ఆర్ధిక రంగం



ఎలాన్‌ మస్క్‌ చేతికి ట్విటర్‌

→విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ ప్రముఖ అంతర్జాతీయ సామాజిక మాధ్యమం ‘ట్విటర్‌’ను కొనుగోలు చేశారు.
→ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన ఆయన రెండు వారాల క్రితమే ఈ సంస్థలో 9.2% వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటించారు.
→ప్రస్తుతం సంస్థ మొత్తాన్నీ తన అధీనంలోకి తీసుకున్నారు. తాజాగా దాదాపు 44 బిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదిరింది.
→ట్విటర్‌ కొనుగోలు నిధులను బ్యాంకుల ద్వారా మస్క్‌ సమకూర్చుకున్నట్లు ‘ద వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ పేర్కొంది.

దేశంలోనే తొలి పోర్టబుల్‌ సోలార్‌ రూఫ్‌టాప్‌ ఆవిష్కరణ

→దేశంలోనే తొలి పోర్టబుల్‌ సౌర ఫలకల వ్యవస్థను గాంధీనగర్‌లోని స్వామినారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయ కాంప్లెక్స్‌లో ఆవిష్కరించారు.
→జర్మనీకి చెందిన డాయిష్‌ జెసెల్‌షాఫ్ట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ జుసామెనార్బిట్‌ (జీఐజడ్‌) సహకారంతో 10 పీవీ పోర్ట్‌ వ్యవస్థలను ఇందులో నెలకొల్పినట్లు సంస్థ తెలిపింది.
→ దేశంలోని నగరాల్లో పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కోసం కేంద్ర కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
→ జీఐజడ్‌ డిజైన్‌ చేసిన ఈ పీవీ పోర్ట్‌ సిస్టమ్స్‌ను ప్రామాణిక ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో వినియోగించుకోవచ్చు.
→ బ్యాటరీ స్టోరేజీ ఉండి/లేకుండా కనీసం 2 కేడబ్ల్యూపీ సామర్థ్యంతో వినియోగించుకోవచ్చు. కాగా, ఈ పీవీ పోర్ట్స్‌ను దిల్లీకి చెందిన సెర్వోటెక్‌ పవర్‌సిస్టమ్స్‌ తయారు చేసింది.
→ ఈ కంపెనీ ‘భారత్‌లో తయారీ’ కింద హై ఎండ్‌ సోలార్‌ ఉత్పత్తులైన ఎల్‌ఈడీలు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ఈవీ ఛార్జింగ్‌ సామగ్రి తదితరాలను తయారు చేస్తోంది.
→ ‘పీవీ పోర్ట్‌ సిస్టమ్స్‌కు వ్యయం, నిర్వహణ భారం తక్కువ. భారత వాతావరణానికి తగినవి. కేవలం ఒక వ్యక్తి సులభంగా ఇన్‌స్టాల్‌ చేయొచ్చు. 25-30 ఏళ్ల వరకు వీటిని వినియోగించుకోవచ్చు.
→ప్యానెళ్ల కింద స్థలాన్ని సైతం వినియోగించుకునేలా తయారు చేసిన ఈ పీవీ పోర్ట్‌ సిస్టమ్‌ ద్వారా సగటున ఏటా రూ.24,000 వరకు విద్యుత్తు బిల్లులను ఆదా చేసుకోవచ్చ’ని ఆ ప్రకటన వివరించింది.

విప్రో ఏపీఎంఈఏ సీఈఓగా అనిస్‌ చెన్‌చా

→ఐటీ దిగ్గజం విప్రో ఏపీఎంఈఏ (ఆసియా పసిఫిక్, ఇండియా, మధ్యప్రాచ్య, ఆఫ్రికా) సీఈఓగా అనిస్‌ చెన్‌చా నియమితులయ్యారు. విప్రో, ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుడిగా సైతం ఆయన చేరనున్నారు. →కన్సల్టింగ్, ఐటీ, బిజినెస్‌ ప్రాసెస్‌ సర్వీసెస్‌లో ఆయనకు రెండు దశాబ్దాలుగా పైగా పనిచేసిన అనుభవం ఉంది. →ఇంతకు ముందు చెన్‌చా క్యాప్‌జెమినీ బిజినెస్‌ సర్వీసెస్‌ గ్లోబల్‌ సీఈఓగా వ్యవహరించారు. గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు.

