అవార్డులు



దక్షిణ సూడాన్‌లో భారతీయ శాంతి పరిరక్షకులకు ఐరాస పతకాలు

→దక్షిణ సూడాన్‌లో ఐరాస మిషన్‌ (యూఎన్‌ఎంఐఎస్‌ఎస్‌)లో పనిచేస్తున్న 1,160 మంది శాంతి పరిరక్షకులకు ఐరాస పతకాలు లభించాయి.
→కలహాలతో అట్టుడుకుతున్న దేశంలో వీరు అందించిన అసాధారణ సేవలకుగాను ఈ గౌరవం లభించింది.
→ ‘‘యూఎన్‌ఎంఐఎస్‌ఎస్‌లో శాంతి పరిరక్షకులు కేవలం పౌరులను రక్షించడమే కాదు. భారత్‌ నుంచి వచ్చిన 1,160 మంది దక్షిణ సూడాన్‌లో రహదారులను పునరుద్ధరిస్తున్నారు.
→ స్థానిక సమాజాల్లో సామర్థ్యాలను పెంచుతున్నారు. మనుషులు, పశువులకు వైద్యం చేస్తున్నారు. అందువల్లే వారు ఐరాస పతకాలకు అర్హులు’’ అని యూఎన్‌ఎంఐఎస్‌ఎస్‌ తెలిపింది.
→ భారత ఇంజినీరింగ్‌ బలగాలు అప్పర్‌ నైలు రాష్ట్రంలో అనేక రహదారులను పునరుద్ధరించాయని వెల్లడించింది.
→ ఐరాస శాంతి పరిరక్షణ కార్యక్రమాలకు ఎక్కువ మంది సిబ్బందిని సమకూర్చుతున్న రెండో దేశంగా భారత్‌ నిలుస్తోంది.
→ప్రస్తుతం ఐరాస శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో 2,385 మంది భారత సైనిక సిబ్బంది, 30 మంది పోలీసులు పనిచేస్తున్నారు.

టెస్కాబ్‌కు అవార్డుల ప్రదానం

→సహకార రంగంలో విశేష కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు (టెస్కాబ్‌)కు తృతీయ, కరీంనగర్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), ఇదే జిల్లా చొప్పదండి ప్రాథమిక సహకార సంఘాని (ప్యాక్స్‌)కి ప్రథమ బహుమతులను ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ భగల్‌ అందజేశారు.
→రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య (న్యాఫ్స్‌క్యాబ్‌) దేశవ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకులు, ప్యాక్స్‌ల పనితీరును మదించి 2019 - 20 సంవత్సరానికి ఈ అవార్డులను ప్రకటించింది.
→ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్‌ అవార్డులను అందజేశారని టెస్కాబ్‌ ఎండీ నేతి మురళీధర్‌ తెలిపారు.
→వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్నందున వరుసగా మూడో ఏడాది న్యాఫ్స్‌క్యాబ్‌ అవార్డును దక్కించుకుందని ఆయన తెలిపారు.


సింగరేణి థర్మల్‌ కేంద్రానికి జాతీయస్థాయి పురస్కారం

→సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి జాతీయస్థాయిలో ఎనర్జీ ఎఫీషియెంట్‌ ప్లాంట్‌ పురస్కారం దక్కింది.
→గోవాలో జరుగుతున్న మిషన్‌ ఎనర్జీ ఫౌండేషన్‌ రెండు రోజుల సదస్సులో భాగంగా నిర్వాహకులు 2021 - 22 సంవత్సరానికి దక్షిణభారత స్థాయిలో బెస్ట్‌ ఎనర్జీ ఎఫీషియెంట్‌ ప్లాంట్‌ (కోల్‌)గా సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ఎంపిక చేస్తూ ప్లాంటు అధికారులు ఎన్‌.వి.కె.విశ్వనాథరాజు, జె.ఎన్‌.సింగ్‌లకు అవార్డును అందజేశారు.
→దక్షిణ భారత దేశంలో ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుమారు 75కు పైగా ప్లాంట్లలో సింగరేణికి ఈ అవార్డు దక్కడం విశేషం. సాధారణ ప్రమాణాల ప్రకారం 500 మెగావాట్ల ప్లాంట్‌లో ఒక యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి 2444 కిలో కేలరీస్‌కు లోబడి ఇంధన శక్తి వాడటాన్ని ప్రామాణికంగా భావిస్తారు.
→సింగరేణి ప్లాంట్‌ 2021 - 22లో కేవలం 2429 కిలో కేలరీస్‌ నమోదు చేసింది.

