అంతర్జాతీయం



ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా మెక్రాన్‌ రెండోసారి గెలుపు

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ రెండోసారి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. తుది విడత పోలింగ్‌లో ఆయన విపక్ష నేషనల్‌ ర్యాలీ పార్టీ అభ్యర్థి మరీన్‌ లీ పెన్‌పై సునాయాసంగా నెగ్గారు. దీంతో ఫ్రాన్స్‌లో 2002 తర్వాత వరుసగా రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తొలి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ఈ దఫా ఓటింగ్‌ 72 శాతం మించలేదు. 1969 తర్వాత ఇదే అత్యంత తక్కువ ఓటింగ్‌ శాతం. అనేక మంది ఖాళీ ఓట్లు వేశారు. మెక్రాన్‌కు 58.55 శాతం ఓట్లు లభించాయి. ఫలితాలు వెలువడక ముందే లీ పెన్‌ ఓటమిని అంగీకరించారు.

భారత్‌-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం

భారత, ఆస్ట్రేలియాల మధ్య ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) కుదిరింది. దీంతో భారత్‌కు చెందిన జౌళి, తోలు, ఫర్నిచరు, ఆభరణాలు, మెషినరీ వంటి 6,000కు పైగా వస్తువులకు డ్యూటీ-ఫ్రీ సదుపాయాన్ని ఆస్ట్రేలియా అందించనుంది. ఈ ఒప్పందం 4 నెలల్లోగా అమలు అవుతుందని అంచనా. వర్చువల్‌ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ల సమక్షంలో ఈ ఒప్పందంపై భారత వాణిజ్య మంత్రి, పీయూశ్‌ గోయల్, ఆస్ట్రేలియా వాణిజ్య, పర్యాటక, పెట్టుబడుల మంత్రి డాన్‌ టెహాన్‌లు సంతకాలు చేశారు. తాజా ఒప్పందం వల్ల వచ్చే అయిదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతమున్న 27.5 బిలియన్‌ డాలర్ల నుంచి 45-50 బి.డాలర్లకు చేరుతుందని గోయల్‌ పేర్కొన్నారు. రానున్న 5-7 ఏళ్లలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు రావొచ్చని తెలిపారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన రోజు నుంచే ఎగుమతుల్లో 96.4%(విలువపరంగా) వస్తువులకు సున్నా సుంకం(డ్యూటీ ఫ్రీ)ను అందజేస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చాలా వరకు భారత వస్తువులపై 4-5% సుంకం వర్తిస్తోంది. ఆస్ట్రేలియా నుంచి దిగుమతి అయ్యే వాటిలో 85% వరకు వస్తువులకు సున్నా సుంకాన్ని(జీరో డ్యూటీ యాక్సెస్‌) భారత్‌ అమలు చేస్తుంది. బొగ్గు, ఉన్ని, ఎల్‌ఎన్‌జీ, అల్యూమినియం, మాంగనీసు, కాపర్, టైటానియం, జిర్కోనియం వంటివి ఇందులో ఉంటాయి. ఆస్ట్రేలియా నుంచి ఎక్కువగా ముడి పదార్థాలు, ఇంటర్మీడియటరీలను మన పరిశ్రమలు దిగుమతి చేసుకుంటాయి. చౌక ముడి పదార్థాలు పొందడం ద్వారా ఉక్కు, అల్యూమినియం, ఫ్యాబ్రిక్‌/గార్మెంట్ల వంటి రంగాలు మరింత పోటీతత్వాన్ని పెంచుకోవడానికి వీలవుతుంది. అయితే కొన్ని సున్నిత రంగాలను కాపాడుకోవడం కోసం పాలు, పాల ఉత్పత్తులు, బొమ్మలు, ప్లాటినం, గోధుమ, బియ్యం, బంగారం, వెండి, ఆభరణాలు, వైద్య పరికరాలు, ముడి ఇనుము వంటి వాటి సుంకం విషయంలో భారత్‌ ఎటువంటి మినహాయింపులను ఇవ్వడం లేదు.

పాక్‌ జాతీయ అసెంబ్లీ రద్దు

పాకిస్థాన్‌ రాజకీయాలు మరో నాటకీయ మలుపు తీసుకున్నాయి. ‘అవిశ్వాసం’ ఆటలో ఆఖరి బంతి వరకూ పోరాడతానంటూ ఇన్నాళ్లూ చెప్పుకొంటూ వచ్చిన ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ అందుకు తగ్గట్టే ప్రతిపక్షాలకు షాకిచ్చారు. ఇన్‌స్వింగింగ్‌ యార్కర్‌తో వాటిని తీవ్ర ఇరకాటంలోకి నెట్టారు. ఇమ్రాన్‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జాతీయ అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉంది. అయితే రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించారు. ఆ వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ దేశాధ్యక్షుడికి ఇమ్రాన్‌ సిఫార్సు చేయడం, దానికి అధ్యక్షుడు ఆమోదముద్ర వేశారు. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. డిప్యూటీ స్పీకర్‌ నిర్ణయం, ప్రధాని సిఫార్సుకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశాయి. తాజా పరిణామాలపై అప్పటికే సుమోటోగా విచారణ ప్రారంభించిన సర్వోన్నత న్యాయస్థానం.. జాతీయ అసెంబ్లీ రద్దుకు సంబంధించి అధ్యక్షుడు, ప్రధానమంత్రి చేపట్టిన చర్యలు కోర్టు పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఈ వ్యవహారంపై ఏప్రిల్‌ 4న కీలక విచారణ జరగనుంది. ఇమ్రాన్‌కు అనుకూలంగా తీర్పు వెలువడితే పాక్‌లో 90 రోజుల్లోగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం 69 ఏళ్ల ఇమ్రాన్‌ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగనున్నారు. పాక్‌లో ఇప్పటివరకు ఒక్క ప్రధాని కూడా ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేసుకోకపోవడం గమనార్హం.

పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం

పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించడంపై ఆగ్రహించిన విపక్షాలు సొంతంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాయి. ఆ తీర్మానాన్ని తమకు తాముగా ఆమోదించాయి. మరోవైపు జాతీయ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రధానమంత్రి నియామకం దిశగా దేశాధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ చర్యలకు పూనుకున్నారు. ఆ పదవికి పేర్లను సూచించాల్సిందిగా ఇమ్రాన్, ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్‌ షరీఫ్‌లకు లేఖ రాశారు. స్పందించిన ఇమ్రాన్‌.. పాక్‌ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌ పేరును ప్రతిపాదించారు. 197 ఓట్లతో అవిశ్వాస తీర్మానానికి ఆమోదం ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్‌ ఖాసిమ్‌ సూరి అనూహ్యంగా తిరస్కరించిన అనంతరం జాతీయ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్‌పై విపక్ష నాయకుడు షెహబాజ్‌ షరీఫ్‌ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అధికార తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ)కి చెందిన 22 మంది తిరుగుబాటు సభ్యులు, పీటీఐకి ఇన్నాళ్లూ మిత్రపక్షాలుగా ఉన్న కొన్ని పార్టీల నాయకులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. 197 ఓట్లతో తీర్మానం ఆమోదం పొందినట్లు అయాజ్‌ సాదిక్‌ ప్రకటించారు. ఎవరీ జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌? స్వపక్ష నేతలతో సమాలోచనల అనంతరం ఆపద్ధర్మ ప్రధాని పదవికి ఇమ్రాన్‌ ఖాన్‌ పాక్‌ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌ పేరును నామినేట్‌ చేశారు. జస్టిస్‌ గుల్జార్‌ 1957లో జన్మించారు. 2019 డిసెంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పాక్‌ ప్రధాన న్యాయమూర్తి (సీజేపీ)గా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌పై అనర్హత వేటు పడ్డ పనామా పేపర్ల కేసుపై విచారణ చేపట్టిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఆయన ఒకరు. పలు కీలక కేసుల్లో ప్రభుత్వాలు, అధికారులకు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

99% మంది పీల్చేది కలుషిత గాలే: డబ్ల్యూహెచ్‌వో

పుడమిపై కాలుష్య భూతం కోరలు చాస్తున్న తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా కళ్లకు కట్టింది. ప్రపంచ జనాభాలో 99% మంది.. కలుషిత గాలినే పీల్చుకుంటున్నారన్న కఠిన వాస్తవాన్ని బయటపెట్టింది. అధిక స్థాయిలో కాలుష్య కారకాల విడుదలకు కారణమవుతున్న శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు, ప్రాంతాలు, గ్రామాల్లో గాలి నాణ్యతకు సంబంధించి తమ డేటాబేస్‌ను డబ్ల్యూహెచ్‌వో అప్‌డేట్‌ చేసింది. ఇందులో 6 వేలకుపైగా మున్సిపాలిటీల వివరాలు అందుబాటులో ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ‣ ప్రపంచ జనాభాలో 99% మంది.. నాణ్యత ప్రమాణాలకు దూరంగా ఉన్న గాలిని పీల్చుకుంటున్నారు. ‣ ఆ కలుషిత గాలిలోని కణాలు ఊపిరితిత్తులు, రక్తనాళాల్లోకి ప్రవేశించి అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. ‣ ప్రధానంగా తూర్పు మధ్యధరా ప్రాంతం, ఆగ్నేయాసియాల్లో వాయు నాణ్యత దారుణంగా ఉంది. వాటి తర్వాతి స్థానంలో ఆఫ్రికా ఉంది. ‣ గాలి కాలుష్యం ఏటా దాదాపు 70 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. అవన్నీ నివారింపదగినవే. ‣ పీఎం 2.5, పీఎం 10 ధూళికణాలతో పాటు మరో కీలక కాలుష్య కారకమైన నైట్రోజన్‌ డయాక్సైడ్‌ విస్తృతి వివరాలను తాజాగా డేటాబేస్‌లో తొలిసారిగా పొందుపరిచారు.

చైనాలో తొలిసారిగా డ్రైవర్‌రహిత ట్యాక్సీకి అనుమతి

డ్రైవర్‌రహిత ట్యాక్సీ సేవలు అందించేందుకు చైనాలో రెండు కంపెనీలకు పర్మిట్లు జారీ అయ్యాయి. ఇంటర్నెట్‌ సేవల కంపెనీ బైడు, స్వయంప్రతిపత్తి కార్ల సంస్థ పోనీ.ఏఐకి ఇవి మంజూరయ్యాయి. దీని కింద ఈ సంస్థలు బీజింగ్‌లో ప్రజలకు ఈ తరహా ట్యాక్సీ సేవలను అందించొచ్చు. అత్యవసర సమయంలో చోదన బాధ్యతలు చేపట్టేందుకు ఒక ‘సేఫ్టీ డ్రైవర్‌’ను స్టీరింగ్‌ వద్ద ఉంచాల్సిన అవసరం ఉండదు. అయితే వాహనంలోని ముందు వరుసలో ప్యాసింజర్‌ సీట్లో భద్రతా పర్యవేక్షకుడు ఉండాలి.

పాక్‌ విదేశాంగ మంత్రిగా బేనజీర్‌ భుట్టో తనయుడు

పాకిస్థాన్‌ దివంగత ప్రధానమంత్రి బేనజీర్‌ భుట్టో తనయుడు బిలావల్‌ భుట్టో జర్దారీ ఆ దేశ విదేశాంగ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానంలో ఓడించి నూతనంగా పగ్గాలు చేపట్టిన సంకీర్ణ ప్రభుత్వంలో బిలావల్‌ ఛైర్మన్‌గా ఉన్న పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) రెండో అతి పెద్ద పార్టీ. తొలిసారి 2018లో పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన బిలావల్‌కు ఇదే తొలి కీలక పదవి.

కమలా హారిస్, జుకెర్‌బర్గ్‌లపై రష్యా నిషేధం

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఫేస్‌బుక్‌ అధిపతి మార్క్‌ జుకెర్‌బర్గ్, మరికొందరు అమెరికా ప్రముఖులపై ప్రయాణపరమైన నిషేధాన్ని విధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. అమెరికాకు చెందిన 29 మంది, కెనడాకు చెందిన 61 మందిపై ఈ నిషేధం నిరవధికంగా కొనసాగుతుందని తెలిపింది.

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో వలసలు 83 లక్షలు

యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి మొత్తంగా 83 లక్షల మంది శరణార్థులుగా దేశం విడిచి వెళ్లిపోవచ్చని ఐక్యరాజ్య సమితి (ఐరాస) అంచనా వేసింది. వారికి సహాయార్థం నిధులను అందించాలని ఐరాస శరణార్థుల సంస్థ కోరింది. ఈ మేరకు నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఉక్రెయిన్‌ నుంచి హంగరీ, మాల్దోవా, పోలండ్, రొమేనియా, స్లోవేకియా, బెలారస్, బల్గేరియా, చెక్‌ రిపబ్లిక్‌లకు వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో వారికి సాయం అందించేందుకు ప్రణాళికను రూపొందించింది. ఇంతవరకు 52 లక్షల మంది శరణార్థులుగా వెళ్లిపోయినట్లు తెలిపింది. ఐరాస అంచనాల మేరకు రష్యా యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లోనే ఒక ప్రాంతం నుంచి మరో చోటుకి 80 లక్షల మంది వలసపోగా, మరో కోటీ 30 లక్షల మంది యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నారు. యుద్ధానికి ముందు ఉక్రెయిన్‌లో 4.4 కోట్ల జనాభా ఉండేది.