24/7 డిజిటల్‌ బ్యాంకులు

→రోజంతా(24/7) డిజిటల్‌ ఉత్పత్తులు, సేవలను అందించే డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల(డీబీయూ)ను ప్రస్తుత బ్యాంకులు ఆరంభించవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. ఇందుకోసం మార్గదర్శకాలను విడుదల చేసింది.
→గతంలో డిజిటల్‌ బ్యాంకింగ్‌ అనుభవం ఉన్న షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు ఒకటో శ్రేణి నుంచి ఆరో శ్రేణి కేంద్రాల్లో డీబీయూలను తెరిచేందుకు అనుమతిస్తోంది.
→దేశంలోని 75 జిల్లాల్లో 75 డీబీయూలను ఏర్పాటు చేయనున్నారు.
→ఏమిటీ డీబీయూ: ఇది ప్రత్యేక వ్యాపార కేంద్రం. డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఉత్పత్తులు, సేవలు అందించడానికి కావలసిన కనీస డిజిటల్‌ మౌలిక వసతులు ఇందులో ఉంటాయి.
→ఖాతా తెరవడం, డబ్బుల విత్‌డ్రా, డిపాజిట్, కేవైసీ మార్పులు, రుణాలు, ఫిర్యాదుల స్వీకరణ వంటి సేవలను డీబీయూలు అందజేస్తాయి.
→ప్రస్తుత బ్యాంకింగ్‌ అవుట్‌లెట్లలో భాగంగా కాకుండా ఇవి విడిగా ఉంటాయి. ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలుంటాయి. డిజిటల్‌ బ్యాంకింగ్‌ వినియోగదార్ల అవసరాలు తీర్చే విధంగానే ఉంటాయి.
→వీటి కార్యకలాపాలకు బ్యాంకులు సొంత లేదా పొరుగు సేవల సిబ్బందిని వినియోగించుకోవచ్చు.

యూపీఐ చెల్లింపులు, నగదు బదిలీకి ‘టాటా న్యూ’

→కూరగాయలు.. కిరాణా సరకులు.. దుస్తులు.. మందులు.. హోటల్‌ గదులు- విమాన టికెట్ల బుకింగులు.. నగదు బదిలీ, వినియోగ బిల్లుల చెల్లింపులు.. ఇలా అన్ని సేవలు ఒకే ప్లాట్‌ఫామ్‌పై లభించేలా రూపొందించిన సూపర్‌ యాప్‌ ‘టాటా న్యూ’ను టాటా గ్రూప్‌ ఆవిష్కరించింది. →దేశంలో ఇకామర్స్‌ వ్యాపారం శరవేగంగా వృద్ధి చెందుతున్న సమయంలో సూపర్‌యాప్‌తో టాటా గ్రూప్‌ రంగంలోకి దిగింది. →అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్‌ జియో మార్ట్‌ సంస్థల తరహాలోనే ఈ యాప్‌తో, దేశీయ ఇకామర్స్‌లో కీలక పాత్ర పోషించాలని టాటా గ్రూప్‌ భావిస్తోంది. →టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌. వినియోగదారులను అట్టేపెట్టుకునేందుకు లాయల్టీ పథకం కూడా టాటా న్యూలో ఉంది. →ప్రతి కొనుగోలుపై రివార్డు పాయింట్లుగా పరిగణించే ‘న్యూకాయిన్స్‌’ లభిస్తాయి. టాటా న్యూ యాప్‌ ప్రాజెక్ట్‌ మొత్తం చంద్రశేఖరన్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది. →టాటా డిజిటల్‌ సీఈఓ ప్రతీక్‌ పాల్‌ కీలక పాత్ర పోషించారు.