2019 - 20 ఎక్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానం

→పారిశ్రామిక ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు వాణిజ్యానికి అనుకూలమైన వాతావరణం, విధానాలను కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తోందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు.
→దీని ఫలితంగా మారుమూల ప్రాంతాల్లోని ఉత్పత్తులు కూడా ప్రపంచ వ్యాప్తం అయ్యేలా ‘లోకల్‌ టు గ్లోబల్‌’ పద్ధతి అమలయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
→చెన్నై సమీపంలో తాంబరం ఎంఈపీజెడ్‌ సెజ్‌లో ఏర్పాటు చేసిన ఎగుమతి యూనిట్లకు అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు.
→2019-20 సంవత్సరానికిగాను ఎక్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను ప్రదానం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు ఉత్తమ ప్రతిభా అవార్డు

→నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ పురోగతికి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, గృహ నిర్మాణ శాఖ (హడ్కో) ఉత్తమ ప్రతిభా అవార్డు అందించింది.
→దిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆ శాఖ కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి చేతుల మీదుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ అవార్డును అందుకున్నారు.

మోదీకి లతా దీనానాథ్‌ మంగేష్కర్‌ అవార్డు ప్రదానం

→జాతి నిర్మాణంలో దివంగత దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌ ఓ భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
→ముంబయిలో లతా దీనానాథ్‌ మంగేష్కర్‌ అవార్డును స్వీకరించిన ఆయన ఈ మేరకు దిగ్గజ గాయకురాలితో తను అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
→లతా మంగేష్కర్‌ తీవ్ర అనారోగ్యంతో 2022 ఫిబ్రవరిలో కన్నుమూశారు. ఆమె జ్ఞాపకార్థం ఈ అవార్డును ఏర్పాటు చేశారు. దాన్ని స్వీకరించిన తొలి వ్యక్తి మోదీయే.
→లత తండ్రి మాస్టర్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ 80వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

మలేరియా నిర్మూలనలో ఏపీకి కేంద్ర పురస్కారం

→మలేరియా కేసులు గణనీయంగా తగ్గిన తొలి పది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి.
→దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పురస్కారం ప్రకటించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె.నివాస్‌ పేర్కొన్నారు.
→ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా దిల్లీలో ఏప్రిల్‌ 25న జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అదనపు సంచాలకులు రామిరెడ్డి ఈ అవార్డును అందుకోనున్నారు.

ఏపీఎస్‌బీసీఎల్‌కు ఈ గవర్నెన్స్‌ పురస్కారం

→ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) అమలు చేస్తున్న ‘సేల్‌ మేనేజ్‌మెంట్, మానిటరింగ్‌ సిస్టమ్‌’ విధానానికి కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా నుంచి ఈ గవర్నెన్స్‌ పురస్కారం లభించింది.
→అలహాబాద్‌ నిట్‌లో జరిగిన కార్యక్రమంలో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రకాశ్‌ చేతుల మీదుగా ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీ వాసుదేవరెడ్డి పురస్కారాన్ని స్వీకరించారు.
→ఏపీఎస్‌బీసీఎల్‌ ఈ వివరాల్ని తెలిపింది.

జెలెన్‌స్కీకి ప్రజాస్వామ్య పరిరక్షణ పురస్కారం

→ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్నవారికి ఇచ్చే ‘జాన్‌ ఎఫ్‌ కెన్నడీ’ పురస్కారానికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎంపికయ్యారు.
→ఆయనతో సహా మొత్తం ఐదుగురిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు సంబంధిత ఫౌండేషన్‌ ప్రకటించింది. చావో రేవో అన్నట్లుగా దేశం కోసం ఆయన పోరాడుతున్నారని కొనియాడింది.
→మిగిలిన నలుగురు అమెరికాలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి దోహదపడ్డారని తెలిపింది. మే 22న వీటిని బోస్టన్‌లో ప్రదానం చేస్తారు.

