రాష్ట్రీయం -ఆంధ్ర ప్రదేశ్



ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవం

→పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణలో భాగంగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు.
→దీని వల్ల పరిపాలన ప్రజలకు మరింత చేరువవుతుందన్నారు. ప్రతి జిల్లాలో ఏర్పాటయ్యే కార్యాలయాల వల్ల వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మంచి చేకూరుతుందని పేర్కొన్నారు.
→రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు.
→ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే 26 జిల్లాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సగటున 19.7 లక్షల మంది జనాభాతో ఒక్కో జిల్లా:-
→‘‘దేశంలో యూపీలో అత్యధికంగా 75, తక్కువగా గోవాలో రెండు జిల్లాలు ఉన్నాయి. అతి పెద్ద రాష్ట్రాల్లో ఏడో స్థానంలో ఉన్న ఏపీలో 13 జిల్లాలు మాత్రమే ఉన్నాయి.
→చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్‌ప్రదేశ్‌లో 1.35 కోట్ల మంది జనాభాకు ఏకంగా 25 జిల్లాలు ఉన్నాయి.
→ఒక్కో జిల్లాలో సగటున మహారాష్ట్రలో 31 లక్షలు మంది, కర్ణాటకలో 20 లక్షలు, యూపీలో 26.64 లక్షల మంది చొప్పున ఉన్నారు.
→ఉత్తరాఖండ్‌లో కేవలం ఆరు లక్షలు, మిజోరంలో లక్ష మందికి, అరుణాచల్‌ప్రదేశ్‌లో 53 వేల మందికి ఒక్కో జిల్లా ఉంది.
→తెలంగాణలో 10.60 లక్షల మంది చొప్పున ఉన్నారు. ఆ రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడ్డాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల్లో కలిపి 4.90 కోట్ల మంది ఉన్నారు.
→దీని ప్రకారం ప్రతి జిల్లాలో సగటున 38.15 లక్షల మంది ఉన్నారు. ఇంత ఎక్కువ జనాభా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు.
→కొత్తగా వచ్చిన జిల్లాల ద్వారా 19.07 లక్షల మంది సగటున ఒక్కో జిల్లాలో ఉన్నారు. ప్రతి జిల్లా పరిధిలో 18 లక్షల నుంచి 23 లక్షల మంది జనాభా ఉండేలా చర్యలు తీసుకున్నాం.
→1970లో ప్రకాశం, 1979లో విజయనగరం జిల్లా ఏర్పడింది. ఆ తర్వాత ఇప్పుడే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి.ఇప్పుడు కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత ఎక్కువగా ఉన్నాయి.
→రామ స్థాయి నుంచి పౌర సేవల్లో వేగం, పారదర్శకత పెరిగింది. అవినీతి, వివక్ష తగ్గింది. సంతృప్తి స్థాయిలో పథకాలు అమలవుతున్నాయి.

జిల్లాల సమాచార పుస్తకావిష్కరణ:-
→ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రణాళిక శాఖ రూపొందించిన ‘డిస్ట్రిక్ట్‌ హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌’ను సీఎం ఆవిష్కరించారు.
→1808లో కడప జిల్లా తొలిసారిగా ఏర్పడింది. అదే శతాబ్దంలో కృష్ణా, అనంతపురం జిల్లాలు వచ్చాయి.
→1909లో గుంటూరు, 1911లో చిత్తూరు, 1925లో ఉభయగోదావరి జిల్లాలు ఏర్పడ్డాయి. 1953లో కర్నూలు, నెల్లూరు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
→ఆ తర్వాత ప్రకాశం, విజయనగరం జిల్లాలు ఏర్పడ్డాయి.

