీటర్లు ప్రయాణించింది. బలగాలు, శతఘ్నులు, ఇతర సాధన సంపత్తిని రవాణా చేయడానికి ఉద్దేశించిన ఈ హెలికాప్టర్‌ను అమెరికా నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంది.

పుల్వామా దాడి నిందితుడు ఆలంగీర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

పుల్వామా దాడిలో నిందితుడు, పాకిస్థాన్‌ జాతీయుడైన మొహియుద్దిన్‌ ఔరంగజేబ్‌ ఆలంగీర్‌ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది వెళ్తున్న బస్సును ఉగ్రవాదులు పేల్చివేశారు. ఆ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఆలంగీర్‌ (39) అలియాస్‌ మఖ్తాబ్‌ అమీర్‌కు ముజాహిద్‌ భాయ్, మహమ్మద్‌ భాయ్‌ అనే మారుపేర్లు ఉన్నాయి. ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌ తరఫున మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాడని, పుల్వామా దాడిలో ఆలంగీర్‌ ప్రమేయం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

మా ఉమియా దేవస్థానం 14వ వ్యవస్థాపక దినోత్సవం

గుజరాత్‌ జూనాగఢ్‌ జిల్లాలోని వంథలీలో కడ్వా పాటీదార్లు కొలిచే మా ఉమియా దేవస్థానం 14వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన మహా పాటోత్సవ్‌ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని వర్చువల్‌గా ప్రసంగించారు. రసాయన ఎరువుల ముప్పు నుంచి పుడమి తల్లిని రక్షించడానికి ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా భక్తులకు పిలుపునిచ్చారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ప్రతి జిల్లాలో నీటిని సంరక్షించడానికి 75 అమృత్‌ సరోవర్లను (చెరువులను) నిర్మించాలని సూచించారు. పోషకాహార లోపంతో ఉన్న పిల్లలు, రక్తహీనతతో బాధపడుతున్న తల్లుల ఆరోగ్య సంరక్షణకు గ్రామాల స్థాయిలో ప్రాజెక్టులు చేపట్టాలన్నారు.

వరుసగా మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఏచూరి ఎన్నిక

సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ సీనియర్‌ నేత సీతారాం ఏచూరి మళ్లీ ఎన్నికయ్యారు. ఈ పదవిని ఆయన చేపట్టడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. 2015 ఏప్రిల్‌ 9న విశాఖపట్నంలో జరిగిన 21వ పార్టీ కాంగ్రెస్‌లో తొలిసారి ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపికైన ఏచూరి 2018 ఏప్రిల్‌ 22న హైదరాబాద్‌లో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. కేరళలోని కన్నూరులో ముగిసిన 23వ పార్టీ కాంగ్రెస్‌లో కూడా నూతన కేంద్ర కమిటీ ఏచూరిని మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. ఈ సందర్భంగా 69 ఏళ్ల ఏచూరి మాట్లాడుతూ భాజపాను ఒంటరి చేసి ఓడించడమే పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఫాసిస్టు ఆరెస్సెస్‌ హిందుత్వ మత ఎజెండాను భాజపా దేశవ్యాప్తంగా అమలుపరుస్తోందని, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా భారత్‌ మనుగడ సాగించాలంటే కాషాయ పార్టీని కనుమరుగు చేయాలని అన్నారు. 2005 నుంచి 2015 వరకు వరుసగా మూడుసార్లు ప్రకాశ్‌ కారాట్‌ సీపీఎం ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించారు. అదే సంప్రదాయాన్ని ఏచూరి కొనసాగించారు. పుచ్చలపల్లి సుందరయ్య, ఈఎంఎస్‌ నంబూద్రిప్రసాద్, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్, ప్రకాశ్‌ కారాట్‌ తర్వాత సీపీఎం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన 5వ వ్యక్తి సీతారాం ఏచూరి. దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక పార్టీల ప్రాబల్యం తగ్గిపోతున్న తరుణంలో పార్టీని బలోపేతంచేసి, వామపక్షాల ఐక్యతను పెంపొందించడం ప్రస్తుతం సీతారాం ఏచూరి మీదున్న ప్రధాన బాధ్యత. 85 మందితో కేంద్ర కమిటీ 23వ పార్టీ కాంగ్రెస్‌లో 85 మందితో కేంద్ర కమిటీ ఏర్పాటైంది. ఒక్క స్థానం మినహా మిగిలిన 84 స్థానాలకు సభ్యులను ఎన్నుకున్నారు. అందులో 15 మంది మహిళలు, 17 మంది కొత్తవారు. తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, జి.నాగయ్య, చెరుపల్లి సీతారాములు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వి.శ్రీనివాసరావు, గఫూర్‌లు ఉన్నారు. వీరితోపాటు అఖిల భారత కోటాలో తెలుగు వారు బి.వి.రాఘవులు, పుణ్యవతి, హేమలత, అరుణ్‌కుమార్, బి.వెంకట్‌ కేంద్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇదివరకటి కేంద్ర కమిటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల తరుఫున ప్రాతినిధ్యం వహించిన ఎస్‌.వీరయ్య, పి.మధులకు ఈసారి స్థానం దక్కలేదు. తెలంగాణకు చెందిన జి.రాములు స్థానంలో ఈసారి సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌ సభ్యుడిగా ఎస్‌.వీరయ్య నియమితులయ్యారు. పార్టీ చరిత్రలో తొలిసారి.. 17 మందితో కూడిన పొలిట్‌బ్యూరోలోకి 14 మంది పాతవారు కాగా, ముగ్గురు కొత్తవారు వచ్చారు. ఈసారి పార్టీ చరిత్రలోనే తొలిసారి ఓ దళితుడికి పొలిట్‌ బ్యూరోలో చోటు దక్కింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన దళిత నేత రామచంద్ర డోమ్‌ను బ్యూరోలోకి తీసుకున్నారు. ఈయనతో పాటు అశోక్‌ ధావలే, ఎ.విజయరాఘవన్‌లకు కొత్తగా స్థానం కల్పించారు. పాతవారిలో సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కారాట్, పినరయి విజయన్, కొడియేరి బాలకృష్ణన్, బృందా కారాట్, మాణిక్‌ సర్కార్, మహమ్మద్‌ సలీం, సూర్జ్యకాంత్‌ మిశ్ర, బి.వి.రాఘవులు, తపన్‌సేన్, నీలోత్పల్‌ బసు, ఎంఏ బేబీ, జి.రామకృష్ణన్, సుభాషిణి అలీ యథాతథంగా కొనసాగనున్నారు. గరిష్ఠ వయో పరిమితి అర్హతైన 75 సంవత్సరాలు దాటిపోవడంతో సీనియర్‌ నేతలు రామచంద్రన్‌ పిళ్లై, బిమన్‌ బోస్, హన్నన్‌ మొల్లను పొలిట్‌ బ్యూరో నుంచి తప్పించారు. వారిని కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.