ఉత్తర కొరియా సైన్యం 90వ వార్షికోత్సవంలో కిమ్‌

అమెరికాతో పాటు అగ్రరాజ్య మిత్రపక్షాలకు ఉత్తర కొరియా అధినేత కిమ్‌ మరోసారి హెచ్చరికలు చేశారు. తమను రెచ్చగొడితే అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. ఉత్తర కొరియా సైన్యం 90వ వార్షికోత్సవం సందర్భంగా ప్యాంగ్యాంగ్‌లో నిర్వహించిన భారీ కవాతులో కిమ్‌ మాట్లాడారు. పలు అధునాతన ఆయుధాలను ప్రదర్శించారు.

16 ఏళ్ల లోపు పిల్లల్లో అంతుచిక్కని కాలేయ వ్యాధి: డబ్ల్యూహెచ్‌వో

అమెరికాతో పాటు పలు ఐరోపా దేశాల్లో పిల్లలకు అంతుచిక్కని కాలేయ వ్యాధి సోకుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ వ్యాధితో ఓ చిన్నారి కూడా మృతి చెందినట్లు వెల్లడించింది. 12 దేశాల్లో ఇంతవరకు ఇలాంటి 169 కేసులు బయటపడినట్లు పేర్కొంది. ప్రధానంగా బ్రిటన్‌లో ఎక్కువ కేసులు నమోదైనట్లు తెలిపింది. దీన్ని ‘అంతుచిక్కని మూలాలతో వచ్చే అతి తీవ్ర హెపటైటిస్‌’గా పేర్కొంది. వ్యాధి బారిన పడినవారంతా ఒక నెల నుంచి 16 ఏళ్ల వయసువారేనని తెలిపింది. వీరిలో 17 మందికి కాలేయ మార్పిడి అవసరమైనట్లు పేర్కొంది. బ్రిటన్‌లో తొలిసారి ఇలాంటి కేసులు నమోదు కాగా అక్కడ 114 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు.

ఆన్‌లైన్‌ దిగ్గజ సంస్థలను నియంత్రిస్తూ ఐరోపా సమాఖ్య చట్టం

ఆన్‌లైన్‌లో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, తప్పుడు సమాచారం, హానికరమైన అంశాల వ్యాప్తిని అరికట్టడానికి డిజిటల్‌ సేవల చట్టం (డీఎస్‌ఏ) తీసుకురావాలని ఐరోపా సమాఖ్య (ఈయూ)లోని 27 దేశాలు చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. యూరోపియన్‌ పార్లమెంటు, ఈయూ సభ్యదేశాలు లాంఛనంగా ఆమోద ముద్ర వేసిన వెంటనే ఈ చట్టం అమలులోకి వస్తుంది. దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు తమకు తాము స్వీయ నియంత్రణ విధించుకునేట్లు ఈ చట్టం ఒత్తిడి తెస్తుంది. వినియోగదారులు ఆన్‌లైన్‌ సమాచారంపై ఫిర్యాదులు చేసి పరిష్కారం పొందడానికి వీలు కల్పిస్తుంది. నిబంధనలను అతిక్రమించే టెక్‌ కంపెనీలపై వందల కోట్ల జరిమానాలు విధిస్తుంది. తాము తీసుకొస్తున్న డిజిటల్‌ సేవల చట్టం బడా టెక్‌ కంపెనీల ఇష్టారాజ్యానికి చరమాంకం పలుకుతుందని ఈయూ అంతర్గత మార్కెట్‌ కమిషనర్‌ థియెరీ బ్రెటన్‌ అన్నారు. తమ నిబంధనలను ఉల్లంఘించే టెక్‌ కంపెనీల అంతర్జాతీయ టర్నోవరులో 6 శాతం వరకు జరిమానా విధించడానికి కొత్త చట్టం వీలు కల్పిస్తుందని ఆయన వెల్లడించారు. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే యావత్‌ ఈయూ దేశాల్లో టెక్‌ కంపెనీల కార్యకలాపాలను నిషేధించడానికీ వీలు కల్పిస్తుందని వివరించారు.

అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థ రద్దు!

శ్రీలంకలో అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థకు చరమగీతం పాడాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమగీ జన బలవేగయ (ఎస్‌జేబీ) ప్రతిపాదించింది. దాని స్థానంలో ప్రజాస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. 1978 నుంచి అమల్లో ఉన్న కార్యనిర్వాహక అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థ రద్దు కోరుతూ 21 రాజ్యాంగ సవరణ ముసాయిదా బిల్లును స్పీకర్‌కు తాము సమర్పించినట్లు ఎస్‌జేబీ నేత సాజిత్‌ ప్రేమదాస పార్లమెంటులో వెల్లడించారు. ఆ బిల్లు ఆమోదం పొందితే అధ్యక్షుడు దేశాధినేతగా, కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా కొనసాగుతారు.

నాటోలో చేరవద్దని స్వీడన్, ఫిన్లాండ్‌లను హెచ్చరించిన రష్యా

ఉక్రెయిన్‌పై సైనిక చర్య క్రమంలోనే నాటోలో చేరవద్దని స్వీడన్, ఫిన్లాండ్‌లను రష్యా హెచ్చరించింది. బహిరంగంగా, దౌత్య మార్గాల ద్వారా ఆ రెండు దేశాలను హెచ్చరించినట్టు రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా వెల్లడించారు.

రష్యాకు ఎంఎఫ్‌ఎన్‌ హోదాను రద్దు చేసిన జపాన్‌

తమతో వాణిజ్యం పరంగా రష్యాకు ఉన్న ‘అత్యంత ప్రాధాన్య దేశం’ (ఎంఎఫ్‌ఎన్‌) హోదాను జపాన్‌ పార్లమెంటు లాంఛనంగా రద్దు చేసింది. ఉక్రెయిన్‌ దురాక్రమణకు రష్యా ప్రయత్నిస్తుండడాన్ని నిరసిస్తూ విధిస్తున్న ఆంక్షల్లో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు ప్రకటించింది. రష్యాకు చెందిన ఎనిమిది మంది దౌత్య, వాణిజ్య అధికారుల్ని జపాన్‌ మార్చిలోనే బహిష్కరించింది. తాజాగా ఎంఎఫ్‌ఎన్‌ రద్దుతో రష్యా నుంచి జపాన్‌కు జరిగే దిగుమతుల ధరవరలపై ప్రభావం పడనుంది. విదేశీ మారకద్రవ్య చట్ట నిబంధనల్ని కూడా పార్లమెంటు సవరించింది. రష్యాతో కొత్తగా పెట్టుబడుల్ని, వాణిజ్యాన్ని నిషేధించింది.