సాంకేతిక రంగంలో మూడో అతిపెద్ద కొనుగోలు

→సామాజిక మాధ్యమం ట్విటర్‌ కొనుగోలుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఆఫర్‌ చేసిన మొత్తం ప్రపంచ సాంకేతిక రంగంలో సంచలనమే అయ్యింది.
→44 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.30 లక్షల కోట్ల)తో కుదుర్చుకున్న ఒప్పందం, అంతర్జాతీయ సాంకేతిక రంగంలోనే, మూడో అతిపెద్ద కొనుగోలు లావాదేవీగా నిలవనుంది.
→ గేమింగ్‌ సంస్థ యాక్టివిజన్‌ బిజార్డ్‌ను 68.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.5.15 లక్షల కోట్ల) కు కొనుగోలు చేసే ప్రక్రియను ఈ ఏడాది జనవరిలోనే మైక్రోసాఫ్ట్‌ పూర్తి చేసింది. సాంకేతిక రంగంలో అతిపెద్ద కొనుగోలు లావాదేవీ ఇప్పటివరకు ఇదే.
→ 2015లో నెట్‌వర్క్‌ స్టోరేజీ దిగ్గజం ఈఎంసీ కార్ప్‌ను 67 బిలియన్‌ డాలర్లకు డెల్‌ కొనుగోలు చేసి, డెల్‌ టెక్నాలజీస్‌గా మారింది. ఈ లావాదేవీ రెండో అతిపెద్ద మొత్తంగా ఉంది.
→ అమెరికాలోని చిప్‌ తయారీ సంస్థ బ్రాడ్‌కామ్‌ను పోటీ సంస్థ అవాగో టెక్నాలజీస్‌ 37 బిలియన్‌ డాలర్లతో 2015లో కోనుగోలు చేయడం ద్వారా, అతిపెద్ద సెమీకండక్టర్‌ సరఫరాదారుగా మారింది. ఇప్పటివరకు ఈ లావాదేవీ టెక్‌ రంగంలో మూడో అతిపెద్దదిగా ఉండగా, ట్విటర్‌ లావాదేవీ వల్ల నాలుగో స్థానానికి చేరుతోంది.
→ 2020 అక్టోబరులో చిప్‌ తయారీ సంస్థ ఎక్స్‌లింక్స్‌ను మరో పోటీ సంస్థ ఏఎమ్‌డీ 35 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ఫలితంగా ఇంటెల్‌తో పోటీపడే స్థాయికి ఏఎండీ చేరింది.
→ ఎంటర్‌ప్రైజ్‌ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం రెడ్‌హ్యాట్‌ను 2019 జులైలో ఐబీఎం సంస్థ 34 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసి, క్లౌడ్‌ సేవల రంగంలో దూసుకెళ్తోంది.

ట్విటర్‌ గురించి :-
→ 2006లో జాక్‌ డోర్సె, నోగ్లాస్, బిజ్‌స్టోన్, ఎవాన్‌ విలియం నేతృత్వంలో మైక్రోబ్లాగింగ్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌గా అమెరికాలో ఏర్పాటైంది. పదహారేళ్ల ప్రాయంలో ఉన్న ట్విటర్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు వినియోగిస్తున్న మొబైల్‌ యాప్‌లలో 6వ స్థానం పొందింది.
→ ట్విటర్‌లో 130 కోట్లకు పైగా ఖాతాలున్నాయి.
→ 140 పదాల్లోనే తమ భావాలను ట్వీట్‌ ద్వారా వ్యక్తీకరించాల్సి ఉంది.
→ రోజుకు 19.2 కోట్ల మంది, నెలకు 39.65 కోట్ల మంది వినియోగిస్తున్నారు.
→ ఉత్తర అమెరికాతో పాటు జపాన్, భారత్, జర్మనీలలో ట్విటర్‌ వినియోగం ఎక్కువ.