‘పోషణ్‌ అభియాన్‌’లో కుమురం భీం జిల్లాకు జాతీయ పురస్కారం

→కుమురం భీం జిల్లాలో తల్లీబిడ్డలకు ప్రాణసంకటంగా మారిన రక్తహీనత సమస్యను అధిగమించడానికి జిల్లా యంత్రాంగం ఏడాదిగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.
→ఈ జిల్లా పోషణ్‌ అభియాన్‌ అమలులో 2021 సంవత్సరానికి దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది.
→దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కుమురం భీం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ప్రధాని మోదీ నుంచి నేషనల్‌ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నారు.

ఆంధ్రా సుగర్స్‌కు కాస్ట్‌ ఎక్సలెన్సీ అవార్డు

→ది ఇన్‌స్టిస్ట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్‌ అవార్డ్స్‌ ఫర్‌ కాస్ట్‌ ఎక్సలెన్సీలో ఆంధ్రా సుగర్స్‌ సంస్థకు ప్రైవేటు మీడియం కార్పొరేట్‌ విభాగంలో మొదటి బహుమతి వచ్చిందని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీఎస్‌ఆర్వీకే రంగారావు, సంస్థ ఉపాధ్యక్షుడు, ఫైనాన్స్, అడిషినల్‌ కార్యదర్శి పీవీఎస్‌ విశ్వనాథకుమార్‌లు తెలిపారు.
→ఏప్రిల్‌ 20న దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ నుంచి సంస్థ ప్రతినిధులు అవార్డును అందుకున్నట్లు వెల్లడించారు.

ఏసీబీ జేడీ రవికుమార్‌కు మహోన్నత సేవా పతకం

→ఆంధ్రప్రదేశ్‌ అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పి.వి.రవికుమార్‌కు ఏపీ పోలీసు మహోన్నత సేవా పతకం లభించింది.
→రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు, ఒంగోలు ఏసీబీ డీఎస్పీ ఎం.సూర్యనారాయణరెడ్డి, తిరుపతి ఏసీబీ కానిస్టేబుల్‌ పి.రవి పోలీసు ఉత్తమ సేవా పతకాలకు ఎంపికయ్యారు.
→మరో 12 మందిని పోలీసు సేవా పతకాలు వరించాయి. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి జి.విజయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

పెద్దకడబూరు ఠాణాకు ఉత్తమ పురస్కారం

→కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు పోలీసు స్టేషన్‌ ఉత్తమ పురస్కారానికి ఎంపికైంది. 2020 సంవత్సరానికిగాను కేంద్రం హోంశాఖ ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పురస్కారం’ ప్రకటించింది.

కుమురం భీం ఆసిఫాబాద్‌కు పీఎం పురస్కారం

→శిశు, బాలిక, మహిళలు, గర్భిణులు, బాలింతల పౌష్టికాహార కల్పన కార్యక్రమం పోషణ్‌ అభియాన్‌ అమలులో 2021 సంవత్సరానికి కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి ప్రధానమంత్రి పురస్కారానికి ఎంపికైంది.
→దీన్ని ప్రధాని మోదీ ఏప్రిల్‌ 21న దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో అందజేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాస్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సమాచారమిచ్చారు.

కర్నూలు విమానాశ్రయానికి ప్రధానమంత్రి ఎక్సలెన్సు అవార్డు

→కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ప్రారంభం నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు కేంద్ర విమానయాన పథకం (ఉడాన్‌) అరుదైన గౌరవం అందించింది.
→ఇన్నోవేషన్‌ సెంట్రల్‌ కేటగిరీ అడ్మినిస్ట్రేషన్‌ - 2020 కింద ప్రధానమంత్రి ఎక్సలెన్సు అవార్డును కర్నూలు విమానాశ్రయానికి ప్రకటించింది.
→పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఈ అవార్డును ఏప్రిల్‌ 21న అందజేయనుంది.