పాక్‌లో మంత్రివర్గ ప్రమాణస్వీకారం

పాకిస్థాన్‌లో దాదాపు పది రోజుల కసరత్తు ఓ కొలిక్కి రావడంతో కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. 34 మంది సభ్యులున్న కేబినెట్‌లో అనుభవానికి, కొత్త రక్తానికి ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ సమప్రాధాన్యం ఇచ్చారు. కనీసం 20 మంది తొలిసారిగా మంత్రులయ్యారు. సెనేట్‌ ఛైర్మన్‌ సాధిఖ్‌ సంజ్రాని కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయించారు. 31 మంది కేబినెట్‌ మంత్రులు, ముగ్గురు సహాయ మంత్రులతో షెహబాజ్‌ తొలి సమావేశం నిర్వహించారు. భాగసామ్య పక్షాలతో పలుమార్లు చర్చలు జరిపాక, మంత్రివర్గ కూర్పును ఖరారు చేశారు. ప్రధాని షెహబాజ్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-ఎన్‌ పార్టీకి 13 మంత్రి పదవులు దక్కగా, రెండో స్థానంలో ఉన్న బిలావల్‌ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)కి 9 బెర్తులు ఇచ్చారు. మంత్రుల హోదాతో మరో ముగ్గురు ప్రత్యేక సలహాదారులను కూడా నియమించారు. మంత్రివర్గంలో అయిదుగురు మహిళలకే అవకాశం చిక్కింది.

రష్యా చేతికి మేరియుపొల్‌

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 7 వారాల పోరాటం తర్వాత ఉక్రెయిన్‌ ప్రధాన నగరాల్లో ఒకటైన మేరియుపొల్‌పై పట్టు సాధించినట్లు రష్యా ప్రకటించింది. అక్కడ తమ బలగాలు ఇంకా పోరాడుతున్నాయని ఉక్రెయిన్‌ ప్రకటించినప్పటికీ పుతిన్‌ సేనలకు నగరం చిక్కినట్లేనని తెలుస్తోంది. అదే వాస్తవమైతే ఫిబ్రవరి 24వ తేదీన యుద్ధం ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్‌ నగరం ఒకదానిని రష్యా స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌ తరఫున ఇంకా పోరాడుతున్న కొద్దిమందిని మేరియుపొల్‌లోని అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారంలో బంధించినట్లు రష్యా తెలిపింది. తూర్పు భాగంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించడానికి వీలుపడేలా ముందుగా ఈ దక్షిణ నగరాన్ని హస్తగతం చేసుకోవాలని గత ఏడు వారాలుగా రష్యా ప్రయత్నిస్తోంది. దాదాపు నగరమంతటినీ గుప్పిట పట్టామనీ, మిగిలినవారు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని రష్యా ప్రకటించింది. వారందరినీ జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలుగా పరిగణించి సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించింది. రష్యా పట్టు సాధించామని చెబుతున్న ఉక్రెయిన్‌లోని మేరియుపొల్‌ నగరం వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతం. తూర్పు అజోవ్‌ సముద్ర తీరంలోని ప్రధాన ఓడరేవు పట్టణమిది. దీనిపై పట్టు సాధించడం రష్యాకు ఎందుకు కీలకమంటే... రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌కు, 2014లో పుతిన్‌ ఆక్రమించిన క్రిమియాకు మధ్యలో మేరియుపొల్‌ ఉంది. అంటే ఇక నుంచి క్రిమియాకు, డాన్‌ బాస్‌ ప్రాంతానికి మధ్య భూమార్గంలో రవాణాకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. క్రిమియా నుంచి పోరాడుతున్న రష్యా సైన్యానికి, లుహాన్స్క్, దొనెట్స్క్‌ ప్రాంతాల్లో పోరాడుతున్న దళాలకు సమన్వయం మరింత పెరుగుతుంది. మేరియుపొల్‌ విజయం కేవలం అజోవ్‌ సముద్ర తీర ప్రాంతానికే పరిమితం కాదు. ఇది త్వరలో నల్ల సముద్రంపై రష్యా సేనలు పట్టు సాధించటానికీ తోడ్పడనుంది. ఉక్కు, బొగ్గు, మొక్కజొన్న ఎగుమతులకు ఈ నగరం కీలక కేంద్రం.

ఉత్తర కొరియాలో భారీ పౌర కవాతు

ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, తన తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతిని పురస్కరించుకొని రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిర్వహించిన భారీ పౌర కవాతులో ఆ దేశ పాలకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పాల్గొన్నారు. ఇందులో వేలమంది ఒక క్రమపద్ధతిలో మార్చింగ్‌ చేస్తూ కిమ్‌ కుటుంబం పట్ల తమ విధేయతను చాటుకున్నారు. వేల మంది నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి సాయుధ సంపత్తిని ప్రదర్శించలేదు.

ట్యునీసియా తీరంలో మునిగిన చమురు నౌక

750 టన్నుల డీజిల్‌ లోడుతో వెళుతున్న వాణిజ్య నౌక ఒకటి ట్యునీసియాకు ఆగ్నేయంగా గల్ఫ్‌ ఆఫ్‌ గేబ్స్‌ల ఒరిగిపోయింది. అనంతరం ఇంజిన్‌ గదిలోకి నీరు రావడంతో శనివారం ఉదయానికి నౌక పూర్తిగా నీటిలో మునిగిపోయిందని, పైభాగం మాత్రమే ప్రస్తుతం కనిపిస్తోందని ట్యునీసియా పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈక్వటోరియల్‌ గునియాకు చెందిన ‘జెలో’ నౌక ఈజిప్టులోని డమీటా నౌకాశ్రయం నుంచి బయలుదేరింది.