కొత్త జిల్లాల జనాభాలో నెల్లూరు, విస్తీర్ణంలో ప్రకాశంలదే అగ్రస్థానం

→ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల లెక్క తేలింది. 72 రెవెన్యూ డివిజన్లతో 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి.
→అధిక జనాభా, మండలాలు కలిగిన జిల్లాల్లో నెల్లూరు తొలి స్థానంలో, ప్రకాశం జిల్లా రెండో స్థానంలో నిలిచాయి.
→రెండు జిల్లాల్లోనూ 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 38 మండలాల చొప్పున ఉన్నాయి.
23% జనాభా 5 జిల్లాల్లోనే:-
→నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, ఎన్టీఆర్‌ జిల్లాలు జనాభా పరంగా ముందున్నాయి. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో (2011 లెక్కలు) ఈ 5 జిల్లాల వాటాయే 23%పైగా ఉండటం గమనార్హం.
→ విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా ప్రకాశం నిలిచింది. 14,322 చ.కి.మీ.విస్తీర్ణంలో ఇది ఉంది. తర్వాత స్థానంలో అల్లూరి సీతారామరాజు 12,251 చ.కి.మీ., కడప జిల్లా 11,228 చ.కి.మీ.చొప్పున ఉన్నాయి. రాష్ట్ర మొత్తం విస్తీర్ణంలో ఈ మూడు జిల్లాలే 23.19 శాతం ఆక్రమించాయి.
→ విస్తీర్ణం, మండలాల పరంగా చూస్తే రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లాగా విశాఖపట్నం నిలిచింది. 11 మండలాలతో ఉన్న జిల్లా విస్తీర్ణం 1,048 చ.కి.మీ.మాత్రమే. తర్వాతి స్థానంలో కోనసీమ జిల్లా 2,083, పశ్చిమగోదావరి 2,178, గుంటూరు 2,443, తూర్పుగోదావరి 2,561, కాకినాడ 3,019 చ.కి.మీ. ఉన్నాయి. ఈ 6 జిల్లాల మొత్తం విస్తీర్ణం కలిపినా ప్రకాశం జిల్లా కంటే తక్కువే.
→ ఎస్‌పీఎస్‌ నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లోని మొత్తం మండలాల సంఖ్య 240.. అంటే రాష్ట్రంలోని మొత్తం మండలాల్లో 35.35% మండలాలు ఈ 7 జిల్లాల్లోనే ఉన్నాయి.

కొత్త రెవెన్యూ డివిజన్లుగా పులివెందుల, కొత్తపేట

→జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా కడప జిల్లాలో పులివెందుల, కోనసీమ జిల్లాలో కొత్తపేటలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ప్రకటిస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్లను జారీ చేసింది. → కడప జిల్లాలోని జమ్మలమడుగు, కడప రెవెన్యూ డివిజన్లలోని ఎనిమిది మండలాలను వేరు చేసి, కొత్తగా పులివెందుల రెవెన్యూ డివిజన్‌ను ప్రతిపాదించారు. →ఈ డివిజన్‌లో సింహాద్రిపురం, వేముల, లింగాల, తొండుర్, పులివెందుల, వెంపల్లి, చక్రాయపేట, వీరపునాయునిపల్లె ఉన్నాయి.

సంగం బ్యారేజీకి దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి పేరు

→శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టారు. →మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీగా పేరు మారుస్తూ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీన్ని గెజిట్‌లో ప్రచురించాలని సూచించారు.

ఏపీలో కొలువుదీరిన నూతన మంత్రివర్గం

పాత, కొత్తల కలయికతో పునర్‌వ్యవస్థీకరించిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరింది. మంత్రులతో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి శాఖలు కేటాయించారు. సీనియర్లలో కొందరికి ముఖ్యమైన శాఖలు లభించగా కొందరికి యథావిధిగా అప్రాధాన్య విభాగాలే దక్కాయి. ఈసారి కూడా అయిదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. ఒక్కో వర్గానికి ఒక్కోటి చొప్పున పంపిణీ చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన మహిళకే మళ్లీ హోం శాఖ అప్పగించారు.