యూఏఈ రసాయన ప్రాజెక్ట్‌ కోసం రిలయన్స్‌ ఒప్పందం

→యూఏఈలో 2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.15,000 కోట్ల) విలువైన అబుదాబి కెమికల్స్‌ డెరివేటివ్‌ కంపెనీ ఆర్‌ఎస్‌సీ (తాజిజ్‌) రసాయన ప్రాజెక్ట్‌ కోసం వాటాదార్లతో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది.
→అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (ఏడీఎన్‌ఓసీ), సౌర్వభౌమ సంపద నిధి ఏడీక్యూలు సంయుక్తంగా తాజిజ్‌ను ఏర్పాటు చేశాయి.
→సంప్రదాయ, సంప్రదాయేతర వనరుల అన్వేషణ, ఉత్పత్తి నిమిత్తం ఏడీఎన్‌ఓసీతో కలిసి పనిచేయడానికి కూడా రిలయన్స్‌ చర్చలు జరుపుతోంది.
→ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా తాజిజ్‌ ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ జోన్‌లో వార్షికంగా 9,40,000 టన్నుల క్లోర్‌-ఆల్కలీ, 1.1 మిలియన్‌ టన్నుల ఇథలీన్‌ డైక్లోరైడ్, 3,60,000 టన్నుల పాలీవినైల్‌ క్లోరైడ్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌లను రిలయన్స్, తాజిజ్‌ నిర్మించనున్నాయి.
→యూఏఈలో ఈ రసాయనాలను ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారని కంపెనీ తెలిపింది. రిలయన్స్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పర్యటనలో భాగంగా ఏడీఎన్‌ఓసీ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు వాటాదార్ల ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఫెడెక్స్, మాస్టర్‌కార్డ్‌ అధిపతులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం

→అమెరికా దిగ్గజ సంస్థలైన ఫెడెక్స్, మాస్టర్‌కార్డ్‌ సీఈఓలతో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ అయ్యారు.
→ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో పెట్టుబడులకు గల అవకాశాలను వారితో చర్చించారు.
→2022 ఐఎంఎఫ్‌ - ప్రపంచబ్యాంక్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు నిర్మలా సీతారామన్‌ అమెరికా వెళ్లారు.
→భారత్‌పై సానుకూలంగా ఉన్నామని, నైపుణ్యాలు సహా విస్తరణ ప్రణాళికలు ఉన్నట్లు ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఫెడెక్స్‌ అధ్యక్షుడు, సీఈఓ రాజ్‌ సుబ్రమణియమ్‌ పేర్కొన్నారు.
→యాక్సెంచర్‌ ఛైర్, సీఈఓ జూలీ స్వీట్‌తో కూడా సీతారామన్‌ భేటీ అయ్యారు. మాస్టర్‌ కార్డ్‌ సీఈఓ మైబ్యాచ్‌ మైఖేల్, డెలాయిట్‌ గ్లోబల్‌ సీఈఓ పునీత్‌ రంజన్‌లతో కూడా ఆర్థిక మంత్రి సమావేశమయ్యారు.
→మాస్టర్‌ కార్డ్‌ భారత్‌లో ఏర్పాటు చేయనున్న డేటా కేంద్రాలపై చర్చించారు. భారత్‌ పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉందని రంజన్‌ అన్నారు.

2022 ఫార్మా, ఔషధ పరికరాల రంగం 7వ అంతర్జాతీయ సదస్సు

→దేశంలో పేటెంట్‌ ఔషధాల తయారీని ప్రోత్సాహించేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి మన్షుక్‌ మాండవీయ పేర్కొన్నారు.
→ఫార్మా, ఔషధ పరికరాల రంగం 2022 7వ అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్న సందర్భంగా మంత్రి మాట్లాడారు.
→రాబోయే 25 సంవత్సరాలకు దేశీయ ఫార్మా రంగానికి దిక్సూచిని అందించేందుకు ఈ సమావేశాలు ఉపయోగ పడతాయని మాండవీయ వివరించారు.
→ప్రస్తుతం భారత్‌లో 3,500కు పైగా ఫార్మా కంపెనీలు, 10,500 తయారీ యూనిట్‌లు జనరిక్‌ ఔషధ ఉత్పత్తిలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.

బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగా నిమేశ్‌ పటేల్‌

→బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ) కొత్త అధ్యక్షుడిగా నిమేశ్‌ పటేల్‌ను ఎన్నుకున్నారు.
→ముడి సరకుల వ్యయాలు భారీగా పెరగడం, నైపుణ్య కార్మికుల లేమి, నియంత్రణ ప్రాధికార సంస్థ లేకపోవడం, నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా కల్పించకపోవడం వంటి వివిధ సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరుతోంది.
→ప్రధాని మోదీ దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి, వీటి పరిష్కారానికి కృషి చేస్తానని బీఏఐ సభ్యులకు నిమేశ్‌ పటేల్‌ హామీ ఇచ్చారు.
→స్థిరాస్తి రంగానికి రెరాను ఏర్పాటు చేసినట్లు, సిమెంట్‌ రంగానికీ సిమెంట్‌ నియంత్రణ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
→8 దశాబ్దాల చరిత్ర కలిగిన బీఏఐ అధ్యక్షుడిగా గుజరాత్‌ నుంచి ఎన్నికైన తొలి వ్యక్తి నిమేశ్‌ కావడం విశేషం. ఈయన మారుతీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సీఎండీ ఈ సంస్థ బీఎస్‌ఈలో నమోదైంది.
→మౌలిక వసతుల కల్పన, స్థిరాస్తి నిర్మాణ పనుల్ని ఈ సంస్థ చేపడుతోంది.

ఆర్థిక శాఖ నెలవారీ నివేదిక

→కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రికత్తలతో సహా తాత్కాలిక ఆర్థిక షాక్‌లు దేశ వాస్తవ వృద్ధి, ద్రవ్యోల్బణంపై అధిక ప్రభావం చూపకపోవచ్చని ఆర్థిక శాఖ విడుదల చేసిన నెలవారీ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బాగా పెరిగాయని, ఇవి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని, వృద్ధిని కొంత మేర ప్రభావం చేసే అవకాశం ఉందని పేర్కొంది.
ముఖ్యాంశాలు :-
→ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గతిశక్తి, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు అంతర్జాతీయ అడ్డంకులను అధిగమించేలా చేసి పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నాయని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో సాగుతుందని పేర్కొంది.
→ 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ వాస్తవిక జీడీపీ వృద్ధి 8-8.5 శాతం మధ్య నమోదు కావొచ్చని ఆర్థిక సర్వే వెల్లడించిందని గుర్తుచేసింది. దేశ చమురు దిగుమతి బిల్లు పెరగకుండా ప్రత్యామ్నాయ వనరుల వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోందని, రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయబోతోందని తెలిపింది.
→ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో వృద్ధి, ఇతర మూలధనం రాక వంటి పరిణామాలతో సంబంధం లేకుండా దిగుమతులకు అవసరమైన 12 నెలల విదేశీ మారకపు నిల్వలు దేశం వద్ద ఉన్నాయని వివరించింది.

ఐటీ ఆదాయాల్లో 3-3.5% వృద్ధి

→గత ఆర్థిక సంవత్సరం (2021-22) నాలుగో త్రైమాసికంలోనూ ఐటీ కంపెనీలు మెరుగ్గా రాణిస్తాయనే అంచనాను బ్రోకరేజీ సంస్థలు వెలువరించాయి. డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే జనవరి-మార్చి త్రైమాసికంలో ఐటీ సంస్థల ఆదాయాలు 3-3.5 శాతం పెరగొచ్చని పేర్కొన్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఫలితాలు ఏప్రిల్‌ 11న, ఇన్ఫోసిస్‌ ఫలితాలు 13న వెలువడనున్నాయి.
→ సెప్టెంబరు - ఆగస్టు ఆర్థిక సంవత్సరాన్ని పాటించే యాక్సెంచర్‌ గత నెలలో ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడం.. దేశీయ ఐటీ సంస్థలకూ సానుకూల సంకేతంగా భావించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఖాతాదారుల్లో 30 శాతం మంది మాత్రమే ఇప్పటివరకు క్లౌడ్‌కు బదిలీ అయ్యారని.. మున్ముందు ఈ విభాగంలో భారీ ఒప్పందాలకు అవకాశాలు కన్పిస్తున్నాయని యాక్సెంచర్‌ ఆ సమయంలో వెల్లడించింది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, ద్రవ్యోల్బణం ప్రభావాలు ఐటీ గిరాకీపై ఉండవని అంచనా వేస్తున్నారు.