అఫ్గాన్‌ ప్రావిన్సులపై పాక్‌ వైమానిక దాడులు

అఫ్గానిస్థాన్‌లోని ఖోస్ట్, కునార్‌ ప్రావిన్సులపై పాక్‌ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో దాదాపు 30 మంది మృతిచెందగా.. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. 26 పాక్‌ విమానాలు దాడుల్లో పాల్గొన్నాయి. తాలిబన్‌ పోలీస్‌ చీఫ్‌ అధికార ప్రతినిధి దాడులను ధ్రువీకరించారు. గోర్బ్స్‌ జిల్లా మాస్టర్‌బెల్‌ ప్రాంతంలో పాక్‌ దళాలు, తాలిబన్‌ బలగాలు ఘర్షణకు దిగాయి. పాకిస్థాన్‌ భూభాగంలోకి వచ్చే ఉత్తర వజీరిస్థాన్‌లోని ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదులను వైమానిక దాడులతో మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. దాడులపై ఇటు పాక్‌ ప్రభుత్వం కానీ, అటు అఫ్గాన్‌ పాలకుల నుంచి కానీ ఎటువంటి వివరణ వెలువడలేదు. ఖోస్ట్‌లో నివసిస్తున్న వజీరిస్థాన్‌ ప్రాంత గిరిజన తెగల నాయకుడొకరు వజీరిస్థాన్‌ నుంచి వలస వచ్చినవారి శిబిరాలే లక్ష్యంగా పాక్‌ దళాలు వైమానిక దాడులకు పాల్పడినట్లు తెలిపారు.

‘ఇండో - పసిఫిక్‌లో స్వేచ్ఛ’కు కట్టుబడి ఉన్నాం: రాజ్‌నాథ్‌

అత్యంత కీలకమైన ఇండో - పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్య, రవాణా కార్యకలాపాల కోసం అమెరికాతో కలిసికట్టుగా కృషిచేసేందుకు భారత్‌ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు. హవాయిలోని ఇండో - పసిఫిక్‌ అమెరికా కమాండ్‌ ప్రధాన కార్యాలయాన్ని తాజాగా ఆయన సందర్శించారు. రక్షణ రంగంలోని అన్ని విభాగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకోవడంపై అక్కడి ఉన్నతాధికారులతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.

భారత రక్షణ అవసరాలను అమెరికా తీర్చాలి: సెనేటర్‌ వికర్‌

రష్యాపై ఆధారపడటం తగ్గేలా భారత రక్షణ అవసరాలను అమెరికా తీర్చాలని మిసిసిపీకి చెందిన ప్రముఖ రిపబ్లికన్‌ సెనేటర్‌ రోజర్‌ వికర్‌ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో ఇదే అందుకు సరైన తరుణమని పేర్కొన్నారు. ఇండియన్‌ అమెరికన్‌ ఫోరమ్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ సంపత్‌ శివంగితో జరిగిన భేటీలో ఈ మేరకు వికర్‌ అభిప్రాయాలు వెలిబుచ్చారు.

ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలోని నాలుగు కమిటీలకు భారత్‌ ఎన్నిక

అంతర్జాతీయ ఉమ్మడి వేదిక ఐరాసలో మన దేశం కీలక విజయాలను నమోదు చేసింది. యూఎన్‌ ఆర్థిక, సామాజిక మండలిలోని నాలుగు కమిటీలకు భారత్‌ ఎన్నికైంది. ఐక్యరాజ్యసమితికి ఉన్న ఆరు కీలక విభాగాల్లో ఆర్థిక, సామాజిక మండలి ఒకటి. ఐరాస సర్వప్రతినిధి సభ నుంచి ఎన్నికైన 54 దేశాల ప్రతినిధులు ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. దీనికి సంబంధించిన సామాజిక అభివృద్ధి కమిషన్, ఎన్జీవోస్‌ కమిటీ, కమిషన్‌ ఆన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీలలో భారత్‌కు ప్రాతినిధ్యం లభించింది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీకి మనదేశ రాయబారి ప్రీతి శరణ్‌ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. విజయానికి సహకరించిన సభ్య దేశాలు అన్నిటికీ ఐరాసలోని భారత శాశ్వత మిషన్‌ కృతజ్ఞతలు తెలిపింది.

సైనిక చర్య ఆపేది లేదు: పుతిన్‌ ప్రకటన

‘ప్రత్యేక సైనిక చర్య’ విషయంలో వెనక్కి తగ్గేది లేదని రష్యా మరోసారి తేల్చిచెప్పింది. ‘ఉక్రెయిన్‌లో మా సైనికులవి ఘనమైన లక్ష్యాలు. అనుకున్న దాన్ని సాధిస్తాం. ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే ఉక్రెయిన్‌పై ఆపరేషన్‌ చేపట్టాం. అది సరైన నిర్ణయం. డాన్‌బాస్‌ ప్రజలకు సాయపడడం, రష్యా స్వీయ భద్రతకు చర్యలు చేపట్టడం దీని ఉద్దేశం. ముఖ్యంగా డాన్‌బాస్‌ ప్రాంత ప్రజలకు సాయపడడం మా ధ్యేయం. అక్కడివారి సమస్యలకు శాంతియుత పరిష్కారం చూపడానికి ఉక్రెయిన్‌ వర్గాలు నిరాకరిస్తున్నాయి’ అని అధ్యక్షుడు పుతిన్‌ చెప్పారు. మాస్కో వెలుపల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బెలారస్‌ నేత అలెగ్జాండర్‌ లుకషెంకోతోనూ చర్చలు జరిపారు.

2/3వ వంతు పిల్లలు ఇళ్లకు దూరమయ్యారు: ఐరాస

యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో మూడింట రెండొంతుల మంది పిల్లలు తమ ఇళ్లను వీడిపోవాల్సి వచ్చిందని ఐరాస అంచనా వేసింది. ఇప్పటికే 142 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. మూడు వైపుల నుంచి రష్యా సేనలు వెళ్లి డాన్‌బాస్‌ ప్రాంతాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తాయని బ్రిటన్‌కు చెందిన విశ్రాంత జనరల్‌ రిచర్డ్‌ బరోన్స్‌ అభిప్రాయపడ్డారు.

పాకిస్థాన్‌ 23వ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ ఎన్నిక

పాక్‌ 23వ ప్రధానమంత్రిగా షెహబాజ్‌ షరీఫ్‌ (70) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో దేశంలో కొన్నాళ్లుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది. వాస్తవానికి ప్రధాని పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ - నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ తరఫున విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహమూద్‌ ఖురేషి తొలుత బరిలో నిలిచారు. అయితే జాతీయ అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రధాని ఎన్నిక ప్రక్రియను తాను, తమ పార్టీ చట్టసభ్యులు బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ఖురేషి ప్రకటించారు. తామంతా సామూహికంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపి, సభను వీడారు. దీంతో ప్రధానిగా షెహబాజ్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. జాతీయ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 342. ప్రధాని పీఠమెక్కాలంటే కనీసం 172 మంది మద్దతు అవసరం. షెహబాజ్‌కు 174 ఓట్లు వచ్చినట్లు స్పీకర్‌ అయాజ్‌ సాదిక్‌ ప్రకటించారు. అంతకుముందు, అంతరాత్మ తనను అనుమతించడం లేదంటూ సభ నిర్వహణకు డిప్యూటీ స్పీకర్‌ ఖాసిమ్‌ సూరి నిరాకరించారు.