‘ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌’ పరికరాల రూపకల్పనలో డీఎల్‌ఆర్‌ఎల్‌ కృషి

ముప్పును, శత్రువు దాడిని పసిగట్టడం, అరికట్టడం చాలా కీలకం. ఈ విధుల్లో కీలకమైనది ఎలక్ట్రానిక్‌ వార్‌ ఫేర్‌ (ఈడబ్ల్యూ). రక్షణ శాస్త్రవేత్తల భాషలో చెప్పాలంటే సైన్యానికి కళ్లు, చెవుల వంటిది. ఎలక్ట్రానిక్‌ యుద్ధతంత్రంలో కీలక వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిలో హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (డీఎల్‌ఆర్‌ఎల్‌) కీలక పాత్ర పోషిస్తోంది. డీఆర్‌డీవో పరిధిలోని డీఎల్‌ఆర్‌ఎల్‌ హైదరాబాద్‌లో ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయింది.

ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ అనేది ఏ దేశ రక్షణ వ్యవస్థకైనా అత్యంత కీలకం. శత్రువుల దాడిని పసిగట్టేందుకు రేడియో, ఇన్‌ఫ్రారెడ్, రాడార్‌ ద్వారా సంకేతాలను గ్రహించడం, జామర్లతో అంతరాయం కలిగించడం తదితరాలు ఈడబ్ల్యూ పని. అధునాతన ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌తోనే ఇది సాధ్యమవుతుంది. మన రక్షణ వ్యవస్థలను మనమే రూపొందించుకోవాలనే సంకల్పంతో 1961లో హైదరాబాద్‌ చంద్రాయణగుట్టలో డీఎల్‌ఆర్‌ఎల్‌ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ సంస్థ ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌కు సంబంధించి పరిశోధనలతో పెద్ద సంఖ్యలో పరికరాలను, సమీకృత వ్యవస్థలను అభివృద్ధి, ఉత్పత్తి చేస్తోంది.

క్లిష్టమైన ఎలక్ట్రానిక్‌ వార్‌ ఫేర్‌లో రాడార్లు, ట్రాన్స్‌మిటర్లు, యాంటెనాలు, సెన్సర్లు, కమ్యూనికేషన్‌ పరికరాలు ఉంటాయి. వీటిని పరీక్షించేందుకు భారీ మౌలిక సదుపాయాల అవసరం ఉంటుంది. 1998లో డీఎల్‌ఆర్‌ఎల్‌ ల్యాబ్‌కు కొనసాగింపుగా ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ను ల్యాబ్‌లో పరీక్షించేందుకు ఏడాది కొన్నిసార్లు రెండేళ్లు పట్టేది. ఈ సమయం తగ్గించేందుకు, క్షేత్రస్థాయిలో పరీక్షల నిర్వహణకు కర్నూలు జిల్లాలో అవుట్‌డోర్‌ టెస్టింగ్‌ రేంజ్‌ ఏర్పాటు చేశారు.

‣ పరిశోధనల్లో మూడున్నర దశాబ్దాల అనుభవం కలిగిన సీనియర్‌ శాస్త్రవేత్త నూతి శ్రీనివాసరావు ఈ నెల 1న డీఆల్‌ఆర్‌ఎల్‌ నూతన డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

‣ ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సాంకేతికతల్లో కమ్యూనికేషన్, రాడార్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌ అభివృద్ధి.

‣ యుద్ధ విమానాలు, ఓడలు, యుద్ధ ట్యాంకులు, సబ్‌మెరైన్ల కోసం ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌ (ఈఎల్‌ఐఎన్‌టీ), కమ్యూనికేషన్స్‌ ఇంటెలిజెన్స్, రాడార్, కమ్యూనికేషన్‌ జామింగ్‌ వ్యవస్థలకు రూపకల్పన.

‣ ఏరోస్టాట్, యూఏవీ (మానవ రహిత ఏరియల్‌ వాహనం), ఉపగ్రహాల కోసం కమ్యూనికేషన్స్, రాడార్‌ ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌కు రూపకల్పన.