2022 - 23లో 7.5% వృద్ధి

→ప్రపంచంలోనే అధిక వేగవంత వృద్ధి కలిగిన ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగనుంది. →బలమైన పెట్టుబడుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022 - 23)లో భారత్‌ 7.5 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అంచనా వేసింది. →2022 జనవరి - డిసెంబరులో చైనా వృద్ధి రేటు అంచనా అయిన 5 శాతం కంటే ఇది అధికం. →వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ భారత్‌ 8 శాతం వృద్ధి రేటు, చైనా (2023) 4.8 శాతం వృద్ధి రేటును నమోదు చేయగలవని ‘ద ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ అవుట్‌లుక్‌ 2022’లో అంచనా వేసింది. →భారత్‌లో ప్రభుత్వ పెట్టుబడులకు తోడు బలమైన ప్రైవేటు పెట్టుబడులూ జతయ్యే పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం

→ దేశ కార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద విలీనం చోటు చేసుకుంది. భారత్‌లోనే అతిపెద్ద గృహ రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం అవుతోంది. దీంతో ఒక గొప్ప బ్యాంకింగ్‌ దిగ్గజం ఏర్పాటు కానుంది.
→ 40 బిలియన్‌ డాలర్ల ఒప్పంద విలువతో మొత్తం రూ.3.3 లక్షల కోట్ల నికర విలువ గల; రూ.18 లక్షల కోట్ల బ్యాలెన్స్‌ షీట్‌తో సంస్థ ఏర్పాటు అవుతుంది.
ఇదీ ఒప్పందం :-
→ఈ లావాదేవీలో ప్రమోటరు హోదాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 21 శాతం వాటా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ, తన రెండు అనుబంధ కంపెనీలైన హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్‌; హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లతో కలిసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం అవుతుంది.
→ఒక్కసారి ఒప్పందం అమల్లోకి వచ్చాక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 100 శాతం పబ్లిక్‌ వాటాదార్ల సొంతమవుతుంది.
→ప్రస్తుత హెచ్‌డీఎఫ్‌సీ వాటాదార్లకు బ్యాంక్‌లో 41 శాతం వాటా దక్కుతుందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో ఇరు కంపెనీలు పేర్కొన్నాయి.
→హెచ్‌డీఎఫ్‌సీ వాటాదార్లకు ప్రతీ 25 షేర్ల (ఒక్కోటీ రూ.2 ముఖ విలువ)కు 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు (ఒక్కోటి రూ.1 ముఖ విలువ) లభిస్తాయి.
→ఈ విలీనం 2023 - 24 రెండో లేదా మూడో త్రైమాసికంలో పూర్తి కానుంది. ఆర్‌బీఐ, ఇతర నియంత్రణ సంస్థల అనుమతులు ఇందుకు లభించాల్సి ఉంది.
→‘ఈ విలీనం వల్ల బ్యాంక్‌లోకి మరింత విదేశీ సంస్థాగత మదుపర్ల వాటాకు అవకాశం లభిస్తుంద’ని హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ఛైర్మన్, సీఈఓ కేకీ మిస్త్రీ పేర్కొన్నారు.

బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌కు ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానం

→కొవిడ్‌-19 టీకా ఉత్పత్తి చేయటానికి అవసరమైన ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ (బీఈ) కి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) అందించనుంది. ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయటానికి మనదేశం నుంచి అందిన ప్రతిపాదనలను డబ్లూహెచ్‌ఓ సలహా మండలి పరిశీలించింది. →ఈ ప్రక్రియలో బీఈని ఎంపిక చేసింది. సాధ్యమైనంత త్వరగా ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానంతో టీకా ఉత్పత్తి చేయటానికి అనువుగా బీఈతో డబ్లూహెచ్‌ఓ, దాని భాగస్వామ్య సంస్థలు కలిసి పనిచేస్తాయి. తొలిదశలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొవిడ్‌-19 టీకాకు ఉపయోగించినప్పటికీ మలిదశలో ఇతర మందులు, చికిత్సలకు సైతం వినియోగించే అవకాశం ఉంది. → ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల్లో ల్యాబ్‌లో సృష్టించిన ఒక మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏను వినియోగిస్తారు. ప్రొటీన్‌ను ఏవిధంగా ఉత్పత్తి చేయాలనే విషయాన్ని మానవ కణాలకు ఈ మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ నేర్పుతుంది. తద్వారా మానవ శరీరంలో ప్రొటీన్‌ ఉత్పత్తి అవుతుంది. వ్యాధులపై పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని ఈ ప్రొటీన్‌ అందిస్తుంది. మనదేశంలో ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో రూపొందించిన కొవిడ్‌ టీకాలు అందుబాటులో లేని విషయం గమనార్హం. కొవిషీల్డ్‌ టీకా వైరల్‌ వెక్టార్‌ ప్లాట్‌ఫామ్‌ ఆధారిత టీకా కాగా, కొవాగ్జిన్‌ టీకాను ఇనాక్టివేటెడ్‌ వీరో సెల్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌తో ఆవిష్కరించారు. జైకోవ్‌-డి, డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌ వెక్టార్‌ వ్యాక్సిన్‌ కావటం గమనార్హం. బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ ప్రస్తుతం అందిస్తున్న కార్బెవ్యాక్స్‌ను రీకాంబినెంట్‌ ప్రొటీన్‌ సబ్‌-యూనిట్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిష్కరించారు. → డబ్లూహెచ్‌ఓ నుంచి కీలకమైన ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానం లభిస్తున్నందున ప్రపంచ వ్యాప్తంగా అందుబాటు ధరలో టీకాలు అందించగలుగుతామని బీఈ లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల ఈ సందర్భంగా వివరించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి తమ సంస్థ ఎంపిక కావటం సంతోషంగా ఉందన్నారు. గత ఏడాది కాలంగా ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానంపై తాము పనిచేస్తున్నామని, దీంతో సమీప భవిష్యత్తులో ఎన్నో కొత్త టీకాలు ఆవిష్కరిస్తామని తెలిపారు.