అవిశ్వాసంతో పదవిని కోల్పోయిన తొలి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చివరకు ఓటమి తప్పలేదు. 342 మంది సభ్యులున్న పాక్‌ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గింది. తీర్మానానికి అనుకూలంగా 174 మంది మద్దతు పలికారు. దీంతో ఇమ్రాన్‌ పదవీచ్యుతుడయ్యారు. పాక్‌ చరిత్రలో అవిశ్వాసం ఎదుర్కొని పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఆయన మిగిలిపోయారు. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ - నవాజ్‌ పార్టీ అధినేత షెహబాజ్‌ షరీఫ్‌ (నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు) తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉంది. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ అసద్‌ ఖైసర్, డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సూరి తమ పదవులకు రాజీనామా చేశారు.

రష్యా బొగ్గుపై నిషేధానికి ఐరోపా దేశాల సమష్టి నిర్ణయం

ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యా ఆర్థిక వనరులను దెబ్బతీసేందుకు ఆ దేశంపై ఆంక్షలను తీవ్రతరం చేయాలని ఐరోపా సమాజం (యూరోపియన్‌ యూనియన్‌ - ఈయూ) నిర్ణయించింది. బుచా, మేరియుపొల్‌ తదితర నగరాల్లో అమాయక పౌరులపై రష్యా సైనికుల దారుణాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో బ్రసెల్స్‌లో ఈయూ సభ్య దేశాలు భేటీ అయ్యాయి. తొలివిడతలో విద్యుదుత్పత్తి, పరిశ్రమలకు అత్యంత కీలకమైన బొగ్గు దిగుమతులను నిలిపివేసేందుకు ఈయూ సిద్ధమయ్యింది. అయితే, చమురు, సహజవాయువు కొనుగోళ్ల నిలిపివేతకు చర్యలు తీసుకోలేమన్న అశక్తతను అది వ్యక్తం చేసింది. ఐరోపా సమాజంలోని 27 సభ్య దేశాలు తమ బొగ్గు, చమురు, సహజవాయుల అవసరాల కోసం ప్రధానంగా రష్యాపైనే ఆధారపడుతున్నాయి. ఉక్రెయిన్‌పై దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆ దేశాలు..రష్యాపై చర్య తీసుకోక తప్పని పరిస్థితుల్లో ఇంధనాల దిగుమతిపై పునరాలోచనలో పడ్డాయి. బొగ్గును కొద్ది నెలల్లో ఇతర దేశాల నుంచి తెప్పించుకోవచ్చని, చమురు, గ్యాస్‌ సరఫరాలకు ఇప్పటికిప్పుడు ఈయూ దేశాలు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదని ఇంధన నిపుణులు చెబుతున్నారు. ఐరోపా దేశాలకు బొగ్గు ఎగుమతులు నిలిచిపోతే రష్యా ఏడాదికి రూ.33,423 కోట్ల (440 కోట్ల డాలర్ల) ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఈయూ ఎగ్జిక్యూటివ్‌ కమిషన్‌ తెలిపింది.

కొవాగ్జిన్‌ను గుర్తించిన జపాన్‌

భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన కరోనా టీకా కొవాగ్జిన్‌ను గుర్తింపు పొందిన టీకాల జాబితాలో చేరుస్తూ జపాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా భారత్, జపాన్‌ల మధ్య ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. ఈ విషయాన్ని భారత్‌ బయోటెక్‌ సంస్థ ట్విటర్‌లో వెల్లడించింది. ‘‘కొవాగ్జిన్‌ను జపాన్‌ ప్రభుత్వం గుర్తింపు పొందిన టీకాల జాబితాలో చేర్చింది. ఏప్రిల్‌ 10 నుంచి భారత్, జపాన్‌ మధ్య ప్రయాణాలను మరింత సులభతరం చేసే దిశగా ఈ చర్య చేపట్టింది’’ అని ట్విటర్‌లో పేర్కొంది. ఆస్ట్రేలియా సహా మరిన్ని దేశాలు ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణాల కోసం కొవాగ్జిన్‌ను గుర్తించాయి.

పాక్‌ జాతీయ అసెంబ్లీ పునరుద్ధరణ

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేస్తూ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సూరి తీసుకొన్న వివాదాస్పద నిర్ణయాన్ని పాక్‌ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఖాసిం నిర్ణయాన్ని కొట్టివేస్తూ జాతీయ అసెంబ్లీని పునరుద్ధరిస్తున్నట్లుగా ప్రకటించింది.ఇక ప్రధాని ఇమ్రాన్‌కు అవిశ్వాసాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌కు చెందిన డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సూరి ప్రతిపక్షాలు ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను ఏప్రిల్‌ 3న రద్దు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న ‘విదేశీ కుట్ర’కు అవిశ్వాస తీర్మానంతో సంబంధం ఉందంటూ ఖాసిం అప్పట్లో తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీని వెనువెంటనే ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ సూచన మేరకు పాక్‌ జాతీయ అసెంబ్లీని దేశాధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వి రద్దు చేశారు. మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్‌ ఈ చర్యలతో కొంత ఉపశమనం పొందినా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉమర్‌ అతా బందియాల్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది, ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ తీర్పు చెప్పింది.

సర్వప్రతినిధి సభలో ఓటింగ్‌కు భారత్‌ దూరం

ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తొలగించే అంశంపై ఐరాస సర్వప్రతినిధి సభలో ఓటింగ్‌ జరిగింది. తీర్మానానికి అనుకూలంగా 93 దేశాలు, వ్యతిరేకంగా 24 దేశాలు ఓటు వేశాయి. భారత్‌ సహా మొత్తం 58 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. దీంతో ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యా తొలగింపు ఖరారైనట్టేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. రష్యా, ఉక్రెయిన్‌లు శాంతియుత మార్గంలో హింసకు ముగింపు పలకాలని ఐరాసలో భారత రాయబారి టి.ఎస్‌.తిరుమూర్తి చెప్పారు. అందుకే తాము ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్టు తెలిపారు.