సిక్కోలు జవాన్‌కు పీఎంజీ అవార్డు ప్రదానం

→శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దన్నానపేట వాసి, సీఆర్పీఎఫ్‌ జవాన్‌ గొర్లె జగన్‌మోహనరావు పోలీస్‌ మెడల్‌ గ్యాలంట్రీ (పీఎంజీ) అవార్డును అందుకున్నారు.
→ జమ్మూకశ్మీర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు 2017లో సీఆర్పీఎఫ్‌ బృందంపై దాడులు చేయగా ఎదురుకాల్పులు జరిపి ఉగ్రవాదులను హతమార్చినందుకు ఈ గౌరవం దక్కింది.
→ దిల్లీలోని సీఆర్పీఎఫ్‌ క్యాంపు కార్యాలయంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎ.కె.బల్లా ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు.
→ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను హతమార్చిన 55 మంది సీఆర్పీఎఫ్‌ బృందాన్ని పీఎంజీ అవార్డుకు ఎంపిక చేసినట్లు 2020 ఆగస్టు 15న ఐజీ రవిదీప్‌సింగ్‌ సాహీ ప్రకటించారు.

కేసముద్రం మార్కెట్‌కు ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారం

→మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ ప్రతిష్ఠాత్మక ‘ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు - 2019’కి ఎంపికైంది.

సహ్‌యోగ్‌ కుష్ఠ్‌ యజ్ఞ ట్రస్ట్‌లకు ‘ఇంటర్నేషనల్‌ గాంధీ అవార్డ్‌ ఫర్‌ లెప్రసీ, 2021’ ప్రదానం

→చండీగఢ్‌కు చెందిన డాక్టర్‌ భూషణ్‌ కుమార్, గుజరాత్‌కు చెందిన సహ్‌యోగ్‌ కుష్ఠ్‌ యజ్ఞ ట్రస్ట్‌లకు ‘ఇంటర్నేషనల్‌ గాంధీ అవార్డ్‌ ఫర్‌ లెప్రసీ, 2021’ ప్రదానం చేశారు.
→ఈ కార్యక్రమంలో దిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో ఈ వ్యాధిపై పోరు సాగుతోందని, ప్రతి 10 వేల జనాభాకు ఒక కేసు కంటే తక్కువ నమోదయ్యే స్థాయికి కుష్ఠు నిర్మూలనకు కృషి జరిగినట్లు తెలిపారు. గాంధీ మెమోరియల్‌ లెప్రసీ ఫౌండేషన్‌ ఈ వార్షిక అవార్డులను అందజేస్తోంది.

సిద్దిపేట జిల్లాకు ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ పురస్కారం

→సిద్దిపేట జిల్లాలో వైద్యారోగ్య శాఖ అందించిన అత్యుత్తమ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ విభాగంలో ‘ప్రైమ్‌ మినిస్టర్స్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ - 2019’ జాతీయ పురస్కారం ప్రకటించింది. మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమంలో భాగంగా రెండేళ్లలోపు చిన్నారులకు నూరుశాతం టీకాలు పూర్తిచేసినందుకుగానూ జిల్లా అవార్డుకు ఎంపికైంది. ఏటా మూడు విడతలుగా చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నారు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించి టీకా తీసుకోని వారి జాబితా రూపొందించి పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో రెండేళ్లలోపు చిన్నారులు దాదాపు 28 వేల మంది ఉన్నారు. 2018-19లో అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో జరిగిన సర్వేలో వారిలో 1,622 మంది టీకా తీసుకోలేదని గుర్తించి పంపిణీని పూర్తిచేశారు. వంద శాతాన్ని అధిగమించారు. కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఈ విషయాన్ని నిర్ధారించి పురస్కారానికి ప్రతిపాదించాయని జిల్లా వైద్యాధికారి డా.మనోహర్‌ తెలిపారు. సివిల్‌ సర్వీసెస్‌ డే పురస్కరించుకుని ఏప్రిల్‌ 20, 21 తేదీల్లో దిల్లీలో జరిగే కార్యక్రమంలో ట్రోఫీతో పాటు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం జిల్లాకు అందిస్తుందని వెల్లడించారు.