5 రైల్వేస్టేషన్లలో ‘వన్‌ స్టేషన్‌ - వన్‌ ప్రొడక్ట్‌’

స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే, విక్రయించే కేంద్రాలుగా రూపొందించాలనే లక్ష్యంతో జోన్‌ పరిధిలో సికింద్రాబాద్, విజయవాడ, కాచిగూడ, గుంటూరు, ఔరంగాబాద్‌ రైల్వేస్టేషన్లలో ‘వన్‌ స్టేషన్‌ - వన్‌ ప్రొడక్ట్‌’ కార్యక్రమాన్ని దక్షిణమధ్య రైల్వే ప్రారంభించింది. దీన్ని 30 రోజుల (రెండు విడతలు 15 రోజుల చొప్పున)పాటు అమలు చేస్తున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. 2022 ఏప్రిల్‌ 9 నుంచి మే 7 వరకు ఇది అమల్లో ఉంటుంది. తిరుపతి స్టేషన్‌లో ఇప్పటికే అమల్లో ఉండగా, అక్కడ మరో 30 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేలా రైల్వేస్టేషన్‌ను ఒక విక్రయ కేంద్రంగా, ప్రదర్శనశాలగా వినియోగించి స్థానిక హస్తకళాకారులకు, చేనేత/వస్త్ర కళాకారులకు, గిరిజనులకు జీననోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో 2022 - 23 బడ్జెట్‌లో ‘వన్‌ స్టేషన్‌- వన్‌ ప్రొడక్ట్‌’ విధానాన్ని ప్రకటించినట్లు ద.మ.రైల్వే వివరించింది.

భారత్‌లోకి క్యాలీఫ్లవర్‌ వచ్చి 200 ఏళ్లు పూర్తి

క్యాలీఫ్లవర్‌ భారతావనిలో వేళ్లూనుకొని 2022కి సరిగ్గా 200 ఏళ్లయింది. పేద, సంపన్న తేడా లేకుండా రెండు శతాబ్దాలుగా కోట్ల మంది భారతీయుల జిహ్వ చాపల్యాన్ని తీర్చడంతో పాటు అద్భుత పోషక విలువలను అందిస్తోంది. భారతదేశానికి క్యాలీఫ్లవర్‌ను బ్రిటిషువారు తీసుకొచ్చారు.

ఒకప్పటి యునైటెడ్‌ ప్రావిన్స్‌ (నేటి ఉత్తర్‌ ప్రదేశ్‌)లోని సహారన్‌పుర్‌లో తోటలు నిర్వహించే జెమ్‌సన్‌ అనే వృక్ష శాస్త్రవేత్త 1822లో క్యాలీఫ్లవర్‌ విత్తనాలను భారత్‌కు రప్పించారు. అదే ఏడాది వాటిని ఇక్కడి భూముల్లో విత్తారు. క్యాలీఫ్లవర్‌ అనేది క్యాలిస్, ఫ్లోస్‌ అనే లాటిన్‌ పదాల నుంచి వచ్చింది. క్యాలిస్‌ అంటే క్యాబేజీ అని, ఫ్లోస్‌ అంటే పువ్వు అని అర్థం.

క్యాలీఫ్లవర్‌ను బ్రిటిష్‌వారు భారత్‌లో ప్రవేశపెట్టడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. ఇలాంటి ‘ఆధునిక’ ఆహారాన్ని అందించి, దాన్ని అభివృద్ధికి చిహ్నంగా భారతీయులను నమ్మించడం. రెండు.. భారత్‌లో స్థిరపడ్డ బ్రిటిషువారికి స్వదేశంలోనే ఉన్నామన్న భావనను కలిగించడం.

విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 50వ పుట్టినరోజు వేడుకలో (1911) క్యాలీఫ్లవర్‌తో మిఠాయిని తయారు చేసి ‘కవి సంవర్ధన బర్ఫి’గా పేరు పెట్టారు. చేశారు.

2,300 ఏళ్ల కిందట ఆసియా, మధ్యధరా ప్రాంతంలో తొలుత క్యాలీఫ్లవర్‌ సాగైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. దీని మూలాలు సైప్రస్‌లో ఉండొచ్చని అంచనా. క్యాబేజీ పూర్వరూపం నుంచి ఇది వచ్చింది.


ఎగుమతుల్లో నాలుగో స్థానంలో విశాఖ పోర్టు

దేశంలో అత్యధిక ఎగుమతులు చేసిన నౌకాశ్రయాల్లో విశాఖపోర్టు 69.03 మిలియన్‌ టన్నుల సరకు రవాణాతో నాలుగో స్థానంలో నిలిచిందని విశాఖపట్నం నౌకాశ్రయ అథారిటీ ఛైర్మన్‌ కె.రామమోహనరావు పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 69.84 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో రవాణా పరిమాణం కొద్దిగా తగ్గిందన్నారు. అయినా ఇదీ రికార్డుగా నిలిచిందన్నారు. రాబోయేరోజుల్లో రవాణా పరిమాణం 5 మిలియన్‌ టన్నులు అదనంగా ఉంటుందని తెలిపారు.