శ్రీలంకలో ఆర్థిక సలహా మండలి నియామకం

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. సంక్షోభం నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు ఆర్థిక నిపుణులతో సలహా మండలిని ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సహకారంతో ముందుకు సాగుతూ... దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ మండలి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది. శ్రీలంక సెంట్రల్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ ఇంద్రజీత్‌ కుమారస్వామి, ప్రపంచ బ్యాంకు మాజీ ముఖ్య ఆర్థికవేత్త శాంత దేవరాజన్‌ తదితరులను ప్రభుత్వం ఈ మండలిలో నియమించింది. అయితే, అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంకా ఆర్థిక మంత్రిని నియమించలేదు. అధ్యక్షుడు రాజీనామా చేసి అన్ని పార్టీలతో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విపక్షాలు సూచించాయి. లేదంటే, 25 మంది ఆర్థిక నిపుణులను ప్రభుత్వంలోకి తీసుకుని, వారి సూచనలతో ప్రభుత్వాన్ని నడపాలని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆర్థిక సలహా మండలిని ఏర్పాటు చేసింది.

రష్యాపై ఆంక్షలు కఠినం

రష్యా నిరాయుధులు, మహిళలు, పిల్లలను సైతం ఏమాత్రం కనికరించకుండా హతమారుస్తోందని ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ దేశం తీరు ఏమాత్రం సమర్థనీయం కాదన్నాయి. ఇప్పటికే విధించిన ఆంక్షలకు అదనంగా ఐదో విడతలో మరికొన్నిటితో రష్యాను ఉక్కిరిబిక్కిరి చేయాలని నిర్ణయించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కుమార్తెలిద్దరికీ ఇవి తప్పవని అమెరికా సహా కొన్ని దేశాలు తేల్చిచెప్పాయి. కొత్తగా నాలుగు రష్యా బ్యాంకుల లావాదేవీలను కఠినతరం చేయనున్నాయి. తమ ఆర్థిక వ్యవస్థలోకి అడుగుపెట్టనీయకుండా వాటిపై నిషేధం విధించాయి. అమెరికా పౌరులు ఈ బ్యాంకులతో లావాదేవీలు చేయకుండా, ఆ దేశంలో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకట్ట పడింది. పుతిన్‌ కుటుంబంపైనే కాకుండా ప్రధాని మిఖైల్‌ మిషుస్తిన్‌ కుటుంబం, విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్, రష్యా భద్రతా మండలి సభ్యులు తదితరులనూ ఆంక్షల చట్రంలోకి తెచ్చినట్లయింది. పుతిన్‌ సన్నిహితులకు అమెరికాలో ఉన్న ఆస్తుల్ని స్తంభింపజేస్తారు. ఐరాస మానవ హక్కుల కమిషన్‌ నుంచి రష్యాను సస్పెండ్‌ చేయాలన్న తీర్మానంపై సర్వ ప్రతినిధి సభ ఏప్రిల్‌ 7న ఓటింగ్‌ నిర్వహించనుంది. దీని కోసం అత్యవసరంగా సమావేశం కానుంది. మరికొన్ని ఐరోపా దేశాలు రష్యా దౌత్యవేత్తల్ని బహిష్కరించాయి. బొగ్గు దిగుమతులు సహా ఐదో విడత కింద మరిన్ని ఆంక్షల్ని పరిశీలిస్తున్నట్లు యూరోపియన్‌ కమిషన్‌ తెలిపింది. రష్యా నౌకల్ని, ఆ దేశ నిర్వహణలో ఉన్న ఓడల్ని ఈయూ రేవుల్లోకి రానివ్వకుండా నిషేధాన్ని విధించాలని తీర్మానించారు. బుచాలో జరిగిన మారణహోమంపై విచారణ జరపాలని చైనా డిమాండ్‌ చేసింది.

శ్రీలంక ఆర్థిక మంత్రి రాజీనామా

శ్రీలంక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అలీ సర్బీ 24 గంటలు తిరక్కముందే తన పదవికి రాజీనామా చేశారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో పలువురు చట్టసభ్యులు అధికార కూటమిని వీడారు. దీంతో రాజపక్స సర్కారు మైనార్టీలోకి వెళ్లింది. తీవ్ర ఆర్థిక పతనాన్ని చవిచూస్తున్న శ్రీలంకలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అధికారాన్ని కాపాడుకునేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికార ఎస్‌ఎల్‌పీపీ కూటమిలో కలహాలకు కేంద్ర బిందువుగా ఉన్నారని తన సోదరుడైన బాసిల్‌ రాజపక్సను ఆర్థిక మంత్రి పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అలీ సర్బీని నియమించారు. అయితే, 24 గంటలైనా తిరక్కముందే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

అధికార కూటమిని వీడిన 50 మంది చట్టసభ్యులు

దేశ పరిస్థితుల దృష్ట్యా పార్లమెంటు అత్యవసరంగా సమావేశమైంది. మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. రాజపక్స కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో అధికార కూటమికి చెందిన పలు పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయి. సుమారు 50 మంది చట్టసభ్యులు కూటమిని వీడి బయటకు వచ్చారు. శ్రీలంక పార్లమెంటులో మొత్తం 225 సీట్లు ఉండగా, అధికారం చేపట్టడానికి కనీసం 113 మంది సభ్యులు అవసరం. 2020 సాధారణ ఎన్నికల్లో ఎస్‌ఎల్‌పీపీ కూటమి 150 స్థానాలు గెలుచుకుంది. అయితే, 41 మంది చట్టసభ్యులు కూటమి నుంచి బయటకు వచ్చారని, దీంతో ప్రధాని మహింద రాజపక్స నేతృత్వంలోని సర్కారు మైనార్టీలో పడిందని చెబుతున్నారు. ప్రభుత్వానికి 138 మంది సభ్యుల మద్దతు ఉందని అధికార కూటమికి చెందిన చట్టసభ్యుడు రోహిత అబేగుణవర్ధన పేర్కొన్నారు. తన ప్రభుత్వ చర్యలను గొటబాయ సమర్థించుకున్నారు. కొవిడ్‌ కారణంగా పర్యాటకం నిలిచిపోవడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిండుకోవడం వల్లే ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు.

శ్రీలంకలో అత్యవసర పరిస్థితి ఎత్తివేత

శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి ఎత్తివేస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రకటన వెలువరించారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎత్తివేస్తున్న అధ్యక్షుడు ప్రకటించారు.

రష్యా నుంచి బొగ్గు దిగుమతులపై నిషేధం

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాను లక్ష్యంగా చేసుకొని మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని ఐరోపా యూనియన్‌ (ఈయూ) కార్యనిర్వాహక శాఖ యోచిస్తోంది. రష్యా నుంచి బొగ్గు దిగుమతులను నిషేధించాలని ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వొన్‌ డెర్‌ లెయెన్‌ తాజాగా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆ దిగుమతుల విలువ ఏటా 400 కోట్ల యూరోల వరకు ఉంటున్న సంగతిని గుర్తుచేశారు.