ఏపీలో పంచాయతీలు, పరిషత్తులకు 16 కేంద్ర అవార్డులు

→జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో గ్రామ పంచాయతీలకు, మండల, జిల్లా పరిషత్తులకు ఏటా ప్రకటించే అవార్డుల్లో 2020-21 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు 16 వచ్చాయని పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ వెల్లడించారు. చైౖల్డ్‌ఫ్రెండ్లీ విభాగంలో నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం యేకొల్లు గ్రామ పంచాయతీ ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 24న దిల్లీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేస్తారు.

భాగ్యనగరానికి రెండోసారి ట్రీ సిటీ అవార్డు

→భాగ్యనగరం వరుసగా రెండోసారి ట్రీ సిటీ అవార్డు గెలుచుకొంది. 2021 సంవత్సరానికి సంబంధించి యునైటెడ్‌ నేషన్స్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో), అర్బోర్‌ డే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ అవార్డును అందించారు. 2020లోనూ హైదరాబాద్‌ నగరానికి ట్రీ సీటీ పురస్కారం లభించడం విశేషం. గత రెండేళ్లలో నగరంలో 3,50,56,635 మొక్కలను నాటినట్లు పేర్కొన్నారు. 500 వాలంటీర్లు ఈ క్రతువులో పాల్గొన్నారు.

ముళ్లపూడి నరేంద్రనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం

→స్వదేశీ ఒంగోలు జాతి పశుపోషణ, అభివృద్ధి, సంరక్షణ కోసం గత 50 ఏళ్లుగా విశేష కృషిచేస్తున్న ఆంధ్ర సుగర్స్‌ జేఎండీ ముళ్లపూడి నరేంద్రనాథ్‌ను అవార్డు వరించింది. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ యానిమల్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎస్‌ఏపీఎం) సంస్థ 28వ వార్షిక మహాసభల సందర్భంగా విశాఖపట్నంలో నరేంద్రనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత.. ఒంగోలు జాతి పశు అభివృద్ధిపై కీలక ఉపన్యాసంతో పాటు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

‘మీ భూమి ప్రాజెక్ట్‌’కు స్కోచ్‌ అవార్డు

→రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రవేశపెట్టిన ‘మీ భూమి ప్రాజెక్ట్‌’కు స్కోచ్‌ అవార్డు (సిల్వర్‌) లభించింది. అలాగే ఇంటి స్థలాలు, కౌలు రైతు కార్డులు, భూశోధక్‌ పథకాల అమలుకు నిర్వహిస్తున్న వెబ్‌సైట్లు, ఆధునిక సాంకేతిక వినియోగం, ఇతర చర్యలకు ‘స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’ లభించింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం ఆన్‌లైన్‌ ద్వారా జరిగింది.

మోదీకి లతా దీనానాథ్‌ మంగేష్కర్‌ తొలి పురస్కారం

→ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లతా దీనానాథ్‌ మంగేష్కర్‌ తొలి పురస్కారం అందజేయనున్నట్లు మంగేష్కర్‌ కుటుంబం ప్రకటించింది. ఏప్రిల్‌ 24న మాస్టర్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ (లతా మంగేష్కర్‌ తండ్రి) 80వ వర్ధంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ లతా దీనానాథ్‌ మంగేష్కర్‌ తొలి పురస్కారం అందుకుంటారు.