పేదలకు బలవర్ధక బియ్యం పంపిణీకి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ కీలక నిర్ణయం పేదలకు పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్‌ రైస్‌) పంపిణీ చేయాలని నిర్ణయించింది. మొత్తం మూడు దశల్లో 2024 మార్చి కల్లా ఈ పథకాన్ని దేశమంతటికీ విస్తరించనున్నారు. ‣ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దిల్లీలో సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి ఏటా రూ.2,700 కోట్లు వ్యయమవుతాయని అంచనా. ఈ మొత్తాన్ని కేంద్ర సర్కారే భరించనుంది. తొలి దశలో భాగంగా ఐసీడీఎస్, పీఎం పోషణ్‌ పథకాలకు బలవర్ధక బియ్యం సరఫరా ఇప్పటికే ప్రారంభమైంది. రెండో దశలో ప్రజాపంపిణీ వ్యవస్థ, ఆకాంక్షిత జిల్లాలతోపాటు పిల్లలు తక్కువ బరువు-ఎత్తున్న 291 జిల్లాల్లో 2023 మార్చికల్లా ఈ బియ్యం సరఫరాను అమల్లోకి తెస్తారు. దేశవ్యాప్తంగా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ మూడో దశ కింద ఈ పథకాన్ని అమలుచేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ఇప్పటికే అమలుచేశారు.

పార్లమెంటు సమావేశాలు ప్రొరోగ్‌

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రొరోగ్‌ చేశారు. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు వేర్వేరు ప్రకటనల్లో ఈ విషయాన్ని వెల్లడించాయి. లోక్‌సభ సమావేశాలను ఏప్రిల్‌ 7న, రాజ్యసభ సమావేశాలను 8న ప్రొరోగ్‌ చేసినట్లు అందులో పేర్కొన్నాయి. జనవరి 31న ప్రారంభమైన ఈ సమావేశాలు షెడ్యూల్‌ కన్నా ఒకరోజు ముందుగా ముగిశాయి. ప్రొరోగ్‌ చేసిన తర్వాత పార్లమెంటు సమావేశాలను మళ్లీ ప్రారంభించాలంటే ప్రభుత్వం రాష్ట్రపతికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది.

యూఐడీఏఐ, ఇస్రో మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం

సాంకేతిక సహకారం కోసం యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ), మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎంఈఐటీవై) న్యూదిల్లీ, హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ, ఇస్రో) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సంస్థల సీఈవోలు, సీనియర్‌ అధికారుల సమక్షంలో యూఐడీఏఐ డీడీ జనరల్‌ శైలేంద్ర సింగ్‌ దిల్లీలో సంతకం చేశారు. దేశంలోని ఆధార్‌ కేంద్రాల సమాచారం, స్థానాలను అందించే భువన్‌-ఆధార్‌ పోర్టల్‌ను ఎన్‌ఆర్‌ఎస్సీ అభివృద్ధి చేయనుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా లొకేషన్ల వారీగా సంబంధిత ఆధార్‌ కేంద్రాలను శోధించే సదుపాయాన్ని పోర్టల్‌ అందిస్తుంది. చట్టబద్ధమైన తనిఖీలను నిర్వహించడం ద్వారా పౌర కేంద్రీకృత సేవలను మెరుగుపరచడానికి ఇప్పటికే ఉన్న, కొత్త నమోదు కేంద్రాలకు సంబంధించిన డేటాను సేకరించడానికి, నిల్వ చేయడానికి ఎన్‌ఆర్‌ఎస్సీ వెబ్‌ ఆధారిత పోర్టల్‌ను అందిస్తుంది. ఆన్‌లైన్‌ విజువలైజేషన్‌ సదుపాయంతోపాటు కేంద్రాల గురించి ప్రజలకు కచ్చితమైన సమాచారం నిర్ధారించడానికి సేకరించిన డేటాను ప్రాంతీయ స్థాయిలోని అధికారుల ద్వారా నాణ్యత కోసం మోడరేట్‌ చేస్తారు.

కల్వకుర్తి-సోమశిల మధ్య జాతీయ రహదారి

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య మరో అనుసంధాన మార్గం రానుంది. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ తాజాగా ఆమోద ముద్రవేసింది. ఇందులో భాగంగా తెలంగాణ పరిధిలో కల్వకుర్తి-నాగర్‌కర్నూల్‌-కొల్లాపూర్‌-రాంపూర్‌-సోమశిల వరకు 85 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరగనుంది. ‣ నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటే కృష్ణానదిని దాటక తప్పని పరిస్థితి. దీంతో పరీవాహక ప్రాంతాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు పడవల్లోనే రాకపోకలు సాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని సోమశిల వద్ద కృష్ణానదిపై వారధి నిర్మించేందుకు కేంద్రం ఇంతకుముందే ఆమోదం తెలిపింది. దీంతోపాటు తెలంగాణ నుంచి రాయలసీమలోని పలు ప్రాంతాలకు రవాణా సదుపాయం మెరుగయ్యేలా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు సుమారు 170 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పట్నుంచో ఉంది. ఈ ప్రతిపాదనకు కేంద్రం తాజాగా ఆమోదం తెలిపింది. భారత్‌మాల ప్రాజెక్టు కింద దీన్ని మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది. ఇందులో సోమశిల వరకూ 85 కిలోమీటర్ల మార్గాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంది. దానికి రూ.886 కోట్లు వ్యయమవుతుంది. అక్కణ్నుంచి (కృష్ణానది అవతల) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించనుంది.