మంత్రులు - శాఖలు:-
1. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి - ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ
2. తానేటి వనిత - హోం
3. ధర్మాన ప్రసాదరావు - రెవెన్యూ, స్టాంపులు - రిజిస్ట్రేషన్లు
4. విడదల రజని - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య
5. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - విద్యుత్తు, అటవీ, పర్యావరణం, సైన్సు, టెక్నాలజీ, గనులు
6. అంబటి రాంబాబు - జలవనరులు
7. కాకాణి గోవర్ధన్‌రెడ్డి - వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, ఆహారశుద్ధి
8. సీదిరి అప్పలరాజు - పశుసంవర్థకం, పాడి అభివృద్ధి, మత్స్య
9. బొత్స సత్యనారాయణ - విద్య
10. గుడివాడ అమర్‌నాథ్‌ - పరిశ్రమలు, పెట్టుబడులు - ప్రాథమిక వసతులు, వాణిజ్యం, ఐటీ
11. ఆదిమూలపు సురేష్‌ - మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి
12. దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) - రహదారులు, భవనాలు
13. పినిపె విశ్వరూప్‌ - రవాణా
14. కారుమూరి వెంకట నాగేశ్వరరావు - పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు
15. జోగి రమేష్‌ - గృహ నిర్మాణం
16. ఆర్‌.కె.రోజా - పర్యాటకం, సాంస్కృతికం, యువజన సంక్షేమం
17. గుమ్మనూరు జయరాం - కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు
18. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ - బలహీనవర్గాల సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌరసంబంధాలు
19. మేరుగు నాగార్జున - సాంఘిక సంక్షేమం
20. కె.వి.ఉషశ్రీ చరణ్‌ - మహిళ, శిశు, వికలాంగులు, వయోజనుల సంక్షేమం
ఉప ముఖ్యమంత్రులు - శాఖలు
1. పీడిక రాజన్నదొర - గిరిజన సంక్షేమం
2. బూడి ముత్యాలనాయుడు - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
3. కొట్టు సత్యనారాయణ - దేవాదాయం
4. కె.నారాయణస్వామి - ఎక్సైజ్‌
5. అంజాద్‌ బాషా - మైనారిటీ సంక్షేమం

ఉత్తమ వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం

నరసరావుపేటలోని క్రీడా ప్రాంగణంలో ఉత్తమ వాలంటీర్లకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులు, నగదు పురస్కారం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. 2019 జూన్‌ నుంచి 2022 మార్చి వరకు వాలంటీర్లు పింఛన్ల రూపంలో రూ.50,508 కోట్లు పంపిణీ చేశారు. వాలంటీర్లు, సచివాలయాల ద్వారా అవినీతి లేని వ్యవస్థ సాకారమవుతోందని, 33 పథకాలు పారదర్శకంగా ప్రతి అర్హుడికీ అందుతున్నాయని సీఎం పేర్కొన్నారు. వాలంటీర్ల సేవలకు చిరు సత్కార కార్యక్రమాన్ని 20 రోజుల పాటు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 2.28 లక్షల మందికి సేవామిత్ర, 4,136 మందికి సేవారత్న, 875 మందికి సేవావజ్ర అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకు రూ.239 కోట్లు వెచ్చిస్తున్నట్లు సీఎం జనగన్‌ ప్రకటించారు.