ఎన్‌ఎండీసీకి ‘స్కోచ్‌’ అవార్డులు

→ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీకి ప్రతిష్ఠాత్మక ‘స్కోచ్‌’ అవార్డులు లభించాయి. 80వ స్కోచ్‌ సదస్సులో తమకు ఈ అవార్డులు దక్కినట్లు ఎన్‌ఎండీసీ వెల్లడించింది. ఈ సంస్థ దంతేవాడ జిల్లాలో అమలు చేసిన సాంకేతిక విద్య - నైపుణ్యాభివృద్ధి కార్యకలాపాలకు గుర్తింపుగా ‘సామాజిక బాధ్యత’ విభాగంలో బంగారు అవార్డు, డిజిటల్‌ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు అమలు చేసిన ‘ప్రాజెక్ట్‌ కల్పతరు’ కు గుర్తింపుగా సిల్వర్‌ అవార్డు లభించాయి. ఎన్‌ఎండీసీ తరఫున సంస్థ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) అమితవ ముఖర్జీ ఈ అవార్డులు అందుకున్నారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో తెలంగాణకు 19 అవార్డులు

→ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పలు పురస్కారాల్ని దక్కించుకొంది. ఏటా కేంద్రం ప్రకటించే ఈ పురస్కారాల్లో ఈసారి జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు నాలుగు కేటగిరీల్లో 19 అవార్డులు లభించాయి. ఈ సమాచారాన్ని కేంద్రం రాష్ట్రాలకు పంపింది. → ఉత్తమ జిల్లా పరిషత్‌ల జాబితాలో సిరిసిల్ల చోటు దక్కించుకొంది. → ఉత్తమ మండలాలుగా వరంగల్‌ జిల్లా పర్వతగిరి, పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, జగిత్యాల జిల్లా కొడిమ్యాల్‌ నిలిచాయి. → ఉత్తమ పంచాయతీలుగా సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లి, జక్కాపూర్, బూరుగుపల్లి; ఆదిలాబాద్‌ జిల్లా ముఖ్రకె; కరీంనగర్‌ జిల్లా వెలిశాల; మహబూబాబాద్‌ జిల్లా వెంకటాపూర్‌; మహబూబ్‌నగర్‌ జిల్లా గుండ్లపొట్లపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా మద్దికుంట, మండేపల్లి; వరంగల్‌ జిల్లా మరియపురం; పెద్దపల్లి జిల్లా నాగారం, హరిపురం; నారాయణపేట జిల్లా మంతన్‌గడ్‌; వనపర్తి జిల్లా చందాపూర్‌ గ్రామాలు పురస్కారాలు దక్కించుకున్నాయి.

కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డుల ప్రదానం

→ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2018 నుంచి 2021 వరకు మూడేళ్లకు సంబంధించిన కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డులు, లలితకళ అకాడమీ ఫెలోషిప్‌లను దిల్లీలో ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మల్లాది సూరిబాబు (కర్ణాటక సంగీతం), ఎస్‌.కాశీం, ఎస్‌.బాబు (నాదస్వరం), పసుమర్తి రామలింగశాస్త్రి (కూచిపూడి), కోట సచ్చిదానంద శాస్త్రి (హరికథ) అవార్డులు అందుకున్నారు. శిల్పకళల విభాగంలో తెలుగు యువకుడు పెనుగంటి జగన్‌మోహన్‌ అవార్డును స్వీకరించారు.

43 మందికి సంగీత నాటక అకాడమీ అవార్డులు

→దేశంలోని 43 మంది ప్రముఖ కళాకారులు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, అవార్డులకు ఎంపికయ్యారు. మొదట 44 పేర్లతో ఉన్న జాబితాను కౌన్సిలు ఆమోదించగా, ఓ కళాకారుడు అవార్డు స్వీకరణకు తిరస్కరించడంతో 43 పేర్లను ఖరారు చేశారు. ఆ కళాకారుడి పేరు బయటకు రాలేదు. 2018 సంవత్సరానికిగాను ఈ ఎంపికలు జరిగాయి. 2021 సంవత్సరానికిగాను లలిత్‌ కళా అకాడమీ ఫెలోషిప్, జాతీయ అవార్డులకు మరో 23 మందిని ఎంపిక చేశారు. ఏప్రిల్‌ 9న జరిగే ఉమ్మడి కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ అవార్డులను అందజేస్తారు.