ముగిసిన బడ్జెట్‌ సమావేశాలు

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు నిర్ణీత షెడ్యూలు కంటే ఒకరోజు ముందే ముగిశాయి. ఈ ఏడాది జనవరి 31న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 11న ముగిశాయి. రెండో విడతలో మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 7 వరకు ఉభయ సభలు కార్యకలాపాలు నిర్వహించాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్‌ 8వ తేదీ వరకు ఇవి కొనసాగాలి. బడ్జెట్‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో ఒకరోజు ముందే ముగిసాయి.

లోక్‌సభ ఉత్పాదకత 129శాతం

17వ లోక్‌సభకు చెందిన 8వ విడత సమావేశాల్లో 129శాతం ఉత్పాదకత నమోదైనట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఈ విడతలో మొత్తం 27 సార్లు సభ భేటీ అయ్యింది. ఆర్థిక బిల్లుతో సహా 12 బిల్లులను ఆమోదించింది.

రాజ్యసభ ఉత్పాదకత 99.8%

బడ్జెట్‌ సమావేశాల్లో రాజ్యసభ 99.8శాతం ఉత్పాదకతను సాధించింది. సభ్యుల ఆటంకాలు, బలవంతపు వాయిదాల వల్ల సభ దాదాపు 9.30 గం.ల సమయాన్ని కోల్పోయింది. షెడ్యూల్డ్‌ సిట్టింగ్‌ సమయం 127 గంటల 54 నిమిషాలు కాగా.. సభ 127 గంటల 44 నిమిషాలు పనిచేసింది. ఎగువసభ 11 బిల్లులను ఆమోదించింది.

గణనీయంగా తగ్గిన కాంగ్రెస్‌ ఆదాయం

కాంగ్రెస్‌ పార్టీ ఆదాయం 2020-21లో గణనీయంగా తగ్గింది. 2019-20లో రూ. 682.21 కోట్ల ఆదాయం సమకూరగా తర్వాతి సంవత్సరానికి అది రూ. 285.76 కోట్లకు తగ్గిపోయింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆడిట్‌ నివేదిక (2020-21)లో కాంగ్రెస్‌ ఆదాయ, వ్యయ వివరాలను తెలిపింది. వ్యయం కూడా గణనీయంగానే తగ్గినట్లు పేర్కొంది. 2019లో రూ. 998 కోట్లు ఖర్చు చేయగా.. తర్వాతి సంవత్సరానికి అది రూ. 209 కోట్లకు తగ్గినట్లు వెల్లడించింది. 2020-21లో ఏఐసీసీ సభ్యులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు; సానుభూతిపరుల నుంచి ఎలాంటి విరాళాలను తీసుకోలేదని కాంగ్రెస్‌ పేర్కొంది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా, కంపెనీ దాతలు, ఎలక్టోరల్‌ ట్రస్టుల నుంచి మాత్రం ఆదాయం పొందినట్లు తెలిపింది.

పాక్‌లో బందీలుగా 83 మంది భారత సైనికులు

పాకిస్థాన్‌లో 83 మంది భారత రక్షణ సిబ్బంది బందీలుగా ఉన్నారని, ఇందులో 62 మంది 1965, 71 యుద్ధఖైదీలని సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణ పత్రంలో కేంద్రం పేర్కొంది. వీరిని స్వదేశానికి రప్పించేందుకు దౌత్యమార్గాల్లో సకల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. పాక్‌ జైల్లో మగ్గుతున్న తన కుమారుడు కెప్టెన్‌ సంజిత్‌ భట్టాచార్జీని స్వదేశానికి రప్పించాలని కోరుతూ 81 ఏళ్ల కమ్లా భట్టాచార్జీ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానంగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

‘ది అన్‌టోల్డ్‌ కశ్మీర్‌ ఫైల్స్‌’ వీడియో విడుదల చేసిన కశ్మీర్‌ పోలీసులు

జమ్మూ-కశ్మీర్‌లోని హిందూ పండిట్లు 1990ల్లో పెద్ద ఎత్తున వలసలు వెళ్లిన నేపథ్యంతో తెరకెక్కిన ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ‘ది అన్‌టోల్డ్‌ కశ్మీర్‌ ఫైల్స్‌’ పేరుతో జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు ఓ లఘు చిత్రాన్ని రూపొందించారు. జమ్మూ-కశ్మీర్‌లో మతాలతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడూ ఉగ్రవాద కార్యకలాపాలకు బాధితులుగా మారారని అందులో పేర్కొన్నారు. 57 సెకన్ల ఈ వీడియోలో కశ్మీర్‌లో చోటుచేసుకున్న పలు ఉగ్రదాడులకు సంబంధించిన దృశ్యాలను పొందుపరిచారు. ప్రముఖ కవి ఫయజ్‌ అహ్మద్‌ ఫయజ్‌ రాసిన ‘హమ్‌ దేఖేంగే’ కవితను నేపథ్యంలో వినిపించారు. ఈ ప్రసిద్ధ కవితను ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంలోనూ వినియోగించారు. ‘‘లక్షిత దాడుల కారణంగా 20 వేల మంది కశ్మీరీలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి వ్యతిరేకంగా గళమెత్తాల్సిన సమయం వచ్చింది’’ అని వీడియోలో పేర్కొన్నారు.