అమెరికా ఖాతాల నుంచి డాలర్లలో చెల్లింపులు జరపకుండా నిషేధం

రష్యా ప్రభుత్వరంగ సంస్థలు రుణ చెల్లింపులను తమ (అమెరికా) ఆర్థిక సంస్థల్లోని ఖాతాల ద్వారా డాలర్ల రూపంలో జరపకుండా అమెరికా ఖజానా శాఖ తాజాగా నిషేధం విధించింది. మాస్కోపై ఇప్పటికే విధించిన ఆంక్షలు రుణ చెల్లింపులను అడ్డుకోలేకపోతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు- రష్యాలో తయారయ్యే వజ్రాల విక్రయాలను నిలువరించడంలో భారత్‌ సహకారాన్ని అమెరికా చట్టసభ్యుల బృందం తాజాగా కోరింది. రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలన్న భారత్‌ నిర్ణయంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

శ్రీలంకలో ఆర్థిక మంత్రిని తొలగించిన అధ్యక్షుడు గొటబాయ

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన సోదరుడైన ఆర్థిక మంత్రి బాసిల్‌ రాజపక్సను ఆ పదవి నుంచి తొలగించారు. ఆర్థిక పరిస్థితిని, ఆందోళనలను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వంలో చేరాలంటూ విపక్షాలకు గొటబాయ ఆహ్వానం పలికారు. కానీ, ప్రతిపక్ష నేతలు అందుకు తిరస్కరించారు. ‣ న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అలీ సర్బీ... ఇక ఆర్థికశాఖ వ్యవహారాలు చూడనున్నారు. మరోవైపు- ఖాళీ అయిన మంత్రి పదవులను ఇస్తామని, ప్రభుత్వంలో చేరాలని విపక్షాలకు గొటబాయ ఆహ్వానించారు. కానీ, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన యునైటెడ్‌ పీపుల్స్‌ ఫోర్స్‌ దీన్ని తిరస్కరించింది. శ్రీలంక ముస్లిం కాంగ్రెస్‌ సహా తమ పార్టీ కూడా ప్రభుత్వంలో చేరబోదని తమిళ్‌ పీపుల్స్‌ అలయెన్స్‌ నేత మనో గణేశన్‌ ప్రకటించారు.

శ్రీలంక సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రాజీనామా

శ్రీలంక సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ అజిత్‌ నివార్డ్‌ కబ్రాల్‌ తన పదవికి రాజీనామా చేశారు. 2021, సెప్టెంబరులో ఆయన రెండోసారి ఈ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2006 - 15 మధ్య కూడా కబ్రాల్‌ ఈ పదవిని చేపట్టారు. దేశం ఆర్థికంగా పతనమవుతున్నా... విదేశాల నుంచి ఆర్థిక సాయం, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి రుణాలు తీసుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. దేశంలో ద్రవ్యోల్బణం అత్యంత గరిష్ఠ స్థాయికి చేరడం, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న క్రమంలో కబ్రాల్‌ రాజీనామా చేశారు.

హాంకాంగ్‌ ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈవో) క్యారీ లామ్‌ రాజీనామా

ఐదేళ్లుగా హాంకాంగ్‌ ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా ఉన్న క్యారీ లామ్‌ (68) తన పదవికి జూన్‌లో రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. రెండోసారి పదవి కోసం పోటీపడబోనని ప్రకటించారు. 2019లో హాంకాంగ్‌లో నిరసన ప్రదర్శనలను తీవ్రంగా అణచివేసిన చీఫ్‌ సెక్రటరీ జాన్‌ లీ తదుపరి సీఈవో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

శ్రీలంకలో 36 గంటల ఎమర్జెన్సీ

తీవ్ర ఆహార, ఇంధన, ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్న శ్రీలంకలో ‘ఎమర్జెన్సీ’ అమల్లోకి వచ్చింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇందుకు ఆదేశాలు జారీచేశారు. ప్రజాభద్రత అత్యయిక పరిస్థితి నిబంధనలను అనుసరించి ఏప్రిల్‌ 1 సాయంత్రం 6 నుంచి 36 గంటల పాటు ఇది అమలులో ఉంటుంది. మార్చిలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో నమోదు కాగా... ఆహార పదార్థాల ధరలు కొండెక్కాయి. పెరిగిన ధరలు సామాన్యులు భరించలేని స్థితికి చేరాయి. బతుకు భారంగా మారడంతో దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు ఎగిసిపడుతున్నాయి. అధ్యక్షుడి నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టిన క్రమంలో రాజపక్స ఏప్రిల్‌ 1న రాత్రి అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులోకి వచ్చింది.

శ్రీలంకకు భారత్‌ చమురు సాయం

శ్రీలంకలో మార్చి నెలలో ద్రవ్యోల్బణం 18.7%గా నమోదైనట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఆహార పదార్థాల ధరలు రికార్డు స్థాయిలో 30.1% పెరిగాయి! ఇంధన కొరత తీవ్రంగా ఉండటంతో భారత్‌ నుంచి 40 వేల మెట్రిక్‌ టన్నుల ఇంధనంతో ఓ నౌక శ్రీలంక చేరుకుంది. సంక్షోభాన్ని అధిగమించేందుకు భారత్‌ నుంచి శ్రీలంక పొందిన రుణంలో భాగంగా... నౌకలో డీజిల్‌ను తరలించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో గురువారం 13 గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనేందుకు ఫిబ్రవరిలో 500 బిలియన్‌ డాలర్ల రుణాన్ని మంజూరు చేసిన భారత్, తాజా పరిస్థితులను అధిగమించేందుకు ఆ దేశానికి మరో బిలియన్‌ డాలర్ల రుణాన్ని ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా డీజిల్‌ను సరఫరా చేయడం ఇది నాలుగోసారి అని కొలంబోలోని ఇండియన్‌ హైకమిషన్‌ తెలిపింది.

ఉక్రెయిన్‌కు అండగా అమెరికా

రష్యా సైనిక దాడిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు ఇప్పటికే 160 కోట్ల డాలర్లకుపైగా భద్రత సాయాన్ని అందించిన అమెరికా మరో 30 కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని ప్రకటించింది. ఈ తాజా ప్యాకేజీలో భాగంగా ఆ దేశానికి లేజర్‌ గైడెడ్‌ రాకెట్‌ వ్యవస్థలు, మానవరహిత విమానాలు, సాయుధ ట్యాంకులు తదితర సామగ్రిని సరఫరా చేయనుంది. ఈ సాయం ఉక్రెయిన్‌ సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని రక్షణ శాఖ పత్రికా కార్యదర్శి జాన్‌ కిర్బీ తెలిపారు.