శ్రీసిటీలో డైకిన్‌ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన

→డైకిన్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నూతన పరిశ్రమ నిర్మాణానికి చిత్తూరు జిల్లా శ్రీసిటీలో శంకుస్థాపన చేశారు.
→ఆ సంస్థకు ఇది దేశంలో 3వ ఉత్పత్తి కేంద్రం కాగా దక్షిణ భారతదేశంలో మొదటిది.
→శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాన్ని భారత్‌లోని జపాన్‌ రాయబారి సతోషి సుజుకీ, చెన్నైలోని జపాన్‌ కాన్సుల్‌ జనరల్స్‌ మసయుకి టాగా, ప్యుజిత, సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నయోకి నిషియొక, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సమక్షంలో డైకిన్‌ ఇండియా ఎండీ, సీఈవో కన్వాల్‌జీత్‌ జావా లాంఛనంగా శంకుస్థాపన నిర్వహించారు.
→శ్రీసిటీ డీటీజెడ్‌లో కేటాయించిన 75.5 ఎకరాల స్థలంలో రూ.1,000 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్లాంటులో 3వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.
→ఏటా 15లక్షల ఏసీ యూనిట్లతోపాటు కంప్రెషర్లు, కంట్రోలర్‌ బోర్డులు, ఇతర విడిభాగాలను తయారు చేస్తారు.
2023 జులై నాటికి ఉత్పత్తులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎండీ కన్వాల్‌జీత్‌ తెలిపారు.

ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం

→ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్‌ చేయడాన్ని నిషేధించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
→దీనికి నియమ నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది.
→సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకన్నారు.

క్యాన్సర్‌ కేసుల్లో 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

→తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్‌ కేసులు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2018, 2019, 2020 సంవత్సరాల్లో కలిపి తెలంగాణలో 1,39,419 కేసులు వెలుగుచూడగా ఏపీలో 2,06,677 కేసులు నమోదయ్యాయి. →ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బిహార్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ల తర్వాత అత్యధిక క్యాన్సర్‌ కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదయ్యాయి.

గ్రాసిం ఇండస్ట్రీస్‌-క్లోర్‌ ఆల్కలీ (కాస్టిక్‌ సోడా) పరిశ్రమ ప్రారంభం

→పరిశ్రమల స్థాపనే ప్రగతికి సోపానమని, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌-క్లోర్‌ ఆల్కలీ పరిశ్రమతో రాష్ట్రానికి రూ.2,470 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. →తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీస్‌-క్లోర్‌ ఆల్కలీ (కాస్టిక్‌ సోడా) పరిశ్రమను ఆయన ప్రారంభించారు.

ఏపీ శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఉమ్మారెడ్డి

→శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. →శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఉమ్మారెడ్డి నియమితులవడం ఇది రెండోసారి. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక తొలిసారి ఆయన మండలి చీఫ్‌ విప్‌గా నియమితులయ్యారు. →ఇటీవలే మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో, ప్రభుత్వం మళ్లీ ఆయనను చీఫ్‌ విప్‌గా నియమించింది.

న్యాయ శాఖ కార్యదర్శిగా సత్యప్రభాకర్‌రావు

→రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శిగా జి.సత్యప్రభాకర్‌రావు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం చిత్తూరులోని 8వ అదనపు జిల్లా న్యాయాధికారిగా సేవలందిస్తున్నారు. →సత్యప్రభాకర్‌రావును రెండేళ్ల పాటు డిప్యుటేషన్‌పై న్యాయశాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌గా కేసలి అప్పారావు

→ఆంధ్రప్రదేశ్‌ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌గా విజయనగరం జిల్లాకు చెందిన కేసలి అప్పారావును ప్రభుత్వం నియమించింది. → వీరు మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ విప్‌గా నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు

→పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి నాగరాజ వర ప్రసాద్‌ రాజు (ప్రసాద్‌రాజు)ను ఏపీ ప్రభుత్వం శాసనసభలో చీఫ్‌విప్‌గా నియమించింది. ప్రస్తుతం రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చీఫ్‌ విప్‌గా ఉన్నారు. ఆయన స్థానంలో ప్రసాద్‌రాజును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులోని ‘సారాంశం (అబ్‌స్ట్రాక్ట్‌)’లో ఆయన్ను చీఫ్‌ విప్‌గా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే నోటిఫికేషన్‌ భాగంలో మాత్రం ‘విప్‌’గా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.