30% పెరిగిన మత్స్య ఎగుమతులు

దేశం నుంచి మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. గత ఆర్థిక సంవత్సరంలో 30% వృద్ధి నమోదైందని మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(ఎంపెడా) వెల్లడించింది. 7,740 మిలియన్‌ డాలర్ల మత్స్య ఉత్పత్తులను 121 దేశాలకు ఎగుమతి చేసినట్లు వివరించింది.భారత్‌ నుంచి మత్స్య ఉత్పత్తుల దిగుమతుల్లో అమెరికా, చైనా, జపాన్‌ తొలి మూడుస్థానాల్లో నిలిచాయి. విలువ పరంగా చూస్తే మొత్తం ఎగుమతుల్లో ఈ మూడు దేశాల వాటా 63% ఉంది. అమెరికాకు అత్యధికంగా 3,315 మిలియన్‌ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేశారు. గతంతో పోలిస్తే ఎగుమతుల్లో అమెరికాకు 33%, చైనాకు 29% వృద్ధి నమోదైనట్లు ఎంపెడా తెలిపింది.

హైకోర్టులో పెరిగిన కేసుల పరిష్కార వేగం

కొవిడ్‌ తర్వాత హైకోర్టుల్లో కేసుల పరిష్కార వేగం పెరగ్గా, జిల్లాస్థాయి కోర్టుల్లో తగ్గింది. రాజ్యసభలో భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజూ ఇచ్చిన సమాధానం మేరకు.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 2019లో దాఖలైన కేసుల సంఖ్యతో పోలిస్తే పరిష్కరించిన కేసులు 49.48% ఉండగా, 2020లో 68.62%, 2021లో 63.21%కి చేరింది. తెలంగాణ హైకోర్టులో 2019లో 65.08% కేసులు పరిష్కరించగా 2020లో ఆ సంఖ్య 57.69%కి తగ్గింది. 2021లో 70.04%కి పెరిగింది. జిల్లాస్థాయి కోర్టుల్లో మాత్రం ఇది తిరోగమనంలో ఉంది. ‣ ఆంధ్రప్రదేశ్‌ కోర్టుల్లో 2019లో 92.62% కేసులు పరిష్కరించగా, 2020లో 67.07%, 2021లో 64.18%కి తగ్గిపోయాయి. తెలంగాణలోని కిందిస్థాయి కోర్టుల్లో 2019లో 87% కేసులు పరిష్కారం కాగా, 2020లో 54.30%, 2021లో 78.85% మేర అయ్యాయి.

22 యూట్యూబ్‌ వార్తా ఛానళ్లపై నిషేధం

బూటకపు వార్తల వ్యాప్తికి పాల్పడుతున్న 22 యూట్యూబ్‌ వార్తా ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. విదేశాలతో భారత సంబంధాలు, ప్రజా భద్రతపై అవి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది. నిషేధానికి గురైనవాటిలో 18 మన దేశం కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నవి కాగా, మరో 4 పాకిస్థాన్‌కు చెందిన ఛానళ్లు ఉన్నాయి. ‣ వీటితో పాటు మూడు ట్విటర్‌ ఖాతాలు, ఓ ఫేస్‌బుక్‌ ఖాతా, ఓ వార్తా వెబ్‌సైట్‌ను కూడా నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఫిబ్రవరిలో ఐటీ నిబంధనలు జారీ అయిన తర్వాత యూట్యూబ్‌ వేదికగా నడుస్తున్న భారతీయ వార్తా ఛానళ్లపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి. దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత్వానికి ముప్పుగా మారుతున్నాయంటూ గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు మొత్తంగా 78 యూట్యూబ్‌ వార్తాఛానళ్లు, పలు ఇతర సామాజిక మాధ్యమ ఖాతాలపై కేంద్రం నిషేధాజ్ఞలు విధించింది.

అప్పులున్న డిస్కంలలో 3వ స్థానంలో ఏపీఎస్పీడీసీఎల్‌

దేశంలో అత్యధిక అప్పులున్న టాప్‌-10 డిస్కంలలో ఏపీఎస్పీడీసీఎల్‌ మూడో స్థానంలో నిలిచింది. 2020 మార్చి 31 నాటికి దీని అప్పులు రూ.20,436 కోట్లకు చేరినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు. 2019 మార్చి 31 నాటికి అప్పులు రూ.13,601 కోట్లు ఉండగా, ఆ తర్వాత రూ.6,835 కోట్లు కొత్తగా తీసుకున్నట్లు వెల్లడించారు. 2021 ఫిబ్రవరి 28 నాటికి ఏపీ డిస్కంలు విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు రూ.7,538 కోట్ల బకాయిలు పడ్డట్లు తెలిపారు.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

నేరాలకు పాల్పడిన వ్యక్తులను సత్వరమే గుర్తించేందుకు, దర్యాప్తును వేగిరం చేసే లక్ష్యంతో అనుమానితుల, నేరగాళ్ల కొలతలు, బయోమెట్రిక్‌ నమూనాలను సేకరించేందుకు పోలీసులకు, జైలు వార్డన్లకు అధికారం కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఐడెంటిఫికేషన్‌) బిల్లును 1920నాటి ఖైదీల గుర్తింపు చట్టం స్థానంలో తీసుకువస్తున్నారు. బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించటానికి ముందు జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానమిచ్చారు. విపక్ష సభ్యులు వ్యక్తం చేసిన భయాందోళనలను తోసిపుచ్చారు. శాంతిభద్రతలు, అంతర్గత భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతోనే క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఐడెంటిఫికేషన్‌) బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు.