2022 - 23లో వృద్ధి రేటు 7.4 శాతం: ఫిక్కీ

→దేశ వృద్ధి రేటు 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతంగా నమోదు కావొచ్చని ఫిక్కీ అంచనా వేసింది.
→రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం అంతర్జాతీయ ఆర్థిక రికవరీకి అతి పెద్ద సవాలుగా నిలుస్తోందని, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని సంస్థ పేర్కొంది.
→ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ సర్వే నివేదికను ఫిక్కీ విడుదల చేసింది. దీని ప్రకారం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2022 రెండో అర్ధభాగంలో వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపే అవకాశం ఉంది.
→ఈ ఆర్థిక సంవత్సరం (2022 - 23) ముగిసే నాటికి రెపో రేటును 50-75 బేసిస్‌ పాయింట్ల మేర పెంచొచ్చు.

జులై 1 వరకూ కొత్త పథకాలు వద్దు: సెబీ

→మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు జులై 1 వరకూ కొత్త పథకాలు (ఎన్‌ఎఫ్‌ఓ) విడుదల చేయొద్దని సెబీ ఆదేశించింది.
→మ్యూచువల్‌ ఫండ్‌ పంపిణీదార్లు, ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లు, స్టాక్‌ బ్రోకర్లు, పెట్టుబడుల సలహాదార్లు పూల్‌ ఖాతాలను నిలిపి వేయాలని గతంలో సెబీ స్పష్టం చేసింది.
→ఈ నిబంధనను ఈ ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. కానీ, భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (యాంఫీ) విజ్ఞప్తి మేరకు ఈ గడువును జులై 1 వరకూ పొడిగించింది.
→అప్పటి వరకూ కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలనూ తీసుకురావద్దని స్పష్టం చేసింది.

రికార్డు గరిష్ఠానికి జీఎస్‌టీ వసూళ్లు

→వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు మార్చిలో రూ.1.42 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
→ఇప్పటివరకు ఒక నెలలో వసూలైన అత్యధిక జీఎస్‌టీ వసూళ్లు ఇవే. ఈ ఏడాది జనవరిలో వసూలైన రూ.1,40,896 కోట్లే ఇప్పటివరకు అత్యధిక మొత్తంగా ఉంది.
→2021 మార్చి వసూళ్లు రూ.1,23,902 కోట్లతో పోలిస్తే ఈసారి 15 శాతం అధికం.
→ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, పన్ను ఎగవేతలు తగ్గడం, నకిలీ రశీదుల నియంత్రణకు చర్యలు చేపట్టడం ఇందుకు కారణాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
→2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ కేంద్ర వాటా వసూళ్లు రూ.5.7 లక్షల కోట్లుగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేయగా, అంతకు మించి వసూలయ్యాయి.