‘గ్రామీ’ అవార్డుల ప్రదానోత్సవం

→సంగీత ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌వెగాస్‌లోని ‘గ్రాండ్‌ మార్కీ బాల్‌రూమ్‌’లో వేడుకగా జరిగింది. భారత సంతతికి చెందిన రిక్కీ కేజ్, ఫాల్గుణి షాలు గ్రామీ అవార్డులను గెలుచుకుని దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. ‘డివైన్‌ టైడ్స్‌’ ఆల్బమ్‌కు గానూ రిక్కీ కేజ్‌ రెండో సారి గ్రామీ అవార్డును అందుకున్నాడు. స్టెవార్ట్‌ కోప్‌లాండ్‌తో కలిసి రిక్కీ సంయుక్తంగా ఈ అవార్డును గెలుచుకున్నారు.
→ ప్రఖ్యాత ‘బ్రిటిష్‌ ర్యాక్‌ బ్యాండ్‌’లో డ్రమ్మర్‌ అయిన కోప్‌లాండ్‌ ‘డివైన్‌ టైడ్స్‌’ ఆల్బమ్‌ కోసం రిక్కీతో జత కట్టాడు. న్యూయార్క్‌కు చెందిన ఫాల్గుణి షా సైతం తొలి సారి గ్రామీ అవార్డును గెలుచుకుంది. ‘ఫలు’ పేరుతో సుప్రసిద్ధమైన షా తన ‘ఎ కలర్‌ఫుల్‌ వరల్డ్‌’ ఆల్బమ్‌కి గానూ ఈ అవార్డు అందుకుంది.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జాతీయ, అంతర్జాతీయ అవార్డులకు కేంద్రం నిర్ణయం

→దేశంలో సామాజిక అవగాహనను పెంపొందించి, అట్టడుగువర్గాల అభ్యున్నతికి విశేషంగా సేవలందించిన వారికి, అసమానతలు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి మానవత కోసం పని చేసిన వారికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అంతర్జాతీయ, జాతీయ అవార్డుల పేరిట వేర్వేరు పురస్కారాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అర్హులైన వారి ఎంపిక కోసం రెండు వేర్వేరు జ్యూరీలను ఏర్పాటు చేస్తూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు జ్యూరీలకూ ఉపరాష్ట్రపతి ఎక్స్‌ అఫిషియో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. అన్యాయాలు, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి ఇచ్చే అంతర్జాతీయ అవార్డుకు అర్హులైన వ్యక్తులు/సంస్థలను ఎంపిక చేసే జ్యూరీకి లోక్‌సభ స్పీకర్, అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన వారికి ఇచ్చే జాతీయ అవార్డు కోసం ఎంపిక చేసే జ్యూరీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎక్స్‌అఫిషియో వైస్‌ ఛైర్‌పర్సన్స్‌గా వ్యవహరిస్తారు.
→ ఈ రెండు జ్యూరీల్లో సభ్యులుగా యూజీసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.జగదీష్‌కుమార్, ఎన్‌హెచ్‌ఆర్‌సీ మెంబర్‌ డాక్టర్‌ ద్యానేశ్వర్‌ మనోహర్‌ మూలే, ఆంధ్రప్రదేశ్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ టీవీ కట్టిమణి, దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మిలింద్‌ కాంబ్లేలు నియమితులయ్యారు. ఈ సభ్యులు మూడేళ్లపాటు కొనసాగుతారు. అలాగే అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసం పని చేసిన వారిని ఎంపిక చేసే జ్యూరీలో సభ్యులుగా అదనంగా కేంద్ర సమాచార కమిషనర్‌ ఉదయ్‌ మహుర్‌కర్‌ను నియమించారు. రెండు కమిటీలకు సభ్య/సభ్యకార్యదర్శిగా సామాజిక న్యాయం, సాధికారశాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు.
→ సమాజంలో అణగారిన వర్గాలకు జరిగే అన్యాయాలు, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, సామాజిక మార్పు కోసం విశేషంగా సేవలందించే వ్యక్తులు/సంస్థలకు వేర్వేరుగా, సంయుక్తంగా ఏటా ఒక అవార్డు ప్రకటించి రూ.15 లక్షల నగదు బహుమతి అందిస్తారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసే మహిళలు, పురుషులు, సంస్థలు/సంఘాల పేరుతో ఏటా మూడు అవార్డులు, అవార్డుకు ఎంపికైన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందిస్తారు.