అకౌంటెన్సీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

చార్టర్డ్‌ అకౌంటెంట్స్, కాస్ట్‌ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్‌కు చెందిన సంస్థల్లో సంస్కరణలకు ఉద్దేశించిన సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. తాజాగా ప్రతిపాదించిన మార్పులు ఆ మూడు సంస్థల స్వయంప్రతిపత్తికి ఎలాంటి విఘాతం కలిగించబోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ హామీ ఇచ్చారు. ఈ బిల్లులోని కొన్ని అంశాలపై విపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఈ బిల్లును మార్చి 30న ఆమోదించింది. దీంతో అకౌంటెన్సీ బిల్లుకు పార్లమెంటులోని ఉభయ సభల సమ్మతి లభించినట్లయ్యింది.

ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ), ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (గతంలో ఐసీడబ్ల్యూఏఐ), ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ)లలోని క్రమశిక్షణ సంఘాలకు ఆయా వృత్త్యేతరులైన వ్యక్తులు ప్రిసైడింగ్‌ అధికారులుగా బాధ్యతలు చేపట్టేందుకు సవరణ బిల్లు అవకాశం కల్పిస్తుంది. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన కార్యదర్శి స్థాయి అధికారి అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటును బిల్లు ప్రతిపాదించింది. మూడు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ చట్టం - 1949, కాస్ట్‌ అండ్‌ వర్క్స్‌ అకౌంటెంట్స్‌ చట్టం - 1959, కంపెనీ సెక్రటరీస్‌ చట్టం - 1980లకు సవరణలు జరగనున్నాయి.



సామూహిక జన హనన ఆయుధాలు, వాటి ప్రయోగ వ్యవస్థలు (చట్టవ్యతిరేక కార్యకలాపాల నిషేధ) సవరణ బిల్లును విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సామూహిక జన హనన ఆయుధాల (డబ్ల్యూఎండీ) తయారీకి ఆర్థిక సహాయాన్ని అడ్డుకోవడంతో పాటు అటువంటి కార్యకలాపాలకు తోడ్పడే వ్యక్తుల ఆస్తులను, ఆర్థిక వనరులను జప్తు చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు కల్పిస్తుంది. అంతర్జాతీయ కర్తవ్యాలను నిర్వర్తించే చర్యల్లో భాగంగా ఈ బిల్లును తీసుకురావాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. 2005లోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ సామూహిక జన హనన ఆయుధాల తయారీని మాత్రమే అది నిషేధించింది. ఈ చట్టం కింద నిషేధించిన కార్యకలాపాలకు ఏ వ్యక్తి నిధులు అందజేయరాదని, ఆర్థిక తోడ్పాటునందించే చర్యల్లో భాగస్వామికారాదని పేర్కొంటూ అదనంగా సెక్షన్‌ 12(ఏ)ను చేర్చేందుకు బిల్లులో ప్రతిపాదించారు.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ బిల్లుకు ఆమోదం

పార్లమెంటు క్రిమినల్‌ ప్రొసీజర్‌ (గుర్తింపు) బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. రాజకీయ ఖైదీల బయోమెట్రిక్‌ వివరాలు సేకరించబోమని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రతిపాదిత చట్టం నుంచి బ్రెయిన్‌ మ్యాపింగ్, పాలీగ్రాఫ్‌ పరీక్షలను మినహాయిస్తున్నట్లు తెలిపారు.

ఆయుధాలకు ఆర్థిక తోడ్పాటుపై సవరణ బిల్లు

సామూహిక విధ్వంసకర ఆయుధాలకు నిధులు సమకూర్చడంపై నిషేధం విధించడంతో పాటు ఇలాంటి కేసుల్లో ఆయా వ్యక్తుల ఆస్తులు, ఆర్థిక వనరులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అనుమతించే సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. బిల్లును అందరూ స్వాగతించడంతో సభ మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపింది. జాతీయ భద్రతను, ప్రపంచ దేశాల్లో మన స్థానాన్ని ఇది సుస్థిరం చేస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వ్యాఖ్యానించారు.

జన్యు కూర్పు మొక్కలు, విత్తనాలకు అనుమతి

వ్యవసాయ రంగంలో కీలక మార్పులకు నాంది పలికే జన్యుకూర్పు (జీనోమ్‌ ఎడిటింగ్‌) విత్తనాలు, మొక్కల వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపింది. వాటిపై ఆంక్షలు ఎత్తివేస్తూ కేంద్ర పర్యావరణశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఇంతకాలం జన్యుమార్పిడి (జీఎం) విత్తనాల మాదిరిగానే జన్యుకూర్పు విత్తనాల విడుదలకూ కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనే ఆంక్షలున్నాయి. జన్యుకూర్పు పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసే విత్తనాల్లో జన్యుమార్పిడిలో మాదిరిగా హానికారకాలు గానీ, పరాయి జన్యువులు గానీ ఉండవని, వినియోగానికి అనుమతించాలని కేంద్ర వ్యవసాయ, బయోటెక్నాలజీ శాఖల సిఫార్సు మేరకు ఈ ఉత్తర్వులిస్తున్నట్లు తెలిపింది. జీనోమ్‌ ఎడిటింగ్‌ ద్వారా ఉత్పత్తి చేసిన విత్తనాలు లేదా మొక్కల నారును కొత్త వంగడాలుగా విడుదల చేయాలని స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయం దేశ వ్యవసాయ రంగానికి మేలు చేస్తుందని, అధిక దిగుబడినిచ్చే వంగడాల విడుదలకు కొత్తబాటలు వేస్తుందని భారత జాతీయ ప్రైవేటు విత్తన సంఘం ఛైర్మన్‌ ఎం.ప్రభాకరరావు తెలిపారు. జన్యుకూర్పు అంటే.. పంటల వంగడాలు, మొక్కల్లో అనేక రకాల జన్యువులుంటాయి. వీటిలో దిగుబడి పెరగడానికి, పోషక విలువలు పెంచడానికి అవసరమైన జన్యువులను కూర్చి, మిగతా వాటిని తగ్గించడం లేదా తొలగించడం ద్వారా కొత్త వంగడాలను సృష్టిస్తారు. తద్వారా దేశ ఆహార భద్రత మెరుగవడంతో పాటు ప్రజలకు పోషకాలతో కూడిన ఆహారం లభిస్తుంది. రైతులకూ అధిక ఆదాయం వస్తుంది. ఇప్పటికే పలు దేశాల్లో జన్యుకూర్పు పరిజ్ఞానంతో విత్తనాలు విడుదల చేశారు.

770 కి.మీ. రైల్వే లైన్ల విద్యుదీకరణ

డీజిల్‌ ఇంజిన్లతో ఇంధన వ్యయాన్ని, కాలుష్య సమస్యను తగ్గించేందుకు ‘మిషన్‌ ఎలక్ట్రిఫికేషన్‌’కు ప్రాధాన్యం ఇస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఆల్‌టైం రికార్డు సృష్టించింది. 2021 - 22లో 770 రూట్‌ కిలోమీటర్ల మార్గాన్ని విద్యుదీకరించింది. ఇందులో జోన్‌ పరిధిలోని తెలంగాణలో 326 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌లో 331, మహారాష్ట్రలో 86.5, కర్ణాటకలో 26.5 కి.మీ. మార్గాలున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలో అత్యధిక విద్యుదీకరణ చేసిన జోన్‌గా నిలిచినట్లు ద.మ. రైల్వే ప్రకటించింది.

తెలంగాణలో: ఉందానగర్‌ (శంషాబాద్‌) - మహబూబ్‌నగర్‌ 85.60 కి.మీ., గద్వాల - రాయచూర్‌ 57.70, మోర్తాడ్‌ - నిజామాబాద్‌ 45.10, నిజామాబాద్‌ - బోధన్‌ 25.85, భద్రాచలం రోడ్‌ - భవన్నపాలెం 37.90, పింపల్‌కుట్టి - కోసాయి 40.13, కోహిర్‌దక్కన్‌ - ఖానాపూర్‌ 33.72 కి.మీ.

ఆంధ్రప్రదేశ్‌లో: ఆరవల్లి - భీమవరం - నర్సాపూర్‌ 45.53 కి.మీ., కదిరి - తుమ్మనంగుట్ట 53.30, పాకాల - కలికిరి మధ్య 55.65, డోన్‌ - కర్నూలు మధ్య 54.20, ఎర్రగుంట్ల - నంద్యాల మధ్య 122.32 కి.మీ.



పీఎల్‌ఐ కింద స్థానిక ఫార్మా కంపెనీలకు అనుమతులు

మందుల ఎగుమతిలో మనదేశం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఆ మందులు ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి ఔషధాల కోసం చైనాపై ఆధారపడుతుంది. మందుల ఉత్పత్తిలో ఉపయోగించే ఎన్నో రకాలైన ముడి ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌), సాల్వెంట్స్‌ను దేశీయ కంపెనీలు చైనా నుంచి తెచ్చుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత ఏడాదిలో ఆవిష్కరించిన పీఎల్‌ఐ పథకం (ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌) తో కొంతవరకూ ఈ పరిస్థితిలో మార్పు రానున్నట్లు స్థానిక ఫార్మా వర్గాలు పేర్కొంటున్నాయి. పీఎల్‌ఐ పథకం కింద తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు ఫార్మా కంపెనీలకు అనుమతులు లభించాయి. ఇందులో అగ్రశ్రేణి ఫార్మా కంపెనీలైన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా తో పాటు ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్, నాట్కో ఫార్మా, బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్, సాయి లైఫ్‌సైన్సెస్, బయోఫోర్‌ ఇండియా, శ్రీకృష్ణ ఫార్మా, ఆప్టిమస్‌ ఫార్మా, కాంకార్డ్‌ బయోటెక్, సైమెడ్‌ ల్యాబ్స్, మల్లాది డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్‌ ... తదితర కంపెనీలు ఉన్నాయి. తద్వారా ముడి ఔషధాల లభ్యతను పెంపొందించటంలో ఈ కంపెనీలు క్రియాశీలకమైన పాత్ర పోషించనున్నట్లు స్పష్టమవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి 115, తెలంగాణ నుంచి 66 కిసాన్‌రైళ్లు

కిసాన్‌ రైళ్లు మొదలుపెట్టిన 2020 ఆగస్టు 7 నుంచి ఈ ఏడాది మార్చి 22 వరకు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల నుంచి 2,190 కిసాన్‌ రైళ్లు నడిచినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 115, తెలంగాణ నుంచి 66 రైళ్లు నడిచినట్లు వెల్లడించారు. మహారాష్ట్రనుంచి అత్యధికంగా 1,708 రైళ్లు (78%) నడిచినట్లు తెలిపారు. దాని తర్వాత అత్యధిక రైళ్లు (5.25%) ఏపీనుంచే నడిచినట్లు వెల్లడించారు.